Monday, February 19, 2007

బతుకు బండి

ఎన్నో ఆశలు మరెన్నో ఊసులు...
కాల చక్రంలో కరిగిపోయాయి
మనసొక విశ్వంలా
అనంతమైన ఆలోచనలతో-
ఫలించేవి కొన్నయితే
మరికొన్ని విఫలం!
అయినా ఆగదుగా బ్రతుకు బండి!
రాళ్ళు-రప్పలు నున్నని దారులు
ముళ్ళపొదలు పూల బాటలు
అన్నీ దాటుకొంటూ వెళ్ళాల్సిందే!
అన్నీ ఉన్నా అందరు ఉన్నా
ఒంటరితనం వెంటాడిన రోజులు...
ఊహలన్ని కరిగి ఎడారిలా వెక్కిరిస్తుంటే
ఎండిన బావిలా కన్నీరింకిన కళ్ళలో
ఇంకా ఎదో మిగిలింది...
చీకటి కమ్మిన రేపటిపై చావని ఆశ!
ఎన్నో తరాలకు అర్థంకాని "స్పింక్స్" మర్మం,
ఎవ్వరూ చేరలేని "మారియానా" అగాదం,
నాలోనే ఉన్నాయేమో!
తలకు మించినవాటిని చేదించాలని
మానవజాతికుండే అపేక్ష నాలోనూ ఉంది...
అందుకే అట్టడుగు నుంచి లేచి వొస్తాను
ఎన్నో ఆశలు మరెన్నో ఊసులు
కాలచక్రంలో కొత్తగ పుట్టగ!

2 comments:

Anonymous said...

అయినా సరే ఆగదుగా బ్రతుకు బండి!

రాధిక said...

"కన్నీరింకిన కళ్ళలో
ఇంకా ఎదో మిగిలింది..." అద్భుతం.
కవిత చాలా లోతుగా వుంది.ఇప్పటికి 10 సారులు చదివాను.ప్రతీ సారీ కొత్తగా ఏదో తెలుస్తూనేవుంది.