Thursday, July 05, 2007

C'mmon! You Can Read It!

I cdnoul't bvleiee taht I cluod aulaclty uesdnatnrd waht I was rdanieg. The phaonmneal pweor of hmuan mnid! Aoccdrnig to rscheearch at Cmabrigde Uinervtisy, it dsnoe't mttaer in waht oderr the lteerts in a wrod are, the olny intmoprat tihng is taht the frist and lsat ltteer be in the rghit pclae. The rset can be a ttoal mses and you can siltl raed it wotiuht a pebrlom. Tihs is bcuseae the hmaun mnid deos not raed eervy ltteer by isltef, but the wrod as a wlohe. Aznamig huh! Yaeh and I awlyas thuhgot slnpileg was ipatnomrt!

Wednesday, July 04, 2007

మరుపెరుగని మనసు

మనసు మార్గంలో మౌనంగా నడుస్తొంటే ఎదురుగా నీవు!

నేను జ్ఞాపకమున్నానా? అని నీ ప్రశ్న రెండచుల ఖడ్గమయ్యింది

యదను చిద్రం చేసింది, కన్నీరు ఘోషించింది...

నిను మరువలేని మదికి జ్ఞాపకానికర్థం తెలియదని...

తలపు

సౌఖ్యపు సమయాల్ని జ్ఞాపకాల అరల్లో పొందుపరిచాను...
నా శ్వాసకు బాసటగా!
ఆశలకి హద్దుగా నీ ఊసులతో నా మది నింపుకొన్నాను...
నీ తలపే ఊపిరిగా!

Saturday, June 30, 2007

నస

రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వాన! ముసురు అనేంత సన్నటి తుంపర్లు కాదు...కుండపోతా కాదు...ఆకాశానికి జల్లెడ బొట్లు పడ్డాయేమో అన్నట్లు ఒకమాదిరిగా జల్లు కురుస్తూనే వుంది.కిటికీలోనుంచి బయటకు చూస్తూ..అలా ఎంతసేపయిందో తెలియదు...నీటి చుక్కల సవ్వడే నాకు జోలపాటయ్యింది.నా నిద్ర కూడా అంతే...ఈ వర్షం లా! గాఢ నిద్రా కాదు,అలా అని మగతా కాదు!"రేడియో తరనా"లో, కల్ కా రాత్ ఏ మహినే మే సబ్‌సే టండీ రాత్ హై,ఆజ్‌భీ వహీ టండ్ హై! తో అయిసి మోసం మే ఆప్ కా ఫర్మాయిష్...ఏ గీత్‌కా మజా లీజియె... అద్నాన్ సమి కా యె బీగి బీగి రాతోమె...అనే వ్యాఖ్యానం లీలగా వినపడుతూనే వుంది.అతడి మాటలు విని అప్పుడే రాత్రయ్యిందా అని ఆశ్చర్యం వేసి బద్దకంగా కళ్ళు తెరిచి చూసా! బయట మసక చీకటి,కీ ఇచ్చిన బొమ్మలా మెల్లగా తలతిప్పి గడియారం వంక చూసా...ఇంకా నాలుగుంబావే అయ్యింది.ఇక్కడ వర్షం పడితే జనాలకు ఎంత విసుకో నాకు తెలుసు.అదీ వీకెండ్లో అయితే మరీనూ!నేనైతే లోకంతో పనిలేనట్లుగా, ఇంకా నాలుగేగా అయ్యింది అనుకొంటూ కిటికీ పక్కన ముడుచుక్కూర్చున్నాను. ఆ తర్వాత కూడా చేసేదేమీ లేదు, తిని తొంగోటం తప్పితే!నాతో ఏకిభవించినట్లు చల్లని గాలి నా తల నిమిరింది.నాలాగే బద్దకంగా తిరుగుతుందనుకొంటా, తోడు దొరికానని కప్పుకొన్న దుప్పటిపై వీచి కదిపి నాతో దోబూచులాడుతొంది.ఆ తెమ్మెరేంచేసిందో ఏమో బద్దకం వదిలి బయటకెల్దామనిపించింది.గమ్యం తెలియదు..అలా డ్రైవ్ చేస్తూ యాధృచ్చికంగా ఇంటి దెగ్గరున్న లాండ్‌స్కేప్‌వైపు తిప్పాను.నింపాదిగా వెళ్తూంటే గత వేసవి గుర్తొచ్చింది.

వేసవిలో అంతా ఇంతా హంగామా కాదు...బార్బిక్యూ పార్టీలని,క్యాంపింగని ఇంకా ఎన్నో ఆట విడుపులు.ఇక్కడ వేసవి అంటే మన భారతావనిలా భగభగ మండుటెండలు కావు.ఒకమాదిరిగా, అంటే 20-25°c ఉష్ణోగ్రత ఉండి ఏదేను వనమంటే ఇదేనేమో అన్నట్లుగా చెట్టుచేమలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.క్యాంపింగ్‌లో చేసే ముఖ్యమైన విశేషం "బుష్ వాక్"-అంటే చెట్లూ పుట్టలెమ్మటి అలిసిపోయెదాకా తిరగడం. ఇంతకి ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే గత వేసవిలో ఇలాంటి క్యాంపింగ్ నేను డ్రైవ్ చేస్తూ వచ్చిన లాండ్‌స్కేప్‌లోనే జరిగింది...బుష్‌వాక్ నేనెంతో ఎంజాయ్ చేసాను.అలోచనలను భగ్నం చేస్తూ రాళ్ళు పేర్చిన పాకురు గోడపైనుండి పావురాల పలకరింపు!కారు దిగి ఆ దారిలో నడవాలనిపించింది...చినుకుల దాటికి చిత్తడిగా మారి నివురుగప్పిన నిప్పులా,ఆరగించి కదలక మెదలక సేదదీరుతున్న కొండచిలువలా హాయిగా నిద్దురపోతున్నట్లుంది ఆ మార్గం!దానికిరువైపులా కలియపడడానికి సిద్ధంగావున్న రొమ్మువిరిచి ఎదురెదురుగా నిలిచిన సైనికుల్లా నిటారు వృక్షాలు!తెమ్మరల తాకిడికి లయబద్దంగా కలిసికట్టుగా నాట్యంచేస్తున్న గడ్డిపోచలు...నీటిగుంటల్లో వలయాలు విచ్చి వినాశనమవుతూ నన్ను మైమరిపించాయి.

ఎందుకో కలసివున్నట్లున్నా విడివిడిగా నిలచిన చెట్ల మధ్య వ్యత్యాసం ఆకట్టుకొంది. కలీల్ జిబ్రాన్ అన్నట్లు "కలిసిమెలసి ఆనందంగా అందరితో ఆడిపాడు....కాని నీవు నీవు గా ఉండు ఒంటరిగా...కలసి నిలువు దెగ్గరగా గుడి స్తంభాల్లా, కాని దరిలో నీ ప్రత్యేకత నిలుపుకో". ఇంత ముభావపు సమయంలో,మసగ చీకట్ల దెప్పిపొడుపుల్లో, పావురాల వెక్కిరింతల్లో, నిండు చంద్రుని బిత్తర చూపుల్లో నా ఒంటరితనమే తోడనిపించింది...ఏ లోటూ లేదనిపించింది! వర్షం నన్ను ఇంట కట్టి పడేసినా మనసు పంజరాన్ని విప్పింది...అందుకే చిత్తడి నేలైనా ఇస్టంగా నడవాలనిపించింది ఆ సాయంత్రం... వర్షంలో బురదలో వీడి నడకేంటి వెఱ్ఱి కాకపోతే...అన్నట్లుగా చాశాడు నిండుగా రెయిన్‌కోట్‌వేసుకొని అటుగా వెళ్తున్న ముదుసలి!

Friday, June 29, 2007

ఊసులు

అలుపెరుగని అలల తాకిడికి
అణువైన స్పందించని శిలలా
-ఆమె హృదయం
******************
విరబూసిన పూతలు
కోయిల కూతలు
రవి ఛవి కాంతులు
చెలి సంగతులు
ఎన్నో వింతలు
తీయని చింతలు....
-వసంతం
********************
మనసు విరిగిన మనిషికి
నిట్టూర్పే స్వాంతనగా
చెక్కిలి నిమిరిన నీటిబొట్టు
-కన్నీరు
********************
గొంతెండిన కుసుమాలపై
జాలిపడిన గగన సంచారి,
కార్చెనే కన్నీరు!
-వర్షం  
******************** 

Monday, March 26, 2007

మిలియనీర్

Mrs.Lavish:నన్ను పెళ్ళి చేసుకొన్నాకే మా ఆయన మిలియనీరయ్యాడు

చెలికత్తె:ఒహో! ఇంతకుముందు మీ ఆయనేంటి?

Mrs.Lavish:బిలియనీర్!

Wednesday, March 21, 2007

సెంచరీ-వంద తెలుగు టపాలు పూర్తి

క్రికెట్టైనా,టపాలైనా సెంచరీ అయితై ఎవరికానందముండదు చెప్పండి!సరదాగా మొదలెట్టిన బ్లాగు తెలుగులో వంద టపాలు పూర్తి చేసుకొంటుందని అనుకోలేదు.మీ విమర్శలు,అభినందనలే నన్ను రాయడానికి ప్రొత్సహించాయనటంలో సందేహం లేదు.ఇంతకాలం ఓపిగ్గా నా బ్లాగు వాగుడ్ని భరించినందుకు కృతజ్ఞతలు.చిన్నప్పటినుండీ ఆంగ్లమాధ్యమంలోనే విద్యాభ్యాసం చేసినా(అలా అని ఇంగ్లీషులో పెద్ద తోపును కాదులేండి!) తెలుగు భాషపై నాకున్న ఆశ నన్ను తెలుగులో వ్రాసేలా చేసింది.మున్ముందు ఇంత విరివిగా వ్రాస్తానో లేదో తెలియదు కాని వ్రాయడమైతే మానను గాక మానను.బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు అని ఒక అనామక కవి ఎందుకన్నాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతొంది.అవును తెలుగు భాష తీయదనం అలాంటిదే మరి.తెలుగు మత్తు పట్టుకొంటే ఒక పట్టాన వదలదు...ఇదొక తియ్యని వ్యసనం,తీరని దాహం!మరోసారి మీ అందరికీ "వంద"నములు!

మగవాడి అబద్ధం

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.
అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

ఒకరోజు వాడు అదే నది ఒడ్డున తన భార్యతో నడుస్తూంటే,ఆమె అనుకోకుండా కాలుజారి ఆ నదిలో పడిపోయింది.తన భార్య కోసం విలపిస్తున్న అతని చూసి మళ్ళీ నది దేవత ప్రత్యక్షమై నీటిలోనుండి సినితార స్నేహను తెచ్చి ఈమె నీ భార్యా? అని అడగగానే అతడు వెంటనే అవునననగా,నది దేవతకు ఒళ్ళుమండి,దూర్తుడా...మంచివాడివనుకొంటే ఇంత సంకుచిత బుద్ధా నీకు? ఎందుకు అబద్ధమాడావో చెప్పు అంది.దానికి వాడు,నేను నిజం చెబితే తరువాత మీరు,ఏ శ్రియనో,హన్సికనో తీసుకొస్తారు.నేను మళ్ళీ నిజం చెబితే చివరకు నా భార్యతో పాటు వీరిని బహుమానంగా ఇస్తావు.నీవిచ్చిన ధనరాశులతో ఒక్క భార్యను పోషించడమే కష్టమవుతుంటే ఇక ఇద్దరితో వేగేదెట్లా అని ఆలోచించి, మీరు ముందు స్నేహను చూపించగానే కమిటైపోయాను అని సమాధానమిచ్చాడు!

నీతి:మగవాడు ఎన్నబద్ధాలాడినా దానికి ఎదో ఒక మంచి కారణం ఉంటుంది :)

Wednesday, March 14, 2007

సర్వే

గొప్ప పరిశ్రమ స్థాపించాలని ఉవ్విళ్ళూరుతున్న ఒక సంపన్న యువకుడు ముందుగా ఇతర పరిశ్రమలు,సంస్థల గురించి తెలుసుకోవడం మంచిది అని అలోచించి ఒక సర్వే చేయాలనుకొంటాడు.ముందుగా హైటెక్ సిటీకి వెళ్లి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో, మీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు అని అడిగాడు, దానికి సదరు ఉద్యోగి, సుమారు ఒక 300 మంది అని చెప్పాడు.అతని దెగ్గర ఇతర వివరాలు తీసుకొని అమీర్‌పేట్‌లో ఉన్న ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని పిలిచి మీ సంస్థలో ఎంతమంది పని చేస్తారు అని అడగ్గా,200మంది మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు అని చెప్పాడు.పనిలోపని ఒక ప్రభుత్వ సంస్థ గురించి కూడా వివరాలు తెలుసుకొంటే మంచిదనుకొని దెగ్గరలో ఉన్న హూడా కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ బయట కాంటీన్‌లో తీరిగ్గా కూర్చొన్న హూడా ఉద్యొగిని, మీ సంస్థలో ఎంతమంది పని చేస్తారు అని అడిగాడు...దానికతడు తాపీగా సుమారు మూడోవంతు మంది అన్నాడు!

అమెరికన్ల అతితెలివి

నాసా అంతరిక్ష యాత్రలు చేస్తున్న తొలినాళ్ళలో గురుత్వాకర్షణ లేని చోట బాల్ పాయింట్ పెన్ పనిచేయదని కనుగొని సుమారు 12 బిలియన్ డాలర్లు ఖర్చుచేసి దశాబ్దం పాటు పరిశోధనలు చేసి మొత్తానికి గురుత్వాకర్షణలేని చోట,నీటిలోనూ,తలక్రిందులుగా,గాజుతో సహా ఎటువంటి ఉపరితలంపైనైనా,అతిశీతల ఉష్ణోగ్రతలనుండి సుమారు 300 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితుల్లో వ్రాయగలిగే మహత్తరమైన పెన్నును కనిపెట్టారు!

ఇంతాచేసి రష్యన్లు ఏం వాడతారో అని అరా తీయగ పెన్సిల్ వాడతారని తెలిసింది :)