Friday, September 15, 2006

అనుభూతులు, హైకూలు

జడి వాన
గొలుసు తెగి
నేల రాలిన ముత్యాలు
ఓ క్షణ కాలపు సవ్వడి...
******************
నిర్లిప్తత
చిగురు ఎండింది
మనసు మూగవోయింది
గాలిలేని సంధ్య భారంగా...
******************
బాట
పచ్చని పచ్చిక మధ్య
పసుపు పాపిడిలా
ఎండిన గడ్డి గీత
*******************
ఎండాకాలం
కిర్రుమంటూ తిరగలేక తిరుగుతున్న
సీలింగ్ ఫ్యాను గాలికి వొణుకుతున్న సాలె గూడు
ఉక్కపోతలో నవ్వొచ్చింది
********************
వానాకాలం
ఎండావానలకు వెలిసిన
పాత గోడపై పాకురు
పచ్చగా పలుకరించింది
********************
తొలకరి జల్లు
పక్షుల కిలకిలలు విని
కిటికి తెరువగానే
మట్టివాసనను మోసుకొచ్చింది పిల్లగాలి
*********************
గాలివాన
రికామీ గాలి నీళ్ళతో జట్టుకట్టింది
అది చూసి నవ్వాపుకోలేక తుళ్ళుతూ ఊగుతూ
నేలకొరిగాయి కొన్ని వృక్షాలు
**********************
ఎదురు చూపు
ముసురులో ముడుచుకొని కూర్చుంది
మా ఇంటి ముందు కరెంటు తీగపై ఒక గువ్వ
పొద్దుగుంకుతున్నా కదలక
తోడు కోసం ఎదురు చూపేమో..

1 comment:

రాధిక said...

jadivaana,edurucuupu,nirliptata chaalaa baagunnaayi