Friday, February 09, 2007

ఆ కల!

ఎన్నో నూతన క్షితిజ రేకలు!
ఇన్ని దిశలా?, అని మనసు అబ్బురపడేలా!
రవ్వలహారం తెగి చెల్లాచెదురుగా పడిన
వజ్రాల తళుక్కుల్లా మిణుకు మిణుకు మంటూ
వెండివెలుగులీనుతున్న తారలు!
ఆశల తలుపు తెరుచుకొనగ ఆకసమును తేరి చూస్తూ
గతించిన స్వప్నానికై కలువరిస్తుంటే
అదురుతున్న కనురెప్పలు నింపాదిగ కలిశాయి
నయనాలలో నాట్యమాడుతున్న ఆ కలను బంధించాయి
కొత్త ఆశలు రేపుతున్న మరిచిన ఆ పాత కలకై
నాలో కడలి అలలలా ఒకింత కలువరింత!
అయినా జ్ఞప్తికి రాదెంతకీ ఊరించే ఆ కల
చెలి ఊసుల చిలిపి సందేశాలా?
కన్నవారి మమతానురాగాలా?
జలములకవతలనుండి నా క్షేమం కోరే
శ్రేయోభిలాషుల ప్రార్థనలా?
నా స్నేహకుసుమాల సువాసనలా?\
ఆనాటి వీడ్కోలులోని ప్రేమ కన్నీళ్ళా?
తిరిగిరాని బాల్యపు మధుర గడియలా?
నన్నూరించే ఊసులేవో దాగెను ఆ కలలో
ఉల్లసింపజేసెను నను ఆనాటి విభావరిలో
ఆ సాయంసంధ్యలో నింగిలో పరుచుకున్న ప్రశాంతతలో
ఎన్నో ఆలోచనలతో కలకలం రేపెను ఆ కల నా మదిలో!