Saturday, February 24, 2007

అంగ్రేజీ తెలుగు తల్లి-కంఫర్టింగ్ ఏంజెల్

నేను ఆక్లాండ్ వచ్చిన కొత్తలో ఒక మిత్రుని ఇంట్లో చిన్న "గెట్టూగెదర్"(get-together) జరిగింది.మనలా తిండి,మర్యాదల విషయంలో "అతిథిదేవో భవ" టైప్ కాదనిపించింది ఈ గోరేగాళ్ళు.దానర్థం అతిథుల్ని గౌరవించరని కాదు గాని పెళ్ళి,చావులు విడిచిపెట్టి సుమారుగా మిగిలిన చిన్న చితకా గెట్టూగెదర్లన్నిట్లో "పాట్లక్"(potluck) లంచులు,డిన్నర్లే.ఈ పాట్లక్‌కి నా నలభీమపాకమూ తీసుకెళ్లాను.బాచిలర్ లైఫ్ పుణ్యమా అని గరిటె తిప్పడంలో చాలానే ప్రగతి సాధించాను.ఇక మన చికెన్ ఫ్రైడ్ రైస్ తిని గోరాలు,గోరీలు చాలా మంది లొట్టలేసుకొంటూ భుజం తట్టారు...ఆ గుంపులో ఒకరిద్దరు దేశీలు ఉన్నారు...వారు నావైపు చూసి చూడనట్లు అంజాన్ కొడుతున్నారు.ఎందుకొచ్చిన గొడవ అని నేనే వెళ్లి పరిచయం చేసుకొన్నాను...మాటల్లో తెలిసింది ఒకమ్మాయిది మన రాష్ట్రమే అని,ఇంకొకరు తమిళ తంబి,మరొకరిది దేశరాజధాని.వెంటనే నేను,అమ్మా తెలుగుతల్లీ! మీకు తెలుగొచ్చా అని (ఆంగ్లంలో)అడగటం పూర్తవకముందే,నాహ్! ఐ డోంట్ హావ్ ఎ క్లూ, బై ద వె, యువర్ డిష్ ఈజ్ టూ స్పైసీ టు ఈట్ అంది...చిన్నఫ్ఫుడు షర్ట్ తీయించి క్లాస్‌రూం బయట నిలబెట్టినంత అవమానమనిపించింది నాకు! ఇదంతా గమినిస్తున్న "కంఫర్టింగ్ ఏంజెల్"లా పక్కనున్న చక్కని తెల్ల పిల్ల నేను హర్టయ్యానని గమనించి,మన అంగ్రేజీ తెలుగు తల్లి పక్కకెళ్లాక నాతో,సం ఇండియన్స్ ఆర్ మోర్ బ్రిటీష్ దెన్ ద బ్రిటీష్...డోంట్ మైండ్ హర్ కామెంట్స్, ఇండీడ్ ఐ ఎంజాయ్డ్ యువర్ రిసైప్ అంది...అప్పటినుంచి నేను ఈ అమ్మాయిని కంఫర్టింగ్ ఏంజెల్ అని పిలవడం మొదలెట్టాను...ఆమె స్వాంతన మాటలకంటే ఖాళీ అయినా నేను తెచ్చిన బొచ్చ నాకు తృప్తినిచ్చింది...ఇంతకిందంతా ఎందుకు చెప్పానంటే వేరే ఏ విషయాల్లోనైనా ఎన్ని మాటలన్నా పర్వాలేదు కాని కష్టపడి చేసిన వంటకి వంకలు పెడితే యమా మండుద్ది-జ్యోతిగారినడగండి కావాలంటే! లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మలను,అర్థాంగులను అడగండి.ఇక రెండో విషయం, వెన్ ఇన్ రోం,డు యాస్ రోమన్స్ డు అన్నంతమాత్రాన మన సాంప్రదాయాల్ని తుంగలో తొక్కాలని అర్థం కాదు.మూడోది, మంచి స్నేహాలకు సంస్కృతులు,అలవాట్లూ అడ్డు రావు!-మరి మీరేమంటారు?

8 comments:

Dr.Pen said...

ఇలాంటి 'అంగ్రేజీ తెలుగు యువతీ-యువకులు' చాలా మందే ఉన్నారు. అసలు నన్నడిగితే మన ఆంధ్రదేశంలోనే ఇంకా ఎక్కువ ఉన్నారు. తెలుగు మాట్లాడితే తమ 'పోష్-నెస్' ఎక్కడ దెబ్బతింటుందో అనుకొనే తెలుగు వారిని ఎంత తిట్టినా పాపం లేదు! మీ టపా ఇలాంటి కొంతమందికైనా కనువిప్పు కలిగించాలి.

Anonymous said...

అవును ఇలాంటి వెధవ బుద్ధులు ఇక్కడ కూడా ఈ మధ్య మొదలయ్యాయి. ఈ మధ్య బాగా సున్నితంగా తినటాలు, ఇటాలియన్ చప్పిడి వంటకాలు ఎక్కువయ్యాయి,నాకు మండి ఏకంగా మా కంపనీలో ఈ మధ్య జరిగిన పాట్ లక్ అనబడే విదేశీ సరదాని బహిష్కరించా.

రాధిక said...

మీరన్నది పచ్చి నిజం.ఇక్కడ చాలా మంది అలాగే ప్రవర్తిస్తున్నారు.ఈ అనుభవం మీకు మంచి పాఠమే నేర్పినట్టుంది...మరి పెళ్ళయాకా మీ ఆవిడ వంటలకి వంకలు పెట్టకండే..

Sudhakar said...

నాకున్న అత్యంత పదునైన శస్త్రాలలో "బ్రహ్మోస్" అనగా బ్రహ్మచారి వంట ఒకటి. నాకు ఎవరి వంట నచ్చకపోయినా నిమిషాలలో ఒక కత్తి లాంటి కూర చే్సుకు తినెయ్యగలను. అందువలన ఆ విషయంలో మనం చాలా ధీమా :-)

కొత్త పాళీ said...

చాలా ఆనందించాను మీ టపా చదివి. ఒకటి మన నలభీముల పరువు నిలబెట్టారు. నేను బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో ఈ కుండ లక్కుపార్టీలు ప్లాన్ చేస్తున్న ఆంటీలెవరన్నా, "ఆ, నువ్వెం తెస్తావులే, ఏం తేవొద్దు" అని జాలిగా అన్నప్పుడల్లా ఎక్కడో కాలేది.
డా.ఇ గారూ, గొప్పగా శలవిచ్చారు. ఓ, ఐ డొన్నొ టెల్గూ అనే మాటలు తెలుగు నాటనే ఎక్కువ వినిపిస్తున్నాయి.
శో.సు. గారు, మీకున్న కళల్లో పాకశాస్త్ర ప్రావీణ్యత కూడా ఒకటన్నమాట! భలే!! మరి మాకెప్పుడు రుచి చూపిస్తారు?

Anonymous said...

ఏ దేశం లొ నైన ప్రాంతీయ బాష రాని వారితొని మాత్రమె ఇంగ్లీష్ లొ మాట్లాడుతారు. అదెంటొ మన ఆంధ్ర ప్రదెశ్ (ముఖ్యంగా హైదరాబాద్ లొ)లొ ఇంగ్లీష్ లొనె లేక పొతె హింది లొనొ మాట్లాడుతారు. ఆఫీసు విశయం వదిలెయ్యండి, బైట కూడ ఇంగ్లీష్ లొ అడిగిన ప్రశ్న కు తెలుగు లొ సమాదానం చెపితె నవ్వుతారు.

Anonymous said...

ఈపాటికి ఆ అమ్మాయి తెలుగో కాదో కనిపెట్టేవుంటారే..
ఆ అమ్మాయి తెలుగమ్మాయని తెలిస్తే కడిగిపారేస్తారు కదూ?

రానారె said...

ఇక్కడ నేను రాసిన కామెంట్ కనబడకుండాపోయిందే, ఏమైందబ్బా...! ఏమైనా, ఇప్పుడు మీ బ్లాగును చదవడానికి కళ్లు ఇబ్బందిపడవు.