Saturday, June 30, 2007

నస

రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వాన! ముసురు అనేంత సన్నటి తుంపర్లు కాదు...కుండపోతా కాదు...ఆకాశానికి జల్లెడ బొట్లు పడ్డాయేమో అన్నట్లు ఒకమాదిరిగా జల్లు కురుస్తూనే వుంది.కిటికీలోనుంచి బయటకు చూస్తూ..అలా ఎంతసేపయిందో తెలియదు...నీటి చుక్కల సవ్వడే నాకు జోలపాటయ్యింది.నా నిద్ర కూడా అంతే...ఈ వర్షం లా! గాఢ నిద్రా కాదు,అలా అని మగతా కాదు!"రేడియో తరనా"లో, కల్ కా రాత్ ఏ మహినే మే సబ్‌సే టండీ రాత్ హై,ఆజ్‌భీ వహీ టండ్ హై! తో అయిసి మోసం మే ఆప్ కా ఫర్మాయిష్...ఏ గీత్‌కా మజా లీజియె... అద్నాన్ సమి కా యె బీగి బీగి రాతోమె...అనే వ్యాఖ్యానం లీలగా వినపడుతూనే వుంది.అతడి మాటలు విని అప్పుడే రాత్రయ్యిందా అని ఆశ్చర్యం వేసి బద్దకంగా కళ్ళు తెరిచి చూసా! బయట మసక చీకటి,కీ ఇచ్చిన బొమ్మలా మెల్లగా తలతిప్పి గడియారం వంక చూసా...ఇంకా నాలుగుంబావే అయ్యింది.ఇక్కడ వర్షం పడితే జనాలకు ఎంత విసుకో నాకు తెలుసు.అదీ వీకెండ్లో అయితే మరీనూ!నేనైతే లోకంతో పనిలేనట్లుగా, ఇంకా నాలుగేగా అయ్యింది అనుకొంటూ కిటికీ పక్కన ముడుచుక్కూర్చున్నాను. ఆ తర్వాత కూడా చేసేదేమీ లేదు, తిని తొంగోటం తప్పితే!నాతో ఏకిభవించినట్లు చల్లని గాలి నా తల నిమిరింది.నాలాగే బద్దకంగా తిరుగుతుందనుకొంటా, తోడు దొరికానని కప్పుకొన్న దుప్పటిపై వీచి కదిపి నాతో దోబూచులాడుతొంది.ఆ తెమ్మెరేంచేసిందో ఏమో బద్దకం వదిలి బయటకెల్దామనిపించింది.గమ్యం తెలియదు..అలా డ్రైవ్ చేస్తూ యాధృచ్చికంగా ఇంటి దెగ్గరున్న లాండ్‌స్కేప్‌వైపు తిప్పాను.నింపాదిగా వెళ్తూంటే గత వేసవి గుర్తొచ్చింది.

వేసవిలో అంతా ఇంతా హంగామా కాదు...బార్బిక్యూ పార్టీలని,క్యాంపింగని ఇంకా ఎన్నో ఆట విడుపులు.ఇక్కడ వేసవి అంటే మన భారతావనిలా భగభగ మండుటెండలు కావు.ఒకమాదిరిగా, అంటే 20-25°c ఉష్ణోగ్రత ఉండి ఏదేను వనమంటే ఇదేనేమో అన్నట్లుగా చెట్టుచేమలతో ఆహ్లాదకరంగా ఉంటుంది.క్యాంపింగ్‌లో చేసే ముఖ్యమైన విశేషం "బుష్ వాక్"-అంటే చెట్లూ పుట్టలెమ్మటి అలిసిపోయెదాకా తిరగడం. ఇంతకి ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందంటే గత వేసవిలో ఇలాంటి క్యాంపింగ్ నేను డ్రైవ్ చేస్తూ వచ్చిన లాండ్‌స్కేప్‌లోనే జరిగింది...బుష్‌వాక్ నేనెంతో ఎంజాయ్ చేసాను.అలోచనలను భగ్నం చేస్తూ రాళ్ళు పేర్చిన పాకురు గోడపైనుండి పావురాల పలకరింపు!కారు దిగి ఆ దారిలో నడవాలనిపించింది...చినుకుల దాటికి చిత్తడిగా మారి నివురుగప్పిన నిప్పులా,ఆరగించి కదలక మెదలక సేదదీరుతున్న కొండచిలువలా హాయిగా నిద్దురపోతున్నట్లుంది ఆ మార్గం!దానికిరువైపులా కలియపడడానికి సిద్ధంగావున్న రొమ్మువిరిచి ఎదురెదురుగా నిలిచిన సైనికుల్లా నిటారు వృక్షాలు!తెమ్మరల తాకిడికి లయబద్దంగా కలిసికట్టుగా నాట్యంచేస్తున్న గడ్డిపోచలు...నీటిగుంటల్లో వలయాలు విచ్చి వినాశనమవుతూ నన్ను మైమరిపించాయి.

ఎందుకో కలసివున్నట్లున్నా విడివిడిగా నిలచిన చెట్ల మధ్య వ్యత్యాసం ఆకట్టుకొంది. కలీల్ జిబ్రాన్ అన్నట్లు "కలిసిమెలసి ఆనందంగా అందరితో ఆడిపాడు....కాని నీవు నీవు గా ఉండు ఒంటరిగా...కలసి నిలువు దెగ్గరగా గుడి స్తంభాల్లా, కాని దరిలో నీ ప్రత్యేకత నిలుపుకో". ఇంత ముభావపు సమయంలో,మసగ చీకట్ల దెప్పిపొడుపుల్లో, పావురాల వెక్కిరింతల్లో, నిండు చంద్రుని బిత్తర చూపుల్లో నా ఒంటరితనమే తోడనిపించింది...ఏ లోటూ లేదనిపించింది! వర్షం నన్ను ఇంట కట్టి పడేసినా మనసు పంజరాన్ని విప్పింది...అందుకే చిత్తడి నేలైనా ఇస్టంగా నడవాలనిపించింది ఆ సాయంత్రం... వర్షంలో బురదలో వీడి నడకేంటి వెఱ్ఱి కాకపోతే...అన్నట్లుగా చాశాడు నిండుగా రెయిన్‌కోట్‌వేసుకొని అటుగా వెళ్తున్న ముదుసలి!

Friday, June 29, 2007

ఊసులు

అలుపెరుగని అలల తాకిడికి
అణువైన స్పందించని శిలలా
-ఆమె హృదయం
******************
విరబూసిన పూతలు
కోయిల కూతలు
రవి ఛవి కాంతులు
చెలి సంగతులు
ఎన్నో వింతలు
తీయని చింతలు....
-వసంతం
********************
మనసు విరిగిన మనిషికి
నిట్టూర్పే స్వాంతనగా
చెక్కిలి నిమిరిన నీటిబొట్టు
-కన్నీరు
********************
గొంతెండిన కుసుమాలపై
జాలిపడిన గగన సంచారి,
కార్చెనే కన్నీరు!
-వర్షం  
********************