Friday, September 08, 2006

ఊటి కుండ

పతిదినం కుండలమైన మమ్మల్ని
చెరో దిక్కు కావెడగట్టుకొని ఊరవతలకి
నడిసిపోయి కారడివిల బండల సందుల
ఒర్రెలనుండి పారే సొచ్చమైన యేటి నీళ్ళు
కుండలమైన మాలో నింపుకొని
నీ బక్కకండలుబక మమ్మల్ని మోస్తూ
యజమాని తొట్లో, కూజాల్లో నింపగ పోయేవు.


నీ కట్టంజూసి వూటికుండనైన నాకు
గుండె గతుక్కుమంటాది.
అయ్యో! ఎప్పుడు నిండుగ నీల్లు తోడుకరాలేదని
యమ దుఃఖమైతాది.


యిల్లు చేరేసరికి సగమింకిపోయే
నర్రబడ్డ నల్ల కుండను నన్నెందుకు ఉంచినవని,
ఇసిరి బండకేసి కొట్టక పోతివేమని
ఇరక్తి పుడతది.
గా పక్క నిండుకుండని జూస్తే నా బతుకు
"తూ దీనియమ్మ యెందుక"నిపిస్తది.


యెందుకయ్యా మాటాడవు నువ్వు?
సడిజెయ్యక గమ్ముగుంటవు?
యెందుకుంచినవ్ ఇంక నన్ను?


చెప్త ఇను- నువ్వు మర్రపడ్డా నాకు నచ్చినవ్...
కావిడదుపుదప్పి నా బుజం కందినా
నువ్వుజేసే మేలెరిగి నిన్నుంచిన
నీ నర్రలనుండి కారే నీటిబొట్లు
మట్టిలగల్సిన గా బాటొంక
ఒక్కతరి దిగులుమాని తొంగి సూడు
అగపడ్డాయ ఇరబూసిన బంతి చెండ్లు
ఇంపుగ ఆసనొత్తన్న చామంతి పూలు?


ఆ బాటెంట నాటిన పూలగింజలు
నీ తడికి మొగ్గతొడిగి ఇచ్చుకొన్నై
ఆటిని రోజు అయ్యగారి బల్లమీద కుండీల పెడ్తే
పొద్దున్నెయ్ పూజకొరకు అమ్మగారికిత్తే
బల్లమీద పూలు పెద్దాయన మనసు మురిపిస్తన్నయ్
అమ్మగారి మనసులో బత్తి కురిపిస్తన్నయ్
ఆ ఇంటిని మొత్తం సంతోషంతో నింపుతన్నయ్


ఏదో లోపముందని ఎన్నడు చింతపడకు
లొపమేమి శాపం కాదు
ఆలోసిత్తే లోపాన్ని కూడా
లాభంగ మార్చొచ్చు
లోకానికి మంచి చెయ్యొచ్చు!

("cracked pot" అనే ఇంగ్లీష్ కథ ఆధారంగా)

No comments: