Tuesday, September 12, 2006

నా వ్రాతలు

జీవంలేని జడత్వమైన
జటిలమైన కుటిలమైన
కుల్లిపోయిన కృశించిన
చచ్చుబడిన మచ్చబడిన
తుచ్ఛమైన నులివెచ్చని
వ్రాతలు నా వ్రాతలు కావొద్దని...
మనసుల తొలిచి మనుషుల గెలిచి
మంచిని పెంచి మలినం తుంచి
మ్రానుని మార్చి మత్తే దించి
మందిని కూర్చి మార్పును తెచ్చేలా
వుండాలి నా వ్రాతలు...
మదించి కదించి
ఖండించి కరుణించి
కరిగించి విరిగించి
చలనం సృష్టించాలని
సృష్టిని స్పృశించాలని
నా మది విధిగా వుసిగొలిపిన వాంఛ
అచంచల విశ్వాస శ్వాసతో
అకాశ విశాలంలో విపంచిలా
విహరిస్తూ వీక్షిస్తూ
తిరుగుతూ తపిస్తూ
తరిస్తూ తర్కిస్తూ
నే విరచించిన
నా వాక్యపు జాడను
బోసినోటి పసి పిల్లల
ముసి ముసి నవ్వులలో
ముదుసలి వదనపు
ముడుతల గీతలలో
స్వతంత్ర భావాల
నవ యువతీయువకుల్లో
జీవితం పరమార్థమయ్యిందనే
మధ్యవయస్కుల సంతృప్త స్వాంతనల్లో
స్థిరమై స్వరమై
శరమై చరమై
పర్వమై పదమై
ఆశై అనుకరణై
ఆదై అంతమై
అనుసంధానమై ఆనందమై
అఖిలమై సకలమై
అంబరమై అవనై
విశ్వమై శ్వాసై
శాస్వతమై అమరమవ్వగ
నే చూడాలి
అప్పుడే... తనువు వీడాలి!

No comments: