Thursday, August 31, 2006

చూపుల ప్రేమ

సులోహిత కాంతుల సాయం సమయాన
పక్షుల కిల కిల రావముల ఆలాపాన
ఆవుల మందలు తిరిగొచ్చె వేళ
రేగిన గోధూళిలో అలసిన పాలికాపు ఆగమాన
ఆశతో ఎదుచూస్తున్న నయనం అలిసింది
అయినా ఆశ చావలెదు...

రవి తొలి కిరణాలు పెరటిచెట్టాకులగుండా
అరకొరగా తెరిచివున్న నా గది
కిటికి కవాటాల్లొంచి చొచ్చుకొనివచ్చి
నార చాపపై కలలలొకంలో విహారిస్తూ
నిద్రిస్తున్న నా మోమును గుచ్చి
చెలి రాకను చెప్పకనె చెప్పి మేలుకొలిపాయి....

లేడికి లేచిందె పరుగుగా
ఒక్క ఉదుటున పెరట్లోకి చేరి
నిక్కి నిక్కి చుట్టుగోడ ఆవలనున్న
మట్టి బాటవైపు ఆశగా అసహనంగా
అవే ఎదురుచూపులు!

రోజూ కనపడే "రంభ"కు మారు
ఆమె అన్న మరియు కన్నవారు
మా ఇంటివైపే వెంచేస్తున్నారు!!
వారి రాక చూసి గుండె గొంతులోకి జారిపోయింది
బిక్క చచ్చి గోడ చాటున నక్కి
"ఈ రోజుతో నా ఈ చూపులప్రేమకు
చరమగీతం పాడతారు
అమ్మ నాన్నల ముందు అన్న వదినల ముందు
పరువు తీస్తారు", అని అనుకొంటూ
నిర్జీవంగా నిస్తేజంగా పడివున్న నాతో,
"బాబాయ్! బామ్మ త్వరగా రమ్మంటోంది"
అని బాంబు పేల్చి వెళ్ళాడు బుజ్జిగాడు....

ఇంకేముంది?...."మీ అమ్మాయి రోజు
మా ఇంటి ముందునుంచి వస్తూ పోతూంటే
చూపులతో అల్లరి చేసాను.
ఒట్టు! పన్నెత్తి ఎప్పుడూ ఒక్కమాటా అనలేదు"
అని ముందుగానే మదిలో మాటలల్లుకొని
వారిని క్షమాపణ వేడుకొందామని నిర్ణయించుకొని
గబాలున వారి ముందుకు వచ్చి,
"క్షమించండి......." అంటూ వివరించేలోపు...
"ఎంత మాట బాబు! చెప్పకుండా
వచ్చినందుకు మమ్మల్నే క్షమించండి"
అంటు అసలు విషయం చెప్పారు-
వియ్యానికి వచ్చారని
వయ్యారికి నె సరిజోడని.....

No comments: