Tuesday, September 05, 2006

ఓ సాయంత్రం

పండ్లు కొందామని శ్రీమతితో జంటగా పళ్ళ షాపుకు వెళ్ళాను
చక్కగా కుప్పగా పేర్చిన నారింజ పళ్ళను చూసి
ముచ్చటపడిన నా శ్రీమతి కుతూహలంగా ముందుకెళ్ళి
పెద్దగా ముద్దుగా మెరుస్తూ నోరూరిస్తున్న నారింజను
మధ్యవరుసలొనుండి చటుక్కున తీసింది
కూర్పు చెడి పండ్ల కుప్ప కూలింది
చేసిన తాత్సారం చాలక గాబరాగా
వాటిని కిందపడకుండా ఆపాలనే తొందరలొ
చేతులాడించి మరో కుప్పను కదిలించి కృంగించింది

షాపువాడు ఎక్కడ కస్సుమంటాడో అని
టక్కున వచ్చి నా చాటున చేరింది
వాడికి రగిలిపోయినా బయటపడక
శివుడు గరళాన్ని గొంతులో ఉంచుకొన్నట్లు
కోపాన్ని పంటికింద బిగబట్టాడనుకొంటా
శివుని కంఠం నీలం సంతరించుకొన్నట్లు
వాడి మొహం ఎర్రబారింది కళ్ళు నిప్పులు చెరిగాయి..

పాపం! కింద పడిన పండ్లను ఎత్తుతున్న వాడిని చూసి
అనుకొన్నదానికంటే రొండింతలు ఎక్కువ కొన్నాను
.....వాడు చెప్పిన ధరకే!!
ఇంతజరిగినా వెనుకనుండి మా ఆవిడ గిల్లుడు ఆగలేదు
-బేరమాడమని ధర తగ్గించమని అడగండి అనే సైగగా
నాకేమో చిరాకుతో ప్రేమతో నవ్వొచ్చింది!
మరో సాయంత్రం గడిచింది!!

No comments: