Wednesday, November 08, 2006

తరాల అంతరాలు

"ఏంటి దిగాలుగా కూర్చున్నావ్? అంతా సవ్యంగానే వుంది కదా? ఒకడేమో అమెరికాలో, ఇంకొకడు ఇంగ్లాండ్ లో, కూతురు గవర్నమెంట్ ఆఫిసర్, అల్లుడు మంచి హోదా వున్నోడే... ఎటువంటి వేధింపులూ లేవు. ఇంకెందుకయ్యా దిగులు?" అందరనే మాటే తన అంతరాత్మ కూడా పదే పదే చెబుతుంటే వెంకటయ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. నట్టింట్లో చక్రాల కుర్చీ కిర్రు కిర్రు శబ్దం ఆగిపొయింది, కాని వెంకటయ్య ఆలోచనలు అంతులేకుండా సాగుతున్నాయి. "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు" అన్న మాట ప్రతిసారి నిజం కాదేమో అనిపిస్తుంది వెంకటయ్య ముఖం చూస్తుంటే.

రిటైర్మెంట్ అయ్యాక పిల్లలతో ఎక్కువ సమయం గడపొచ్చనుకొన్న వెంకటయ్యకి నిరాశే ఎదురయ్యింది. వెంకటయ్యకి డబ్బు కొరత లేదు. అవసరంలేకపోయినా పుత్రుల పుణ్యమా అని విదేశాలనుండి డబ్బొస్తూనే వుంటుంది . వద్దంటే పిల్లల మనసు నొచ్చుకొంటుందని వొచ్చిన డబ్బు వొచ్చినట్లే పిల్లల పేరు మీదే జమ చేస్తుంటాడు. వెంకటయ్య దంపతులకి ఆయనకొచ్చే పెన్షన్ డబ్బులే అవసరాలకి మించి వస్తుంది. ధాన్యం, కాయగూరలన్ని వెంకటయ్య తండ్రి పుణ్యమా అని తన వాటా పొలన్నుండి వస్తాయి.

వెంకటయ్య స్నేహితుడు శ్రీనివాసరావు కూడా చివరికి అదే మాట,"ఏంట్రా నీ చాదస్తం? నువ్వు వాళ్ళదెగ్గరికి వెళ్ళి ఉండమంటే వారం తిరక్కుండ ఇంటిదారి పట్టావు. ఏడాదికి లేక కనీసం రొండేళ్ళకి ఒక్కసారైనా రావాలని పట్టుబడతావ్. పనిభారంతో వాళ్ళెంత బిజీగా ఉంటారో నీకు తెలుసు. అందుకే వాళ్ళకి వీలునప్పుడే వస్తామన్నారు. అందులో తప్పేముంది?" ఆయనకేంటి పిల్లలు బాగా సెటిలయ్యారు, ఏ చీకూచింతా లేదు అనే ఊరివారి మాటలు అసూయతోనో, మంచితనంగానో లేక తన బాధ తెలిసి ఎగతాళిగానో అర్థంకాదు, అర్థంచేసుకొనే స్థితిలో కూడా లేడు. శ్రీనివాసరావు మాటలకి ఒక కృత్రిమ నవ్వు నవ్వి, కళ్ళజోడు సరిచేసుకొంటూ ఇంటెనక దారిగుండా కోత ముగిసి ఎండకు ఎండిన వరి మోడులతో ఉన్న పొలంలోకి రోజూలాగే వాకింగ్ కి బయలు దేరారు ఇద్దరు.

నాన్న! ఊరికే ఇండియా రావాలంటే కుదరదు. మా భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి కదా. మాకంటూ ఒక ఇల్లు వాకిలి వుండాలి. ఇక్కడ ఇండియాలో లాగా ఇల్లు కట్టడం, కావాల్సినవి సమకూర్చుకోవడం అంత సులభం కాదు. లోన్లో ఇల్లు కొన్నాము, సో కష్టపడితేనేగాని కుదరదు. మీరేమో ఇక్కడ మీరున్నన్నాళ్ళు వుండమంటే వొంటరిగా ఫీల్ అవుతున్నా అంటారు. చూడండి ఎంతో మంది పేరెంట్స్ ఎడ్జెస్ట్ అవుతున్నారు, మీ సమస్యేంటో మాకంతుబట్టడంలేదు.అయినా ఎవరైనా సిటీలో సెటిల్ అవుతారుగాని మీరేమో ఆ పల్లెటూళ్ళో ఇల్లు కట్టారు. అక్కడకొచ్చి మేమేం చెయ్యాలి? ఇంతకంటే మాకు వేరే సొల్యుషన్ తోచడంలేదు...రెస్ట్ ఈజ్ అప్ టు యూ అన్న పిల్లల మాటలు నడుస్తున్న వెంకటయ్యకి గుర్తొచ్చాయి. "నాదే తప్పు రా...ఎందుకో పిల్లల్ని పెంచి పెద్దచేసి ఒకదారికి తేవడం ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అనిపిస్తుంది. నేను జీవం ఉన్న వాటి మీద ఇన్వెస్ట్ చేసాను...నా పిల్లలు తెలివిగా జీవం లేని వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు...ఎందుకంటే అవి వాళ్ళెలా కోరుకొంటే అలా వుంటాయి. కాని మనల్నేదో ఉద్దరిస్తారని పిల్లలపై ఆశ....కాదు దురాశ పెంచుకొంటే వాళ్ళూ ఒక జీవంలేని వస్తువుగానే తయారయ్యారు. భవిష్యత్తిచ్చిన వాడ్ని మరిచి భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నారు. కాలానికనుగుణంగా మారడం అంటే ఏంటో అనుకొన్నా....ఈ కాలానికి తగ్గట్టు యాంత్రికంగా మారాలన్నమాట. నా చాదస్తనికి సమాధి కడుతున్నా, రేపట్నుంచి చూడు ఇక నా దిగులు మొఖం మటుమాయం"

దున్నిన పొలాన్నే మేస్తున్న ఎడ్లమందని చూసి శ్రీనివాసరావు ఆలోచనల్లో మునిగాడు. ప్రతి బంధం ఇచ్చి పుచ్చుకొనే బంధమేనా? నిస్వార్థ బంధమేదీ లేదా? చివరకు తల్లిదండ్రులు పిల్లలు, తోబుట్టువులు, భార్యాభర్తలు వగైరా అన్నీ...అన్నీ రిలేషన్స్ ఇచ్చి పుచ్చుకొనేవేనా? దున్నినందుకు ఎద్దు పొలం మేస్తుంది, తప్పేముంది? కన్నందుకు వారినుండి కొంత కల్తీలేని ప్రేమను కోరుకోవడం తప్పా? అయినా సరిపడా డబ్బు పంపుతున్నాం, ఇంతకంటే మంచిగా తల్లిదండ్రులను ఎవరు చూసుకొంటారు అనుకొనే పిల్లల భావాలూ సబబేనా? ఎవరికి వారే సరైతే ఈ దిగులెందుకు? ఈ బాధెందుకు? గత నెల పై చదువులకోసం అమెరికా వెళ్ళిన కొడుకుని తలచుకొని శ్రీనివాసరావు మదిలో అలజడి మొదలయ్యింది. అడుగులు తడబడిన శ్రీనివాసరావుకి బుజాలు తట్టి అసరా ఇచ్చాడు వెంకటయ్య. గడ్డి మేస్తున్న ఎడ్లమంద ఒక్కసారిగా తలలులేపి ఇరువురివైపు చూసాయి బెదురుగా...ఇంకొకడు వెఱ్ఱి తీగ తొక్కాడనుకొన్నాయేమో!

7 comments:

Raghu said...

మీరు రాసింది చదివితే నాకు future కళ్ళ ముందు కనిపించింది...

నేను ఇప్పుశు ఇక్కడ student ని ....

ప్రస్తుతానికి చదువు అయ్యాక ఇండియా వెళ్ళిపోవాలి అని ఉన్నా... చదువు అయ్యాక ఎల ఉంటుందో చెప్పలేం కదా....

ఒక వేళ నేను ఇక్కడ ఉద్యోగం చెస్తే మా నాన్న కూడా అలాగే అనుకుంటాడేమో అని అనిపిస్తోంది నాకు...

కొంచెం బాధ, కొంచెం భయం....

రాధిక said...

కొంతమంది తల్లిదండ్రులు కూడా వుంటారు...తమ పిల్లలు తమ దగ్గర వుండడం కన్న విదేసాల్లో వున్నారని చెప్పుకొవాలని,బాగ డబ్బులు సంపాదించి పంపించాలని అనుకునేవాల్లు.
చాలా బాగుంది.మీ రచనా విధానం అద్భుతం.

తెలు'గోడు' unique speck said...

@raghu ram "... చదువు అయ్యాక ఎల ఉంటుందో చెప్పలేం కదా..." అంతా మంచి జరగాలని కోరుకొంటున్నా..."పరతంత్రమందు పాయసాన్నముకంటే స్వాతంత్ర్యమందు గంజి మేలు" అనే మౌలిక సూత్రాన్ని మరువకండి. ఇది ముమ్మాటికీ నిజం సుమీ!

తెలు'గోడు' unique speck said...

@తెలుగు_భాషాభిమాని- మరో సారి ప్రయత్నిస్తాను "ఈనాడు" లాంటి పత్రికలకు పంపించడానికి. "Nenu maatram naa parents ke naa first preference istunnanu...istanu."-విజయోస్తు!

తెలు'గోడు' unique speck said...

@ రాధిక- నిజానికి వెంకటయ్య, శ్రీనివాసరావులు కూడా అదే కోవకు చెందినవారు కాని వెంకటయ్య తన ప్రణాలిక ప్రకారం అన్నీ జరుగుతాయనుకొన్నాడు. అయినా నేనే కొంచెం స్థూలంగా వివరించాల్సిందేమో! మరో ప్రయత్నంలో improvement కనబరుస్తాను. ఇది నా మొదటి కథ.ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

రాధిక said...

మీరు కధలో వివరించకపోయినా చదువుతున్నప్పుడు అనిపించింది వెంకటయ్య మొదట అలాంటి హోదా కోరుకున్నాడని.తరువాత ఇంకొక విషయం...భవిషత్తు ఇచ్చినవాళ్ళని మరిచి భవిషత్తును కోరుకుంటున్నారని అన్నారు.ఒకప్పుడు ఆ తండ్రికి భవిషత్తు అంటే పిల్లలని ప్రయోజకుల్ని చేయడం.మరి ఇప్పుడు ఈ పిల్లలకి భవిషత్తు అంటే వాళ్ళపిల్లలని ప్రయోజకులిని చేయడం అవుతుంది గా.
వెంకటయ్య చేసినపనినే వాల్ల పిల్లలు చేస్తుంటే ఎందుకు ఆ మనిషికి బాధ.[ఇది కధే అయినా మీ అభిప్రాయం కోసం ఇలా అడిగాను.]

తెలు'గోడు' unique speck said...

@ రాధిక- మీరన్నది నిజమే.రెక్కలొచ్చాక పక్షి పిల్లలు గూడు విడుస్తాయి. అలా అని తల్లి పక్షి తిండి పెట్టక మానదు. ఇది జీర్ణించుకోవడం మనుషులకి చాలా కష్టం (ఈ విషయమై వెంకటయ్యలో జరిగిన సంఘర్షణ కథలో చూడవొచ్చు). ఈ సంఘర్షణ ఎందుకంటే పిల్లలను ప్రయోజకుల్ని చేయడానికి తల్లిదండ్రుల త్యాగాలు వారికి అన్నిటికంటే గొప్పగా తోచడమే, ఆ త్యాగాలకు ప్రతిఫలం కోరుకోవడమే! వెంకటయ్యను కాసేపు పక్కన పెడితే, సర్వస్వాన్ని ఇచ్చి పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన వారి సంగతి ఏంటి అని అందరూ అలోచించాలనే కథను రాసాను. అయితే అసలు వెంకటయ్య character ఏమీలేని సర్వం త్యాగం చేసిన తండ్రిగా పెట్టి కథ రాయొచ్చుగా అనే అనుమానం మీకు రావొచ్చు. అన్నీ వున్న వెంకటయ్యలకే ఇన్ని బాధలైతే కొడుకులనే (కూతుళ్ళను కూడా) నమ్ముకున్న దయనీయ స్థితిలో వున్న తల్లిదండ్రుల గతి వర్ణనాతీతం! ( ఈ తీవ్రత వుండాలని, సున్నితంగా సందేశం చెప్పాలని ప్రయత్నించా)