Saturday, September 30, 2006

అందం

మనిషిలో మలినాన్ని మరచి మంచిని తరచి చూసే కళ్ళు
చూపులతో కైపెక్కించే కన్య కలువ కన్నులకంటే ఎంతో మేలు
కరుణ కలగలిసిన కమ్మని మాటల ఊటలుబికే పెదాలు
జుంటి తేనియలొలికే రసరమ్య మధురామృతాధరాలకంటే మెరుగు
అనాధల అర్తనాదాల అరణ్యఘోషే శ్వాసగా ఉన్న ముక్కు
సంపెంగ సైతం సిగ్గుతో చిన్నబోయే చక్కని నాసికానికన్న మిన్న
సంకటాలను విని సంగీతంగా మార్చేదుకు ఉసిగొలిపే చెవులు
పొడుపులపై విడిదిచేసిన పసిడికే పరువాన్నిచే కర్ణాలకంటే గొప్పవి
అన్నార్థులతో ఆకలిని పంచుకొని మానవత్వంతో బక్కచిక్కిన శరీరం
మైమరపించే మెరుపుతీగలాంటి మగువొంటిని మించినది
స్వచ్చమైన మనసులోని ధవళకాంతుల దివ్య సౌందర్యం
చంద్రబింబపు మోముమేనియకన్నా మహదానందాందం

Wednesday, September 27, 2006

అంతులేని వింతాశలు

నింగినంటే శిఖరం అంచున నిలకడగా నిలవాలని
కనుచూపుమేరా నా అస్తిత్వం అణువణువునా తెలపాలని
ఆశయం
ఆల్బెట్రాస్ లా అలలపై ఎడతెరిపిలేకుండా ఎగరాలని
నవ్వుతున్న విప్పారిన పువ్వులా నిత్యం వికసించాలని
సంకల్పం
ఎప్పుడో నడచిన దారుల్లో పదే పదే తిరగాలని
చిరు జ్ఞాపకాల్ని అదేపనిగా గురుతుచేసుకోవాలని
కోరిక
నాలో నేను నవ్వుతూ తుళ్ళుతూ అగమ్యంగా నడవాలని
క్యూలో నడుస్తూ నన్ను చూసి నవ్వే బడిపిల్లల గుంపులో చేరాలని
ఆశ
చిటపట చినుకుల్లో రివ్వున ఉరికి చూరుకిందకు చేరాలని
జల్లె జడివానైతే కేరింతలుకొడుతూ తనివితీరా తడవాలని
ఆరాటం
అతివ అందెల సవ్వడి విని ఎరుగనట్లే నింపాదిగుండాలని
దేవదారు మ్రానుల్లా నిటారుగా నిలువగ తను పలకరించాలని
అసహనం

కష్టాలన్ని కాలంచేసిన ఘోరాలని నేరాలని నిందించాలని
శిథిలమైన కలలు శిలలలా ఎప్పటికీ నిలవాలని
నిరీక్షణ
ఆశల ఊసుల ఉనికిని మనసు అరుల అరల్లో వెదకాలని
శ్వాసల భాషకు సరైన అర్థం సవివరంగా గ్రహించాలని
అన్వేక్షణ

Monday, September 25, 2006

నీకై నిరీక్షణ

ఎడారి యదలో తడికై తపన
విరహపు మదిలో నీకై వేదన
కాలమనే కడలిలో కళాసిగ సాగనా
విధాత విధిలో జతకై వేగనా
నిశీది నింగిలో నెలరాజు వదనా
విరుల విభావరిలో వ్యస్తనై ఉన్నా
ప్రేమ లంకలో నీకై నిరీక్షణ
నాతో నిత్యం వసించవే మైనా

Wednesday, September 20, 2006

తొలి వలపు-తొందరపాటు

తొలివలపే తేనియకంటే తియ్యనిదని
తెలిసింది తను కలిశాక
తన తనువే తనివితీరని తమకమని
తోచింది తనని వలచాక
తనువులేకమైన తొమ్మిది నెలల్లో
తొలితరణమయ్యాక
తమకంలో తొందరపడ్డాననిపించింది
తెలివితక్కువగా తెలియక

స్వప్న సుందరి

కలలలో కవ్వించి కలవరపరిచే రమణీయ రూపం
కవనంలో కనిపించి కరిగించే కమనీయ కావ్యం
కుంచెరంగుల్లో కలిసి సరసించే సొగసరి సోయగం

దివిభువులను క్షళించగ గోచరించని నీ గమనం
నీ కోసం నిరంతర నిర్విరామ నిరీక్షణ తపోమదనం
యదవ్యధను వధించగ వేంచేయవా వయ్యారీ నా కోసం!

Tuesday, September 19, 2006

వర్షం

ఉరిమే మేఘం నన్నరచి పిలువగ
చల్లని పవనం నీ రాకను తెలుపగ
ఝుమ్మని తుమ్మెద రివ్వున ఎగురగ
పిల్లలు అల్లరిగా వీధిన గెంతగ

నింగే నేలను వలువగ కలువగ
వీలుకాక వ్యధతో యదలో విలపించగ
జలజల కురిసే నీరే వర్షం కాగా
మిన్నే మన్నును సలీలంతో సంసర్గించగ

చిటపట చినుకులు నేలను తాకగ
తన్మయత్వంతో తనువే ఊగగ
విరహపు మనసులో అలజడి రేగగ
చెలి అందెల రవళే జ్ఞప్తికి రాగా

కుండపోతతో వెలుగే కందగ
దూరపు క్షితిజం దెగ్గర కాగా
మెరిసె మెరుపులు తలపులు చెరుపగ
తడిసిన తనువే తమకం చెందగ.....

ఒక్కసారిగా జోరు వర్షం వెలిసింది
పిల్లల అల్లరి మరుక్షణం సద్దుమణిగింది
కళ్ళు తెరువగ కమ్మని వీక్షణం కలిగింది
ఎదలో రూపం ఎదురుగ నాకై నిలిచింది

వర్షం వెళ్లిపోయింది విరహం తీరిపోయింది
చెలి చెంత చేరింది జీవితం కురిసే జల్లైయ్యింది

Monday, September 18, 2006

బాల్యం

కల్లలు ఎరుగని కమ్మని బాల్యం
అమ్మ ఒడిలో ఆనంద సమయం
అంతులేని ప్రశ్నల అమాయకపు మనీష
నాన్నకు రోజూ నేనిచ్చె సహనపు పరీక్ష
అల్లరి ఆటపాటలతో అలుపెరుగని వొళ్ళు
కథవినంది కునికేరాని రెప్పవాల్చని కళ్ళు
కోయిల కూతకు పోటీ కూతతో పెరట్లొకి నా పరుగు
పిల్లలకోడికి నేకూర్చొని గింజలువేసిన ఆ అరుగు
ఇరుగుపొరుగు పిల్లలతో గిల్లీకజ్జాలు
చిరుతిండ్లకోసం మారాంచేసిన రోజులు...
పరుగులిడే కాలాన్ని పాతెయ్యాలనిపిన్స్తుంది
బాల్యాన్ని తలచుకొంటే
ఆ కాలమే అక్కునచేర్చుకొన్నట్లుంటుంది
పసివారిని చూస్తుంటే
లౌక్యమెరుగని ఆ తాదాత్మ్యం
వయస్సుతో వచ్చిన వక్రబుద్ధుల్ని
ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటుంది
అందుకే నాలో మానవత్వాన్ని
మేలుకొలిపి నిత్యచేతనంగావుంచే
బాల్యాన్ని మనస్సు కోరుతుంది

Saturday, September 16, 2006

శిశిరపు చెట్టుకృష్ణ, కాంతిని తరుమగ
వేగిరపడి వస్తున్నానని
పక్షుల కిలకిల రవములలో
లిఖించి సందేశించిన అరుణ సంధ్యలో...

ఎవరులేని ఒంటరితనం హాయనిపించి
సరస్సును చేరే విసిరిన సరములా
వొంపులు తిరిగిన సన్నని సిమెంటు బాటలో
నింపాదిగా నడుస్తున్న నాతో,
శిశిర సరసానికి రాలి ఎండిన
పండుటాకులు నా కాళ్ళకింద నలుగుతూ
ఎగిరెగిరి పడుతూ గుసగుసలాడి

ముగ్గుల చుక్కలద్దినట్లు
అక్కడక్కడ పసిడిరంగు పండుటాకులతో
అస్తిపంజరంలా విస్తరించిన బోడి కొమ్మలతో
కురులు విరబూసుకొన్నట్లుగావున్న నిన్ను
ఆతృతగా పరిచయం చేసాయి

నీ మోడులావున్న నేను నిన్ను చూస్తూ
ఆగుతూ అడుగులేస్తూ నడుస్తూంటే
ఒక్కో కొమ్మా ఒక్కో జ్ఞాపకాన్ని నిమిరింది

మలయమారుతం మోమును తాకి
తలపుల తాపాన్ని తడిమి తరిమి
సడిచేయక పిల్ల వలయాలతో
నా ప్రతిబింబాన్ని పాడుచేసి
వెక్కిరిస్తున్న సరస్సుని చేరానని చెప్పింది

అయినా నిశ్శబ్దంగా నగ్నంగా ఉన్న నువ్వు
నా జ్ఞాపకాల ఊసుల్ని తడుతూనే ఉన్నావు
వసంతమొచ్చే వరకు వేచివుండమని
పండుటాకులు రాలుస్తూ పలకరిస్తూనేవున్నావు

అభినివేశం

ఇల జనులకు విన్నవించగ
గన్న నరుడు లేడు
కలకందని సుఖముల మరిగి
కబోదియైనాడు
సర్వం అభాసమని బోదింపగ
గ్రహింపకున్నాడు
మరణం దరి చేరకముందే
నశించుచున్నాడు

వీడి మనసు మారేదెప్పుడు?
వికలమైన మనీష స్వస్థపడేదెప్పుడు?

నైరాశ్యం నింగినంటినా
వైరాగ్యం పలుకరించినా
నే రాయక మానను
నా వచనం నా కవనం
నా కథనం నా మదనం
సత్యానికి సన్నిహిత్యమై
లోకుల అసురానికి అతిరీక్తమై
కనువిప్పు కలుగజేసి
స్నిగ్ధ సౌందర్యాన్ని సాధించేదాకా
నిరంతరంగా కొనసాగుతుంది
తుదిశ్వాస విడిచినా నుడికారమై
జిజ్ఞాసుల స్వరనాదమై...

Friday, September 15, 2006

విఫల ప్రేమ

చల్లగా వీచే గాలికేం తెలుసు
విరిగిన నా మనసు వ్యధ
ఎగసిపడే అలలకేం తెలుసు
ఉప్పొంగే నా యదలో బాధ
చేసిన బాసలు నీటిపైన రాతలని
మగువ మత్తులో ఎవరైనా చిత్తేనని
ఇన్నెళ్ళ సహవాసాన్ని ప్రేమ సంబంధాన్ని
ఎరుగనట్టే మైమరచిన ఆమె కళ్ళ వెనుక
కనిపించని కల్మషాన్ని అనిపించని కాఠిన్యాన్ని
క్షణమైనా అణువైనా నేను పసిగట్టలేక
కలల లోకంలో విహరిస్తూ అక్కడే మొహరించాను
ఒంటరినని తృణీకరింపబడితినని గ్రహించాను
తీయని పాటగా వినసొంపుగా వచ్చి
తను మార్చింది నా తలరాత
మానని గాయంచేసి మనసే విరిచి
నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తరువాత
విఫలమైంది నా ప్రేమ కథ...

అనుభూతులు, హైకూలు

జడి వాన
గొలుసు తెగి
నేల రాలిన ముత్యాలు
ఓ క్షణ కాలపు సవ్వడి...
******************
నిర్లిప్తత
చిగురు ఎండింది
మనసు మూగవోయింది
గాలిలేని సంధ్య భారంగా...
******************
బాట
పచ్చని పచ్చిక మధ్య
పసుపు పాపిడిలా
ఎండిన గడ్డి గీత
*******************
ఎండాకాలం
కిర్రుమంటూ తిరగలేక తిరుగుతున్న
సీలింగ్ ఫ్యాను గాలికి వొణుకుతున్న సాలె గూడు
ఉక్కపోతలో నవ్వొచ్చింది
********************
వానాకాలం
ఎండావానలకు వెలిసిన
పాత గోడపై పాకురు
పచ్చగా పలుకరించింది
********************
తొలకరి జల్లు
పక్షుల కిలకిలలు విని
కిటికి తెరువగానే
మట్టివాసనను మోసుకొచ్చింది పిల్లగాలి
*********************
గాలివాన
రికామీ గాలి నీళ్ళతో జట్టుకట్టింది
అది చూసి నవ్వాపుకోలేక తుళ్ళుతూ ఊగుతూ
నేలకొరిగాయి కొన్ని వృక్షాలు
**********************
ఎదురు చూపు
ముసురులో ముడుచుకొని కూర్చుంది
మా ఇంటి ముందు కరెంటు తీగపై ఒక గువ్వ
పొద్దుగుంకుతున్నా కదలక
తోడు కోసం ఎదురు చూపేమో..

కలయికశుష్క నయనదారల దారుల
చెరిపి చెక్కిలి తేటదనాన్ని
ఎంగిలి చేయగ...

నా గుండెలపై వాల్చిన నీ
వదనంలోని ప్రశాంతత విలాసం
నా గుండె చప్పుడు కనుగొంది

లలిత మిలిత చలన విలీనమైన
మన అనుబంధాన్ని మన కలయిక
చిక్కుముడిలా బిగించింది

జీవిత లంపటానికి కాసేపు
లంగరు వేసినట్లుగా
నా సంవేదనల సంఘర్షణల
సందేశాల్ని ఆదేశాల్ని
ఆ కొన్ని క్షణాలు సమాధి చేసాను....

ఇంకెన్నడూ నిన్ను వీడి వెళ్ళొద్దని....
ఎప్పుడూ తోడుగా వుండాలని....

వివరణ: చాన్నాళ్ళు దూరంగా వున్న జంట ఒకరికోసం ఒకరు తపిస్తూ విరహం తో వేగిపోయి వేదనపడి ఏడ్చి బాధపడే స్థితిలో, సముద్రాలు దాటి తనని కలవడానికొచ్చిన ప్రియుడు చెలిని ముద్దాడి కౌగిలించుకొన్నప్పుడు అతడి మనసు పలికే భావం ఈ నా చిరు ప్రయత్నం

Tuesday, September 12, 2006

నా వ్రాతలు

జీవంలేని జడత్వమైన
జటిలమైన కుటిలమైన
కుల్లిపోయిన కృశించిన
చచ్చుబడిన మచ్చబడిన
తుచ్ఛమైన నులివెచ్చని
వ్రాతలు నా వ్రాతలు కావొద్దని...
మనసుల తొలిచి మనుషుల గెలిచి
మంచిని పెంచి మలినం తుంచి
మ్రానుని మార్చి మత్తే దించి
మందిని కూర్చి మార్పును తెచ్చేలా
వుండాలి నా వ్రాతలు...
మదించి కదించి
ఖండించి కరుణించి
కరిగించి విరిగించి
చలనం సృష్టించాలని
సృష్టిని స్పృశించాలని
నా మది విధిగా వుసిగొలిపిన వాంఛ
అచంచల విశ్వాస శ్వాసతో
అకాశ విశాలంలో విపంచిలా
విహరిస్తూ వీక్షిస్తూ
తిరుగుతూ తపిస్తూ
తరిస్తూ తర్కిస్తూ
నే విరచించిన
నా వాక్యపు జాడను
బోసినోటి పసి పిల్లల
ముసి ముసి నవ్వులలో
ముదుసలి వదనపు
ముడుతల గీతలలో
స్వతంత్ర భావాల
నవ యువతీయువకుల్లో
జీవితం పరమార్థమయ్యిందనే
మధ్యవయస్కుల సంతృప్త స్వాంతనల్లో
స్థిరమై స్వరమై
శరమై చరమై
పర్వమై పదమై
ఆశై అనుకరణై
ఆదై అంతమై
అనుసంధానమై ఆనందమై
అఖిలమై సకలమై
అంబరమై అవనై
విశ్వమై శ్వాసై
శాస్వతమై అమరమవ్వగ
నే చూడాలి
అప్పుడే... తనువు వీడాలి!

Saturday, September 09, 2006

అగాదం-ఆశయం

ఆకాశ హర్మ్యాల అంచుల అరణ్య రోదనలు
తాటాకు గుడిసెల ముంగిట కారుణ్య వితరనలు
అచ్చటా ఇచ్చటా ఎచ్చటైనా వాడే
ఏమిలేని చేతగాని పేదవాడే

కలిలో ఆకలి రగులుతున్నా కలిని పంచేవాడు
నిండుకున్నా వండుకున్నదిచ్చేవాడు
తరచిచూడ యిల ఇటువంటి నరుడొక్కడులేడు

విరుల పాదమ్మోపి గరుకనే సుకుమారులు

ద్రవ్యాన్ని ద్రవ్యంగ్రోల ద్రవ్యంలా పారించే మత్తులు
ఎప్పుడూ ఎందుకూ ఎన్నడూ వాడే
అన్నీవున్న అంధుడైన కుభేరుడే

కలిమిలో లేమంటూ దిగులుపడే డబ్బున్న దరిద్రుడు
వెక్కసమైనా సిరి చాలదు చాలదనేవాడు
నలుదిక్కుల తారసపడేను ఈ మనుష్యుడు

ఈ లోతెరుగని అగాదం
మన లోకపు విషాదం
కసిని నింగినంటించే ఈ వీక్షణం
కొలిమి నిప్పుతో కడగాలని, ఈ క్షణం
ఆశయమాగదు ఆగినా నా ప్రయాణం
వచ్చేవరకూ ఆ మజిలీ... మరణం
కలం ఖడ్గంతో నే పోరాడే ఈ రణం
సమాంతరం దృష్టించేవరకు సాగాలి నిరంతరం!


వివరణ: ఎత్తైన భవంతులు కట్టినా పేదోడి బాధలు పట్టించుకొనేవారు లేరుపేదొడికి పేదోడి మాటల ఓదార్పే అండ అదే వారొకరికొకరిచ్చుకొనే వితరన. ఎక్కడ చూసిన ఇటువంటి నిరుపేదలు లెక్కకు మించి వున్నారు.
ఈ కలియుగంలో ఆకలితో రగులుతుంటే కనీసం గంజిని పంచుకొనేవాడు,ఇంట్లో ఏమీలేకపోయినా ఒక్క పూటకి వండుకున్నది అడిగినవాడికిచ్చే ఉత్తమ ఉదారతగలిగినోడు, ఈ ప్రపంచంలో ఒక్కడు కూదా లేడు.
పూలపై నడుస్తూకూడా పాదాలు కందుతున్నాయనేవారువిపరీతంగా తిని తాగుతూ పార్టీలకని పబ్బులకని నీళ్ళలా డబ్బు కర్చుచేసేవారు ఈ కాలంలో ఎంతోమంది ఉన్నారు.
డబ్బున్నా సంతృప్తి లేక జీవించేవారు, దాహం తీరక ఇంకా ఇంకా సంపాదించేవారు చాలామందుంటారు.
ధనిక పేద వర్గాల మధ్య పూడ్చలేని పెద్ద అగాదం వుంది, ఎంతో వ్యత్యాసం వుంది. ఇది చాలా చింతించవలసిన విషయం. ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలని సమానత్వం తేవాలని, సమాజాన్ని ప్రక్షాళన చెయ్యాలని అవేశంతో కవితలు రాసి ఒక్కరినైనిన ఆలోచింపచేయాలని ఎప్పుడూ రగిలిపోతుంటాను. నేను మరణించినా నా రాతలు యువతలో స్పూర్తిని నింపి సమానపు నవ సమాజం నిర్మించబడేవరకు కొనసాగాలి!

Friday, September 08, 2006

కొవ్వొత్తి

కరుగుతున్న కొవ్వొత్తిని చూసి
కరెంటు పోయి గంటలు గడిచినా
తెలియకుండానే కళ్ళు మూతలు పడ్డాయి.
కరిగిన ఊసులని జరిగిన కాలాన్ని
మిణుకు మిణుకు మంటూ
కొవ్వొత్తి కాంతి కళ్ళముందుంచింది.

చెలి వలపులు తలచి చిలిపి ఆలోచనలతో
కైపెక్కే అల్లరి మనన్సు...
యదలో అలజడి ఇక తట్టుకోలేక
అసందర్భంగా హసిస్తున్న అదరాలలో
బయటపడే ఆ కమ్మని ఊసులు...
పందిరి మంచం చుట్టూ తచ్చాడుతూ
మాటి మాటికి పక్క సరిచేస్తూ
మసక చీకట్లు ఎప్పుడు చిక్కపడతాయా అని
సాయం సంధ్యవేళలో రవి మునకలో
అసహనంగా ఎదురుచూస్తూ
యుగాల్లా తోచే ఆ భారమైన మధుర గడియలు...

దిగ్గున లేచా! మూసిన కనురెప్పలపై
భల్లున పడ్డ లైటు కాంతి ఎరుపెక్కించగ,
కరెంటు వచ్చిందని గ్రహించి...

ఊటి కుండ

పతిదినం కుండలమైన మమ్మల్ని
చెరో దిక్కు కావెడగట్టుకొని ఊరవతలకి
నడిసిపోయి కారడివిల బండల సందుల
ఒర్రెలనుండి పారే సొచ్చమైన యేటి నీళ్ళు
కుండలమైన మాలో నింపుకొని
నీ బక్కకండలుబక మమ్మల్ని మోస్తూ
యజమాని తొట్లో, కూజాల్లో నింపగ పోయేవు.


నీ కట్టంజూసి వూటికుండనైన నాకు
గుండె గతుక్కుమంటాది.
అయ్యో! ఎప్పుడు నిండుగ నీల్లు తోడుకరాలేదని
యమ దుఃఖమైతాది.


యిల్లు చేరేసరికి సగమింకిపోయే
నర్రబడ్డ నల్ల కుండను నన్నెందుకు ఉంచినవని,
ఇసిరి బండకేసి కొట్టక పోతివేమని
ఇరక్తి పుడతది.
గా పక్క నిండుకుండని జూస్తే నా బతుకు
"తూ దీనియమ్మ యెందుక"నిపిస్తది.


యెందుకయ్యా మాటాడవు నువ్వు?
సడిజెయ్యక గమ్ముగుంటవు?
యెందుకుంచినవ్ ఇంక నన్ను?


చెప్త ఇను- నువ్వు మర్రపడ్డా నాకు నచ్చినవ్...
కావిడదుపుదప్పి నా బుజం కందినా
నువ్వుజేసే మేలెరిగి నిన్నుంచిన
నీ నర్రలనుండి కారే నీటిబొట్లు
మట్టిలగల్సిన గా బాటొంక
ఒక్కతరి దిగులుమాని తొంగి సూడు
అగపడ్డాయ ఇరబూసిన బంతి చెండ్లు
ఇంపుగ ఆసనొత్తన్న చామంతి పూలు?


ఆ బాటెంట నాటిన పూలగింజలు
నీ తడికి మొగ్గతొడిగి ఇచ్చుకొన్నై
ఆటిని రోజు అయ్యగారి బల్లమీద కుండీల పెడ్తే
పొద్దున్నెయ్ పూజకొరకు అమ్మగారికిత్తే
బల్లమీద పూలు పెద్దాయన మనసు మురిపిస్తన్నయ్
అమ్మగారి మనసులో బత్తి కురిపిస్తన్నయ్
ఆ ఇంటిని మొత్తం సంతోషంతో నింపుతన్నయ్


ఏదో లోపముందని ఎన్నడు చింతపడకు
లొపమేమి శాపం కాదు
ఆలోసిత్తే లోపాన్ని కూడా
లాభంగ మార్చొచ్చు
లోకానికి మంచి చెయ్యొచ్చు!

("cracked pot" అనే ఇంగ్లీష్ కథ ఆధారంగా)

Wednesday, September 06, 2006

నాస్తికుడు

పశులదొడ్డిలో పెంట పేరుకుపోయినట్లు
మనిషి మదిలో మత్సరాలు పేరుకొన్నయ్
ఇగోతో మనసు మార్చుకోలేక
దెప్పిపొడుస్తున్న సత్యాన్ని
విజ్ఞానంధకారంలో పొగరుతో
మొండిచేయాలనుకొంటున్నాడు

తనకు తెలిసిందే తర్కమని
మిగతాదంతా సుద్దవ్యర్థమని
చేదనిపించే నిజాన్ని దిగమింగలేక
రుచిగావుండే "ఇజాల్ని" జీర్ణించుకొంటున్నాడు

పాపం వాడికి తెలీదు కాబోలు
ఆ దేవుని మూర్ఖత్వం
మనుషుల విజ్ఞానంకంటే
ఎన్నో రెట్లు గొప్పదనీ
వారి మస్తిష్కానికి అందదని...

ఇలా జాలిపడేవారిని
పిచ్చోల్లనుకొంటాడు నాస్తికుడు
వాడి కర్మ...

PS: These stanzas reflect the mind of an atheist. Go and ask any psychologist, without hesitation, he will say that all most all atheists are egoists.

Any atheist before asking me any question, first let me know

1. Where did life come from?

and your answer will be: Life originated millions of years ago by RANDOM CHANCE because of REMARKABLE REACTIONS which JUST HAPPEN in the MATTER.

My response to your answer is: Don't you feel shame and doesn't it look ridiculous to use words like 'random chance', 'remarkable reactions', 'just happen' and 'matter' without any External Influence?

You people use funny words like 'random', 'remarkable' etc for things you can't explain, for things externally influenced by none other than God. You replace God by the words 'remarkable' and 'random'.

Rather denying Him deny yourselves. Better late than never! It is impossible to prove that there is no God than to prove that there is God!

How funny it sounds that I am here on the earth by a random chance because of some bloody remarkable reactions in matter which just happen....ahaa!
చక్కని చుక్క

నా చూపుకి నచ్చిన
చక్కని చుక్కవు నువ్వే
అని నీ వెంటపడితే
ఏం చెప్పకుండా నన్ను
నీ చుట్టూ తిప్పుకొంటావని
తుళ్ళుతూ నవ్వుతూ
నన్ను మాయ చేసి
నా జేబులో డబ్బులు
కొల్లగొడతావని
నువ్వు దక్కవని
చివరికి నాకే బొక్కని
నాకు తెలుసు!
అయినా వినదుగా
ఈ పాడు మనసు!!

మూగ ప్రేమ-కన్న పేగు

నిను చూసిన క్షణం నుండి
నాలో ఏదో తెలియని మధుర భావం
ఏం మాయ చేసావోగాని
అంతరంగంలో అలలెత్తింది కలలసంద్రం

కనులు రెప రెపలాడిస్తూ
చూసి చూడనట్టు నీ చూపుల గమ్మత్తు
నన్ను బిత్తర పరిచి దిక్కులు చూసేట్లు
చేయగ దారిన పోయేవారు
దిగలేదు వీడికి మందు మత్తు అనుకొన్నారు

నాలో నేను లేనే లేకుండా
నీ తలపులతో చిలిపిగ నవ్వుతుంటే
చాటుగ వుండి చూసిన అమ్మ అనుకొంది
"వీడికి ప్రేమ పిచ్చి ముదిరింది" అని

ఒళ్ళు మరిచి నీ ఊసులతో
రోడ్డుపై నడిచి పోతుంటే
దారి విడచి మధ్యేదారిలో నేను
కీచుమని బస్సు బ్రేకువేసిన
సడికి తేరుకొన్న నాకు
"చూసుకొని నడువ్! లేకపొతే చస్తావ్!!"
అన్న డ్రైవరు మాటలుకూడా నవ్వు తెప్పించాయి

ఇంటికొచ్చిన నాకు అనుకోని దర్శనం!
గుమ్మంలో అమ్మ వెనుక నిల్చొని నువ్వు
తలదించుకొని చేతిని మూతికడ్డం పెట్టుకొని
చిరుమందహాసంతో సిగ్గులొలుకుతున్న నీ వదనం

పిరికివాడి మూగ ప్రేమను అర్థంచేసుకొని
"ఎలాగైనా నా కొడుకు ప్రేమను గెలిపించాలని"
కన్న పేగు పడిన ఆరాటమెరిగి కల్లు చమర్చాయి
ఆ భూలోక దేవతను చూసి నొట మాట రాక
గొంతుపెగిలేట్లు గట్టిగా ఏడవాలనిపించింది

నిన్నొప్పించడానికి అమ్మ ఎన్ని పాట్లు పడిందో అని తలచుకొని....
"అమ్మా" అని పరుగెత్తి కౌగలించుకోవాలనిపించింది
ఎందుకో ఆ క్షణం నిన్ను "చీ పో!" అందామనిపించింది!!

విరహం

ఆలోచనలు నిరంతర ప్రవాహంలా
అనంతంగా కొనసాగుతూ
నన్నునేను మరిచి
చేతిలోని పూరెమ్మలు తెంచుతూ
ఏటిగట్టుపై అడుగులో ఆడుగువేసి
నింపాదిగా నడుస్తూంటే
నన్ను చూసి నీటిలో దూకిన
కప్పల అలజడికి ఉలిక్కిపడి
అటు చూడగా....
విప్పారిన తామరలో
గోచరించింది నీ రూపం
మండూక సందడికి రేగిన వలయాలు
విరహాన్ని తలపించాయి

అందుకే వలయం తామర ఉన్న
స్థానానికి చేరుతుంటే
నాలో ఏదో తెలియని
విపరీతమైన ఉత్కంఠత
వలయం తామరను దాటి
జరిగిపోతూ చివరికి కనుమరుగైతే
అచేతనంగా అసహనంగా
నీరు నిలిచిపోవాలని దృఢవాంఛ

అవునుమరి! అలానే అనిపిస్తుంది!!
వలయంలాంటి నా ప్రయాణం
తామరలో దాగిన నీ రూపంలా
దూరంగా ఉన్న నిన్ను చేరాలని....

Tuesday, September 05, 2006

ఓ సాయంత్రం

పండ్లు కొందామని శ్రీమతితో జంటగా పళ్ళ షాపుకు వెళ్ళాను
చక్కగా కుప్పగా పేర్చిన నారింజ పళ్ళను చూసి
ముచ్చటపడిన నా శ్రీమతి కుతూహలంగా ముందుకెళ్ళి
పెద్దగా ముద్దుగా మెరుస్తూ నోరూరిస్తున్న నారింజను
మధ్యవరుసలొనుండి చటుక్కున తీసింది
కూర్పు చెడి పండ్ల కుప్ప కూలింది
చేసిన తాత్సారం చాలక గాబరాగా
వాటిని కిందపడకుండా ఆపాలనే తొందరలొ
చేతులాడించి మరో కుప్పను కదిలించి కృంగించింది

షాపువాడు ఎక్కడ కస్సుమంటాడో అని
టక్కున వచ్చి నా చాటున చేరింది
వాడికి రగిలిపోయినా బయటపడక
శివుడు గరళాన్ని గొంతులో ఉంచుకొన్నట్లు
కోపాన్ని పంటికింద బిగబట్టాడనుకొంటా
శివుని కంఠం నీలం సంతరించుకొన్నట్లు
వాడి మొహం ఎర్రబారింది కళ్ళు నిప్పులు చెరిగాయి..

పాపం! కింద పడిన పండ్లను ఎత్తుతున్న వాడిని చూసి
అనుకొన్నదానికంటే రొండింతలు ఎక్కువ కొన్నాను
.....వాడు చెప్పిన ధరకే!!
ఇంతజరిగినా వెనుకనుండి మా ఆవిడ గిల్లుడు ఆగలేదు
-బేరమాడమని ధర తగ్గించమని అడగండి అనే సైగగా
నాకేమో చిరాకుతో ప్రేమతో నవ్వొచ్చింది!
మరో సాయంత్రం గడిచింది!!

Monday, September 04, 2006

మల్లె పువ్వు

సందర్భం: నా చిన్నప్పుడు మా పెరట్లో పెద్ద మల్లె తీగ పందిరి కట్టి వుండేది. మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళు మా దెగ్గర మల్లెపూలు కొనేవారు.మల్లెల కోసం వచ్చేవాళ్ళు వాటిని గెలికి మరి చూసి మొగ్గలు ఇవ్వమంటే అన్నీ విచ్చుకొన్నై ఇస్తారేంటి....పొద్దునకల్ల వాడిపోవా అని మొహం ఎబ్బెట్టుగా పెట్టేవారు. అందుకే మా అమ్మ జాగ్రత్తగా చూసి ఒక మాదిరిగా వున్న మొగ్గలే తెంచమని చెప్పేది.....ఆ సందర్భాన్ని గుర్తుచేసుకొని రాసింది......సాధారణంగా మనం మల్లె మొగ్గల్ని కూడా వాడుకగా పూలే అంటాం. కాని ఇక్కడ నేను రెంటికి మధ్య వ్యత్యాసాన్ని స్పృశించాను...

స్కూలునుండి వచ్చి వరండాలో సైకిల్ స్టాండు వెసినంతలో
ఆ శబ్దం విని కాబోలు...."ఒరే చిన్నా! పెరట్లోకెల్లి
దోసెడు మల్లె మొగ్గలు తెంచు.." అని అమ్మ కెకేసింది...
నేను రివ్వున వెల్లి మా పెరటి మల్లె తీగ పందిరి దగ్గరకు పోయి
కాసేపు చుట్టు తిరిగుతూ, ఒకోసారి కిందకు చేరి
మొగ్గలకోసం వెతుకుతూ అందినవాటిని తెంచుతున్నాను....
మధ్యలొ వికసించిన పువ్వులను చూసి చిరాకు,
మొగ్గలు తెంచుతుంటే ఇవ్వొకటి అడ్డు అని
ఆ చిరాకులో అప్పుడప్పుడు కొన్ని పువ్వులను కూడా
నిర్లక్షంగా తెంచి కింద పారేస్తున్నా,ఎలాగు పనికిరావుకదా అని

కాని ఎందుకో, సాయంకాలపు పొగ వెలుతురులో
నల్లని నేలపై నేను విసిరిపారేసిన నిండుగ విచ్చిన
ఒక మల్లె పువ్వు తెల్లగా నా వైపే చూస్తూ వెక్కిరిస్తూ
ఎగతాళిగా నవ్వుతున్నట్లనిపించింది
మొగ్గలు తెంచుతున్న నేను కాసేపు అలా
దాన్నే చూస్తూ అచేతనంగా నిలచిపోయా
మొగ్గలు తెంచడమాపి మెల్లగా నేలనున్న
పువ్వు వైపు రొండడుగులేసి దాన్నే
పరికిస్తూ పరిశీలిస్తూ కిందగు వంగా

పండిన ఆ విచ్చిన పువ్వు సువాసనలు భారంగా
నా ముక్కుపుటాలను తాకి నా మీద ఇలా కసిరాయి
"మీ మనుషులింతే! మొగ్గగావున్నప్పుడు మరచి
విచ్చుకున్న మమ్మల్ని వద్దంటూ దూరంగా విసిరేసి
కళ్ళే తెరువని మొగ్గల్ని కోసుకుపోతారు
పువ్వులెందుకు పూటలో పాడైపోతాయి
మొగ్గలే మేలనుకొంటారు
కాని మేము ఒకప్పుడు మొగ్గలమే!
అవునులే మీగురించి ఎవ్వరికి తెలియదని ,
అన్నీ తెలిసిన వాటిని వద్దని ఏమీ తెలియనిదాంట్లో
ఏదో మర్మం వుందని వ్యర్ధమైనవాటి కోసం వెంపర్లాడతారు"

ఇంతలో అమ్మ మళ్ళీ కెకేసింది,
"చిన్నా త్వరగా కానివ్వు, దోసెడు మొగ్గలు చాలు
మసకబారుతుంది స్నానం చేసి
ట్యూషన్ టైమవుతుంది రెడీ అవ్వు" అని
ఉలిక్కిపడి నేను లేచి అవునుకదా అనుకొంటూ
ట్యూషన్ కు వచ్చే అందమైన నాకు నచ్చిన
నేను సైటు కొట్టే పిల్ల గురించి ఆలొచిస్తూ
ఏమి ఎరుగనట్లు పువ్వును తొక్కేసాను
తొందరగా మొగ్గలు తెంచడంలో పడిపోయాను

ఇప్పుడనిపిస్తొంది...జ్ఞానాన్ని నిజాన్ని విస్మరించి
బంధాల చట్రంలో చిక్కుకొని రాజీ పడిపొయానని
మల్లెపువ్వు తల్లోకి పనికిరాకపోవచ్చు...
కానీ మొగ్గగా వున్నప్పుడు దాన్ని తెంచకపోవడం
నాదే తప్పేమో అనిపిస్తోంది!

కొంచం వివరంగా: అసలు మొగ్గ-పువ్వు కి నిజం-రాజీ అనే పదాలతో ఏం సంబంధం? వీడి analogy ఏంట్రా బాబూ బొత్తిగా విడ్డూరంగా అర్థంకాకుండా వుంది అని మీరనుకోవడంలో తప్పు లేదు. కాని నన్ను కొంచెం వివరంగా చెప్పనీయండి! simpleగా చెప్పాలంటే మనం ఏ టైం లో చేయాల్సిన పనులు ఆ టైంలో చేసెయ్యాలి.దీనివల్ల మనకి ఫలితం వుంటుంది or atleast పనికి సార్థకత దక్కుతుంది. Let me explain it with a real life example- మా classmates తో ఒక e-group వుంది. అక్కడ మేమందరం touchలో వుండొచ్చన్న ముఖ్యోద్దేశంతో మొదలెట్టాము. Ofcourse నేనందులో activeవె కాదులేండి. ఎందుకంటే college రోజుల్లో మన image అంత చండాలంగా వుండేది. అయితే ఒకసారి మొన్నీమధ్య సునామి వల్ల సంభవించినా నష్టానికి చలించిన మిత్రులు మా e-group ద్వార classmates అందరికీ email చేసి బాధితుల సహాయార్దమై funds collect చేద్దాం అని ఒక మంచి ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. రోజులు గడిచినా నేనైతే ఎటువంటి ప్రతిస్పందన చూడలేదు. మరి నేనెందుకు స్పందించలేదు అని మీరడగొచ్చు. ఇంతకముందు చెప్పినట్టు నేనసలు ఆ groupలో activeవే కాదు. ఇలా అని ఏమి సమర్థించుకోవట్లేదు. ఇక ఎప్పుడూ చలాకీగా వుండేవారు కూడా స్తబ్దంగా వున్నారు. అయితే వారు మరొ రకంగా సహాయ నిధి పంపివుండొచ్చు...లేక కొంత కాలానికి ఇచ్చివుండొచ్చు. కాని అవసరానికి సమయానికి వెంటేనే పంపే పైకం కొంచెమైనా సరిగ్గ ఉపయొగపడేదేమో. అంతా సద్దుమణిగాక ఎం చేసినా ఏం లాభం? దళారుల పాలవడం తప్పితే....
నేనిక్కడ నా classmates కొందరినో లేక మాకుమ్మడిగా అందరినో విమర్శించడానికి ఈ విషయాని ఉదహరించలేదు, అయ్యో అలా ఎలా ముభావంగా చలనంలేకుండా వున్నారండి అని మీ reaction వినడానికి కాదు ఈ ప్రస్తావన. ఆకలిగొన్నప్పుడు అన్నం పెడితే పుణ్యం అంతేగాని బిచ్చగాడినైనా ఆకలి లేనప్పుడు పిలిచి బిరియాని ఇచ్చినా తీసుకొని వాడి వెనక తిరిగే ఊర కుక్కకి పడేస్తాడు. మన స్పందన సమయానుచితంగ ఉండకపొతే అది వ్యర్థం. బూడిదెలో పోసిన పన్నీటితో సమానం. అందుకే మనం పలికే వాటికి చేసేపనులకు పొంతనవుందో లేదో ఆత్మ విమర్శ చేసుకొందాం.
ఇక నా మొగ్గ-పువ్వు:నిజం-రాజీ analogy కి వద్దాం.మల్లె మొగ్గగా వున్నప్పుడు తెంచితే సరిగ్గా వాటి అవసరసమయానికి కొంచం విచ్చి విచ్చుకోనట్లుగా సరైన స్థితిలో వుంటాయి. మొగ్గ పరిపక్వ సంపూర్ణ రూపమైన పువ్వు మనకి కావాల్సిన సమయానికి వాడిపోతుంది, కాని పరిపక్వత లేని మొగ్గే ఉపయోగపడుతుంది. అయితే ఇందులో పువ్వుదేమి తప్పులేదు. తప్పంతా మనదే. దాన్ని మొగ్గగా వున్నప్పుడే తుంచేబదులు మన మన పనులకి preference and priority ఇచ్చి అది వ్యర్థమయ్యేలా చేస్తాం. నిజం తెలిసినా రాజీ పడతాం.

Don't procrastinate things thinking them minute and of less significance. And also don't be overconfident of your abilities and intelligence. Time can fail you in anything and everything, it surpasses all human knowledge.

Saturday, September 02, 2006

వేకువ వలపు

సుధామధుర కిరణాల అరుణోదయంలో
ప్రేమామృతధారల సెలయేటి ప్రవాహంలో
ఊపిరి సలుపలేక కౌగిలి వీడలేక నిను వదలక
నలిగిన మల్లెల ఇంపుల మత్తులో కోరికలు విచ్చగ

భానుడి రాకకు అవరోధముంటే ఎంత బాగుండు
కోయిల కూతకు పూచిన పూతలు అడ్డైతే మెండు
తన్మయత్వపు తలపుల మధ్య సన్నని సంగీతం వింటూ
కదులుతున్న కాలాన్ని కట్టడిచేస్తే చాలనుకొంటూ

సిగ్గులొలుకుతున్న చెలి చెక్కిలి గిల్లి అక్కున చేర్చుకొని
మక్కువతో ముద్దులిడగ, చుంబనాల స్వరమువిని
-ఇక చాలు లేవండి! ఎవరైనా వింటే మరి
వీరికి హద్దు పొద్దు లేదా అంటారని చేజారింది!!

గోల-జోల

కీచురాళ్లు గోల పెడుతుంటే
చిక్కటి చీకటైనా కునుకు రాక
విసుగెత్తి వాటిని చంపుదామని
చెప్పు చేతబట్టుకొని పోతుంటే
కట్టుకున్న లుంగీ వూడి
తట్టుకొని కింద పడి మూతి పగిలి
నొప్పితో మూలుగుతు నెమ్మదించి
ఎమి చేతగాక నిదురపొయా!
వాటి రణగొణ ధ్వనినే జోల పాటగా!!

Friday, September 01, 2006

కందిరీగ

ఊరంతా తిరిగి సంచారం సద్దుమణిగాక సూర్యుడు సేదదీరాక
చుక్కలు బిక్కు బిక్కు మంటూ ఒక్కొక్కటిగా మెరుస్తూ
నీలాకాశాన్ని జల్లెడగా తలపిస్తున్న వేళ
చిక్కటి చీకటిలో రెక్కలు టపటపలాడిస్తూ
నిశాచరంగా నిర్విరామంగా వడివడిగా సడిచేస్తూ
నా ఇంటి గుమ్మపు దిమ్మెపై ఉన్న దీపపు కాంతి చుట్టూ
గిరులు తిరిగుతున్న నీ రెక్కల సవ్వడి సంగీతం వింటుంటే
ఏదో చెప్పాలని ఏమోచెయ్యాలని నీలో పొంగుతున్న
భావార్ణవ ఘోష మస్తిష్కానికందని భాష
నాకర్థమయ్యింది...పరమార్థమయ్యింది.

ఊరి ఊసులన్నీ మోసుకొచ్చి మొరపెడుతున్నావని
లోకనాధుల చరితలు చేరవేయ గిరులు తిరుగుతున్నావని
దుమ్ము ధూళిలో తిరిగికూడా నిష్కళంకంగా ఉన్నావని
మనిషనే మృగాన్ని తృణీకరించి కందిరీగవయ్యావని

అన్నీ తెలిసికూడా బాధపడుతూ భ్రమపడుతూ
"నా" కోసం "నావారి" కోసం గ్రుడ్డివాడినయ్యాను
నీ శబ్ద ఘోష నా అంతరంగ బాషను మార్చింది
నీ వికృత రూపం నా వేషధారణను నిలువునా చీల్చింది

జివ్వుమనే నీ సంగీత విషాద సంవాదం
ఇప్పుడు నాకు వినబడుతుంది
కొత్త ఉదయానికై నడుంకట్టమని నీ తీక్షన పల్లవి
నాలో మలినాన్ని మట్టుబెట్టింది!