రవి తొలి ఛవి స్పృశించగ,
ప్రభాతమున విపినమున నసివారుచుండగ
ప్రభాతాంశువంటి నీ జ్ఞాపకము,
మన యడబాటు నయన ద్వయ
విప్రయోగమంటిదని యదనసి దూసిన
విధంబున నను బాధించగ
నుప్పొంగిన ఆశ్రువులు ఇరుదారలై
హనువులబారి ఏకమయి
ఊర్ద్వమునకెగయుచున్న తుషారమువలె
మదికుపశమనమునిచ్చెన్...
ఏలయనగా ఏకమైన ఆశ్రువులవలె
నీ జ్ఞాపకము నాలో,నే నీ జ్ఞాపకములో
నిత్యమిమిడిపోతిమని వివరించెన్!
(కొంచం సరళంగా)
సూర్యుని తొలి కిరణం నను తాకగ,
వేకువనే అడవిలో నింపాదిగా నడుస్తూంటే
ఉదయకాంతివంటి నీ జ్ఞాపకము,
రొండుకళ్ళూ ఏవిధంగా ఎన్నటికీ కలువవో
అలాంటిది మన ఎడబాటని తెలుపగ
హృదయములో కత్తి దూసినంత బాధ కలిగి
ఉబికిన కన్నీరు చెక్కిళ్ళపై రెండు దారలుగాపారి
ఏకమయి పైకెగస్తున్న పొగమంచులా
మనసునకు నెమ్మదినిచ్చెను.....
ఎలాగనగా ఏకమైన కన్నీటివలె
నీ జ్ఞాపకములో నేను, నాలో నీ జ్ఞాపకము
ఎప్పటికీ కలిసిపోయామని తెలిపినవి!
No comments:
Post a Comment