Saturday, February 24, 2007

పెద్దోళ్ళ ప్రతిష్ట

"నీతులు చెప్పటానికే బాగుంటాయి ...అవును నీతులు చెప్పటానికే పాటించమంటే ఎట్టా మనుగడ సాధించేది?ఎవరికైనా తెలిస్తే ఇరవైయయిదేళ్ళ నా రాజకీయ జీవితం ముగిసినట్లే.అడుక్కోడానికి చిప్పక్కూడా గతుండదు.ఈసారి మంత్రివర్గ విస్తరణలో నా పేరే ముందుంది.సీయంకి నమ్మిన బంటుగా ఉన్నా.ఈ విషయం బయటకి పొక్కితే గోవిందా గోవిందా...నా సంగతి సరే పార్టీనే గల్లంతవ్వొచ్చు.అయినా ఇప్పుడేమయిందని?మందులు సరిగా వాడితే కొన్నేళ్ళవరకు ఏ సమస్యా ఉండదు.మన పరువు ముఖ్యం.ఈ ఎదవనాకొడుక్కి ఇన్ని షోకులున్నాయని తెలిస్తే మీసం మొలవకముందే పెళ్ళి చేసేవాడ్ని.మన కర్మ ఇట్లా తగలడింది.ఏ కారు కిందో పడి చచ్చినా బాగుండేది...నాక్కొంచెం సింపతీ వొచ్చేది,మినిస్టర్ పొసిషన్‌కి మన అభ్యర్థిత్వం ఇంకా బలపడేది.ఈ కుక్కకి పెళ్ళి చేయాల్సిందే ఇప్పుడు.సడెన్‌గా పెళ్ళి రద్దైతే లేనిపోని పుకార్లు పుట్టుకొస్తాయి.దానికితోడు నేను మినిస్టర్ అవడానికి వియ్యంకుడి డబ్బూ చాలా ఖర్చు చేసాను.పెళ్ళి ఫిక్స్ అయ్యేవరకు నిమ్మకు నీరెత్తినట్లుండి ఇప్పుడు పేల్చాడు బాంబు.వీడు నాకు పుట్టకపోయినా బాగుండేది.ఒక్కగానొక్కడు ఎందుకూ కాకుండా పోయాడు",కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నా కఠినంగా అరుస్తున్నాడు యంయల్ఏ గుర్నాధం..."పెళ్ళి ఆపేయాల్సిందే కదా,చూస్తూ చూస్తూ ఆ పిల్ల బ్రతుకు అన్యాయం చేయలేం"అని ఏ పుష్కరానికో కొంచెం ధైర్యం తెచ్చుకొని మాట్లాడే భార్యకు సమాధానంగా!అదీ రెండు గంటల రాత్రప్పుడు...గుర్నాధం, అతని కొడుకూ, భార్యా మాత్రమే అక్కడున్నారు...ఎదో బ్రహ్మ రహస్యం అయినట్లు ఎవరైనా వింటున్నారేమో అని ప్రతి నిముషం కిటికీలోనుంచి బయటకి చూస్తున్నాడు గుర్నాధం.వచ్చే వారం ప్రసిద్ధ పారిశ్రామికవేత్త రామ్మోహన్‌గారి అమ్మాయితో తన సుపుత్రుడి పెళ్ళి.ఆ మరుసటి రోజే మంత్రివర్గ విస్తరణ.దాదాపు గుర్నాధం పేరు కరారైపోయింది.అన్నీ శుభాలే ఈ ఏడాదనుకొంటే గుర్నాధం కొడుకు తీరని శోకం మిగిల్చాడు...శోకంకన్నా గుర్నాధం పొసిషన్‌కి ఫుల్‌స్టాప్ పెట్టే ఘనకార్యం చేశాడు.ఆ మరుసటి రోజు ఒక ప్రభుత్వ పాటశాలలో మధ్యాహ్న భోజన పదకం ఆరంభించడానికి వెళ్ళాడు గుర్నాధం.ఐదు నిమిషాల ముందే చేరుకొన్న గుర్నాధం ప్రిన్సిపాల్ రూంలో కూర్చొన్నాడు .పక్కనే ఉన్న తరగతి గదిలో నుంచి ఒక పిల్లాడు పద్యం చదువుతున్నాడు,
"చదువది ఎంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకంబు,గుణ సమ్యుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్యా భాస్కరా!"
అది విన్న గుర్నాధంకి చెంప పగలగొట్టించుకొన్నట్లనిపించింది.కొడుక్కోసం చేయాల్సిందంతా చేసాడు.అమెరికాలో చదివించాడు,ఖరీదైన కార్లు,తనతోపాటు అప్పుడప్పుడు ఒక పెగ్గు స్కాచ్,తన రేంజికి తగ్గ స్నేహాలే చెయ్యాలని సూచనలు,ఇంకా ఎన్నో విషయాల్లో దిద్దుబాట్లు...ఎదేమైన గుర్నాధం కొడుకుని కొడుకులా కాకుండా తన ఆస్తికి,స్టేటస్‌కి,రాజకీయ జీవితానికి వారసుడిగానే చూసాడు,దానికి తగినట్లు పెంచాడు.అది కొడుక్కీ అర్థమయ్యింది, అందుకే వాడికి అందరి పిల్లల్లా అబ్బాల్సిన మంచి బుద్ధులకంటే వక్ర బుద్ధులే ఎక్కువ అలవడ్డాయి.డబ్బూదస్కం ఉంటే ఎదైనా సాధ్యమే అన్న సూత్రం వాడి మనసులో బలంగా నాటుకొంది..దానికి కారణం గుర్నాధమే..ఇప్పటి వాడి పరిస్థితికీ గుర్నాధమే కారణం.ఈ దురాశలన్నీ నేర్పిన లౌక్యమనుకొంటా, విన్న పద్యాన్ని వెంటనే మర్చిపోయాడు..ప్రాయశ్చిత్తానికన్నా తనదైనశైలిలో పరిష్కారాలు ఆలోచిస్తున్నాడు గుర్నాధం, ఒక్క గండం గట్టెక్కాలి...పెళ్ళికి ముందు ఏదో ఫార్మాలిటీగా జరగాల్సిన వైద్య పరీక్షలు! ఈ మధ్య డబ్బున్నోళ్ళ పెళ్ళిలలో ఇది తప్పనిసరి అయ్యింది.ఏం ఫార్మాలిటీనో గాని గుర్నాధం మెడకి గుదిబండై కూర్చొంది.ఎదావిధిగా తమ సంరక్షణ్ హాస్పటల్కి ఈ పని అప్పగించాడు. పేరుకి తగ్గట్లుగానే సంరక్షణ్ హాస్పటల్ డబ్బున్నోల్లందరినీ సంరక్షిస్తుంటుంది.ఉదాహరణకి ఎవరైనా సెలబ్రిటీ లేక రాజకీయనాయకుడో ఎదైనా వివాదంలో ఇరుక్కొని చేయిదాటిపోయి ఇక బద్దకించిన చట్టానికి పని కలిపించినప్పుడు ఈ సంరక్షణ హాస్పటల్ ఆపన్న హస్తాన్ని అందిస్తొంది...సదరు ప్రముఖుడు సడెన్‌గా అనారోగ్యం పాలై ఈ హాస్పటల్లోనే చేర్తాడు, సంరక్షణ్ హాస్పటల్ వారు తమ హైలీ సొఫెస్టికేటెడ్ ఎక్విప్‌మెంట్‌తో సాధారణంగా రెండు మూడు రోజులు పట్టే పరీక్షలన్నీ తమదైన శైలిలో ఒకే ఒక గంటలో పూర్తి చేసి సదరు ఖరీదైన రోగి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు,ఎవరూ కలవడానికి వీల్లేదు,ముఖ్యంగా పోలీసోళ్ళు అసలు ఆ ఛాయలకి కూడా రావటానికి వీల్లేదని,తమ పేషంటు కోలుకోవడానికి కనీసం పక్షం రోజులు పట్టొచ్చని రాత్రికి రాత్రే సర్టిఫై చేసేస్తారు!
పక్షం రోజులు కాదు కదా వారం తిరగ్గ ముందే ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య సదరు ప్రముఖుడు అమాయకుడు అని ఒక వార్తొస్తుంది, తరువాత బకాసురిడికన్నా పెద్ద నోరున్న మీడియా మూతి మూసుకొంటుంది, ఔరా! అనుకొన్న ప్రజలూ బిజీ అయిపోతారు!ఇంతటి ఘనచరిత్రున్న...సారి! ఘనసిత్రాలు జరిగే హాస్పటల్ అయితేనే తన కొడుకు పెళ్ళి నిరాటంకంగా అవుంతుంది అని అనుకొన్నదే తడవుగా సంరక్షణ్ యజమానికి(సంరక్షకుడు) ఎప్పుడూ ఫండు తీసుకొనే గుర్నాధం కోటి విలువచేసే కాగితపు బండిల్లిచ్చాడు.మెడికల్ రిపోర్టులు రావడం, అందులో గుర్నాధం కొడుక్కి లివరు సరిగా పనిచేయడంలేదని పేర్కొనడం గుర్నాధాన్ని నిప్పు తొక్కిన కోతిని చేసాయి.వెంటనే సంరక్షకునికి ఫోన్‌చేసి ఏమిటయ్యా నీ నిర్వాకం? మావాడి లివరుకేమయ్యిందని?అసలు రోగం విడిచి కొత్త రోగం అంటిచ్చావేంటి? అనికసురుకొన్నాడు.వెంటనే సంరక్షకుడు, మీరు రాజకీయ నాయకుడెట్టా అయ్యారండి?ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయారు.ఈ రిపోర్ట్ చూసి మీ వియ్యంకులవారెం చేస్తారు? నాకే ఫోన్ చేస్తాడు...సమస్య తీవ్రమైందా కాదా అని అడుగుతాడు...నేను, కొంచెం ప్రోబ్లమాటిక్కే! అయినా పర్వాలేదు...క్యూర్ అయిపోతుంది, అవసరమైతే ఆపరేషన్ చేయ్యొచ్చు...కాని అవసరం లేదు అని డబ్బుగుంజి మరీ భరోసా ఇస్తాను...అప్పుడతడు అసలనుమానించడానికి తావేలేదు..ఎలా ఉంది ఆలోచన?కాకపోతే మీరింకొన్ని పచ్చ నోట్లు పంపండి, పనులవే జరిగిపోతాయ్!,అని అన్నాడు .వోరి నీ తెలివి పాడుగాను, నువ్వు నోరు తెరవాలంటే ముందు చేతులు తడవాల్సిందే, అన్నాడు గుర్నాధం!భలేవారండీ మీరు...మీలాంటివారు ఫండిస్తేనే కదా మేము మెరుగైన సేవలందించేది...పోయినేడాది మీ సీయంగారు మేం పేదలకు చేసే ఉచిత సేవను దృష్టిలో పెట్టుకొని మా పనులు విస్తరింపజేసుకొమని భూమిచ్చారు.మేమూ దానికి స్పందించి ఎంతో మంది పేదలకి ఉచిత వైద్యం చేసి వారి బాధలనుండి విముక్తుల్ని చేస్తున్నాం! సగానికి సగం మందిని పార్ట్లు పీకి పైకి పంపుతొన్నాం...ఎప్పుడో ఒకసారి ఉచితంగా నికార్సైన ఆపరేషన్ చేసి విస్తృత మీడియా ప్రచారం కల్పించి మా దయాగుణాన్ని చాటుకొంటున్నాం..మరియ్యన్నీ చేయాలంటే మీలాంటోళ్ళు చేదోడువాదోడుగా ఉండాలికదా! ఎమంటారు? అన్నాడు సంరక్షకుడు ..అవుననక చస్తానా వీడి శాడిజానికి అని మనసులో అనుకొన్నాడు గుర్నాధం!అనుకొన్న ప్రకారమే వియ్యంకుడు రామ్మోహన్‌గారు ఫోన్ చేయడం,గుర్నాధం ఆయన కూతిరి వివరాలేమి అడక్కపోవడంతో అపోహలన్ని తొలగిపోయి, పెళ్ళి సజావుగా జరిగింది,గుర్నాధం మినిస్టర్‌గా అందలమెక్కాడు...కానీ మనసులో ఒక ఆలోచన రగులుతూనే వుంది,ఎయిడ్సొచ్చిన కొడుక్కి పెళ్ళైతే చేసాడు, ఇంకో పదేళ్ళలోనో,పదిహేనేళ్ళలోనో వాడు పోవడం కాయం!తనకి ఇంకో వారసుడెట్లా అని ఇంకో "మాంచి" ప్రణాళిక రూపొదించే ప్రయత్నంలో పడ్డాడు!

2 comments:

Vissu said...

meeru em cheppali anukonnaro artham kaavadam ledu. could u please give me some clue if I you can!

తెలు'గోడు' unique speck said...

1.పరువు-ప్రతిష్ట కోసం ఎంతకైనా తెగిస్తారు
2.హై లెవెల్లో అవినీతి జరుగుతుంటే గట్టిగా నిలదీయాల్సిన సమాజం సర్దుకుపోవడానికి అలవాటుపడుతుంది-మనకెందుకులే అనే నైరాశ్యం
3.ఒకప్పుడు మీడియా అనేది ఎంత బలమైన శక్తో! ఇప్పుడు ఒక జోకైపోయింది(అన్నీ బయాస్డ్ వార్తలు,బ్లాక్‌మెయిలింగ్,మసాలా,వ్యర్థ విషయాల వేదిక)
4.మనం "బెస్ట్ ఆఫ్ ద వర్స్ట్" అనే సూత్రానికి బాగా అలవాటు పడిపోయాం...అదే దిక్కుమాలిన నేతల్ని ఎన్నుకోవడం తప్పితే ప్రత్యామ్నాయంగా ఎందరో సంస్కారవంతులు,దేశం మీద మమకారంతో గొప్ప గొప్ప ఉద్యోగాలొదిలేసిన యువకులు స్థాపించిన రాజకీయ పార్టీలకి అసలు ఆదరణే లేదు.
5.పైవన్నీ కాకపొయినా, ఈ టపా చదివినవారికి నిజంగా మరీ ఇలా జరుగుతోందా అనిపించొచ్చు కాని ఇట్లాంటి సంఘటణలు చాలా జరుగుతున్నాయి(ఏయిడ్స్ ఉన్నవాళ్ళెందరో పరువెక్కడ పోతుందో అని చెప్పాపెట్టకుండా హాయిగా పెళ్ళి చేసుకొంటున్నారు.దీని వలన ఎన్ని అనర్థాలో ఆలోచించండి)

ఇవ్వన్నీ చెప్పాలనుకొన్నాను కానీ చెప్పలేక చతికిలపడ్డట్లే-ఎందుకంటే ఇవ్వన్నీ మీకేకోశాన ఇందులో కనపడలేదు కాబట్టి.అయినా బ్లాగులో ఎందుకు పెట్టానంటే ఆదరాబాదరాగా ఇంత సొల్లూ రాసి నేనేంచేసుకోను, బ్లాగులో విసిరిపారేయక...అని...