Wednesday, September 06, 2006

మూగ ప్రేమ-కన్న పేగు

నిను చూసిన క్షణం నుండి
నాలో ఏదో తెలియని మధుర భావం
ఏం మాయ చేసావోగాని
అంతరంగంలో అలలెత్తింది కలలసంద్రం

కనులు రెప రెపలాడిస్తూ
చూసి చూడనట్టు నీ చూపుల గమ్మత్తు
నన్ను బిత్తర పరిచి దిక్కులు చూసేట్లు
చేయగ దారిన పోయేవారు
దిగలేదు వీడికి మందు మత్తు అనుకొన్నారు

నాలో నేను లేనే లేకుండా
నీ తలపులతో చిలిపిగ నవ్వుతుంటే
చాటుగ వుండి చూసిన అమ్మ అనుకొంది
"వీడికి ప్రేమ పిచ్చి ముదిరింది" అని

ఒళ్ళు మరిచి నీ ఊసులతో
రోడ్డుపై నడిచి పోతుంటే
దారి విడచి మధ్యేదారిలో నేను
కీచుమని బస్సు బ్రేకువేసిన
సడికి తేరుకొన్న నాకు
"చూసుకొని నడువ్! లేకపొతే చస్తావ్!!"
అన్న డ్రైవరు మాటలుకూడా నవ్వు తెప్పించాయి

ఇంటికొచ్చిన నాకు అనుకోని దర్శనం!
గుమ్మంలో అమ్మ వెనుక నిల్చొని నువ్వు
తలదించుకొని చేతిని మూతికడ్డం పెట్టుకొని
చిరుమందహాసంతో సిగ్గులొలుకుతున్న నీ వదనం

పిరికివాడి మూగ ప్రేమను అర్థంచేసుకొని
"ఎలాగైనా నా కొడుకు ప్రేమను గెలిపించాలని"
కన్న పేగు పడిన ఆరాటమెరిగి కల్లు చమర్చాయి
ఆ భూలోక దేవతను చూసి నొట మాట రాక
గొంతుపెగిలేట్లు గట్టిగా ఏడవాలనిపించింది

నిన్నొప్పించడానికి అమ్మ ఎన్ని పాట్లు పడిందో అని తలచుకొని....
"అమ్మా" అని పరుగెత్తి కౌగలించుకోవాలనిపించింది
ఎందుకో ఆ క్షణం నిన్ను "చీ పో!" అందామనిపించింది!!

No comments: