Thursday, February 08, 2007

తుఫాను

అలల ఆటుపోట్లకు ఆశలు సన్నగిల్లి
నావలు తీరంవైపు తిప్పుకొని లంగర్లువేసి
ఒట్టి చేతుల్తో తమ పూరిళ్ళు చేరారు బెస్తలు
దివి బద్దలయ్యిందేమో అన్నట్లుగా కుండపోత
ఉరుములు మెరుపులతో గగనం గర్జిస్తుంటే
నాతో తగవా నీకు అన్నట్లు సముద్రుని ఘోష
కురుస్తున్న పాక కింద మూలకి కూర్చొని
ఎదురుగున్న గుంటలో బిర బిర ఈదులాడుతున్న
బాతుల గుంపుని తదేకంగా చూస్తొంది అవ్వ!
కొంగు కప్పుకొని చినుకులనుండి తల పదిలమైంది..
కాని రగులుతున్న ఆకలిని ఎట్ల చల్లార్చేది,
సమర్తాడిన పిల్లని ఒకింటిదాన్ని ఎప్పుడుచేసేది,
కడలి పగబట్టిందేమో,దాని మీద పడి
బతుకుతున్నమని మేమంటే తెగ అలుసేమో..
ఆ బాతుకున్న స్వేచ్చ తమ బతుకులకెప్పుడో..
అని ఆలోచనల తుఫానులో అతలాకుతలమవుతుంది!

1 comment:

విహారి said...

మంచి సామాజిక స్పృహ తో రాస్తున్నారు.

బాగున్నాయి మీ మంచి కవితలు

విహారి
http://vihaari.blogspot.com