Friday, September 01, 2006

కందిరీగ

ఊరంతా తిరిగి సంచారం సద్దుమణిగాక సూర్యుడు సేదదీరాక
చుక్కలు బిక్కు బిక్కు మంటూ ఒక్కొక్కటిగా మెరుస్తూ
నీలాకాశాన్ని జల్లెడగా తలపిస్తున్న వేళ
చిక్కటి చీకటిలో రెక్కలు టపటపలాడిస్తూ
నిశాచరంగా నిర్విరామంగా వడివడిగా సడిచేస్తూ
నా ఇంటి గుమ్మపు దిమ్మెపై ఉన్న దీపపు కాంతి చుట్టూ
గిరులు తిరిగుతున్న నీ రెక్కల సవ్వడి సంగీతం వింటుంటే
ఏదో చెప్పాలని ఏమోచెయ్యాలని నీలో పొంగుతున్న
భావార్ణవ ఘోష మస్తిష్కానికందని భాష
నాకర్థమయ్యింది...పరమార్థమయ్యింది.

ఊరి ఊసులన్నీ మోసుకొచ్చి మొరపెడుతున్నావని
లోకనాధుల చరితలు చేరవేయ గిరులు తిరుగుతున్నావని
దుమ్ము ధూళిలో తిరిగికూడా నిష్కళంకంగా ఉన్నావని
మనిషనే మృగాన్ని తృణీకరించి కందిరీగవయ్యావని

అన్నీ తెలిసికూడా బాధపడుతూ భ్రమపడుతూ
"నా" కోసం "నావారి" కోసం గ్రుడ్డివాడినయ్యాను
నీ శబ్ద ఘోష నా అంతరంగ బాషను మార్చింది
నీ వికృత రూపం నా వేషధారణను నిలువునా చీల్చింది

జివ్వుమనే నీ సంగీత విషాద సంవాదం
ఇప్పుడు నాకు వినబడుతుంది
కొత్త ఉదయానికై నడుంకట్టమని నీ తీక్షన పల్లవి
నాలో మలినాన్ని మట్టుబెట్టింది!

No comments: