Thursday, November 30, 2006

ఒక వెన్నెల రాత్రి

అంబరవీధిలో సందడి చేయగ పరుగులిడే చంద్రుని తొందర చూసి చుక్కల్లో ఒక చుక్క చేసేదిలేక బిక్కు బిక్కుమంటూ ఈర్షతో కొసరు విరిగి తోకచుక్కలా నేలరాలి వింతకాతులు విరజిమ్మగ, ఆ కొన్ని క్షణాలు రేరాణి లావణ్య ముగ్ధతనుండి ఎందరి దృష్టో మరల్చిన చుక్కను చూసి గర్వంతో మిక్కిలిగా తళుక్కులీనెను కొన్ని చుక్కలు!
ఇంతలో వెన్నెల వలపులో తడిసి ముద్దైన కలువ కమనీయంగా విప్పారి కనులవిందు చేయగ, కుల్లుతో కృష్ణ వర్ణపు మేఘం శశిపుష్పాల ప్రేమభాషకు అడ్డొచ్చె!
అది చూసి మలయమారుతం మండిపడి రివ్వున వీచి మాసిన మబ్బును ముందుకు తరుమగ సంబరంతో అంబరంలో అడ్డుతొలగి తేటగ నవ్వెను చంద్రుడు!
నెలరాజు నవ్వుల వెలుగులో వృక్షపు తరులు పరవశంతో మెల్లగ ఊగగ, వాటి వెన్నెల నీడల గుసగుసలు మసగ చీకటుల మత్తు భలే గమ్మత్తని మనసుకు తెలిపెను!
సంతసంలో వింతగ నవ్వుతూ కలల తీరమున పరవశంలో తేలి ఆడుతూ కలువను కాంచగ కోరిన చంద్రుడు చెంతన కనబడే నన్నాశ్చర్యంలో ముంచుటకు!
అచ్చెరువొందిన నాతో సద్దుగ నిద్దురపోతున్న ఏరు వయ్యారంగా వలయపు విసురుతో, కలువ నెలరాజుల విరహపు వలపును మైమరిపించుటకు తన తేటదనంలో చంద్రుని ప్రతిబింబిచితినని కమ్మని కబురు వివరించెను!