Wednesday, February 28, 2007

వీరి పీడ విరగడైపోను....

టీవీ చూస్తొన్న ముసల్దానికేమర్థమయ్యిందో కాని, ఇరాక్‌లో రగులుతున్న కొలిమిని చూసి,శవాల కుప్పలని చూసి,అమెరికా సంకీర్ణ సేనల్ని చూసి వీరి పీడ విరగడైపోను అని అమెరికన్లను నానా శాపనార్థాలను పెడుతొంది.అంతా గమనిస్తున్న ఆమె కొడుకు రవి పేపరు చదువుతూ తనలో తనే నవ్వుకొన్నాడు...ముసల్దానిలాగానే ఒకానొకప్పుడు...అంటే సుమారు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధి ప్రభుత్వాన్నుద్దేశించి తాను అలానే,"దీని పీడ విరగడైపోను" అనుకొన్నాడు.ముసల్ది జరుగుతున్న మారణకాండను,వినాశనాన్ని కేవలం చూసి శాపనార్థాలు పెడుతొంది కాని తను అప్పట్లో ఒక బాధితునిగా మండిపడ్డాడు.అప్పుడతనికి ముప్పై ఏళ్ళు...చిన్నపట్నుంచే రాజకీయాలంటే చాలా ఆసక్తి..తనలో ఒక గాంధియన్ సోషలిస్టు ఉన్నాడని తెలుసుకోవడానికి ఎన్నో రోజులు పట్టలేదు....ఆ గాంధియన్ సోషలిస్టు కాస్తా కలకత్తాలో చదువుకొన్నప్పుడు పరిచయమైన ముకర్జీ చలవతో కమ్యూనిస్టు భావజాలంతో నిండిపోయాడు.దాని పుణ్యమా అని ఎమర్జెన్సీ సమయంలో పడిన తంటాలు అంతా ఇంతా కాదు.పెళ్ళాం పిల్లల్ని వొదిలి సందుల్లో గొందుల్లో పడి సుమారు రెండేళ్ళు పోలీసోళ్ళకి చిక్కకుండా ఎప్పుడో ఒకసారి కుటుంబాన్ని కలుసుకోవడం,ఒక్క కమ్యూనిస్టులే కాదు, ప్రభుత్వ వ్యతిరేక భావజాలం ఉన్న సంఘ్‌లు కూడా బాధితులే!ఎదేమయితనేమి....ఎమర్జెన్సీ ముగియటం ఇందిర ప్రభుత్వం పడిపోవడం తరువాతొచ్చిన ప్రభుత్వం కసితో పగబట్టి మరీ ఇందిరను, తోటి ఎమర్జెన్సీ మోనోపొలి గాళ్ళను(సంజై గాంధి అండ్ కొ.,) సాధించడానికి చేసిన ప్రయత్నాలు తనను ముక్కున వేలేసుకొనేట్లు చేసాయి.ఎందుకో తన నరనరాల్లో జీర్ణించుకుపోయిందనుకొన్న కమ్యూనిస్టు భావజాలం సరిగా జీర్ణం కాలేదేమో అనిపించింది...ఆ తరువాత తనలో చిన్నగా గూడుకట్టుకొంటున్న వైరాగ్యం అనే మహమ్మారి భావజాలం వలననుకొంటా అప్పట్లో యమ ఊపు మీదున్న ఆబ్జెక్టివిసం,ఆల్‌ట్రూయిసం వంటివి ఎన్నెన్నో పరస్పర విరుద్ధ భావజాలాలు నానా సమయాల్లో తనపై ప్రభావం చూపాయి.ఒకసారి తిక్కరేగి తన గురించి తనే ఆలోచించాడు.ఏంటి నేనింత చపలచిత్తుడినా?నాకంటూ ఒక ఒరిజినాలిటీ లేదా?ఒకసారి మంచిగనిపించింది ఇంకోసారి నచ్చదెందుకు?అందరూ నాలాగే ఉంటారా?కొందరు వారు నమ్మిందే జీవితాంతం వరకు పాటిస్తారుగా...ఆ బహుశా వాళ్ళు ఇగోయిస్టుగాళ్ళేమో!లేకపోతే దిన దినాభివృద్ధిలా భావజాలంలో కూడా శ్రేష్ఠమైనవి వస్తూనే ఉంటాయిగా...నేను కరేక్టే...ఎడాప్టవ్వడం నేర్చుకొన్నా...నచ్చిన దాన్ని అక్కున చేర్చుకొంటున్నా,నచ్చని దాన్ని వదిలించుకొంటున్నా..అని తను చేసుకొన్న తీర్మానాలు తలచుకొని కాసేపు నవ్వుకొన్నాడు రవి!ఈ మధ్య తన పాత భావజాలంతో ఉన్న వ్యక్తులు అమెరికాను తూర్పారబడుతూ రాస్తున్న కవితలు,వ్యాసాలు కూడా నవ్వు తెప్పించాయి.ఎందుకంటే అవిచదివినప్పుడల్లా గజదొంగల కథ గుర్తొచ్చేది.ఒక ఊరినిండా గజదొంగలుండేవారు...అందులో ఒక చిన్న గజదొంగకి అనుకోకుండా గొప్ప ఖజానా దొరికింది.దాన్ని సొంతం చేసుకోడానికి బలమైన గజదొంగలు నానా రకాల పదకాలు వేసారు.కానీ అందులో బలమైనవాడు తెగించి చిన్న గజదొంగ ఇంటిల్లిపాదిని చంపి,బతికున్నోళ్ళని లొంగదీసుకొని ఆ ఖజానా సొంతం చేసుకొంటుంటే మిగిలిన గజదొంగలు బలమైన గజదొంగకి ఎట్లా గండీ కొట్టాలా అని నానా హైరానా పడసాగారు.ఒకరేమో నువ్వు చేస్తొంది తప్పు.ఇన్నాళ్ళు దోచుకొన్న దాంతో తృప్తిగా ఉండొచ్చుగా అన్నాడు.ఇంకొకడు అంతా నీ ఇష్టం వొచ్చినట్లు చేస్తే ఊర్కోం అని నానా గగ్గోలు పెట్టాడు(మాక్కూడా వాటా ఇస్తే ఊర్కొంటాం అని వాడర్థం).ఇంకో గజదొంగ మేమసలు దొంగలమే కాము ఇలాంటి దొంగతనాల్ని, మారణకాండను సహించం అని చెప్పుకొచ్చాడు...ఇలా పెద్ద గజదొంగ చేసిన తప్పిదాన్ని మిగతా గజదొంగలందరూ నానా రకాలుగా విమర్శించారు....అనుకోకుండా పెద్ద గజదొంగ బలహీనుడైపోయాడు...ఇదే అదనుగా గతంలో నీతులు చెప్పి బలం పుంజుకొన్న మరో గజదొంగ తన నీతి తప్పి ఇంతకుముందు గజదొంగ కంటే పెద్ద మారణకాండే చేయసాగాడు....ఇలా ప్రతి ఒక్కడూ అవకాశవాదులే....ఈ రోజు అమెరికా,అది క్షీణించాక ఏ చైనానో, రష్యానో సూపర్‌పవర్ అయితే అంతా సజావుగానే ఉంటుందనుకోవడం హాస్యాస్పదం....మనిషి బుద్ధే అంత!అయినా మనుగడ తప్పదు...మనుగడ సాగుతొంది!ఎందుకంటే మనుషుల్లో భావజాలలు మార్చుకొనే ఇగో లేనోళ్ళు అక్కడక్కడా ఉన్నారు...ఒకవేళ అటువంటి వారు లేకపోయినా కాళ్ళు గుంజడానికి తోటి గజదొంగలు ఉండనే ఉన్నారు!

8 comments:

సత్యసాయి కొవ్వలి Satyasai said...

అక్షరసత్యం చెప్పారు. ఏరాయైనా ఒకటే పళ్ళూడగొట్టుకోవడనికి.

Anonymous said...

మీ దొంగల కధ వర్తమాన పరిస్తితులకి అద్దం పడుతున్నది. అగ్రరాజ్యాలనబడే బడా దొంగల పచ్చి అవకాశవాదనికి, ఈ మారణకాండకి ముగింపు ఎన్నడో?

వెంకట రమణ said...

మీ బ్లాగు బ్యాక్‌గ్రౌండు నల్లగా ఉండడం వల్ల చదవడానికి కళ్ళకు కొంచం ఇబ్బందిగా ఉంది. వీలయితే దాన్ని మార్చగలరు.

వెంకట రమణ said...

అడిగిన వెంటనే మార్చినందుకు కృతజ్ఞతలు.

చదువరి said...

హమ్మయ్య, మీ బ్లాగు ఇపుడు కళ్ళక్కూడా ఇంపుగా ఉంది.

Anonymous said...

హమ్మయ్య ఇప్పుడు నేను బాహటంగా ఈ బ్లాగు చదువుకోవచ్చు. ఇంతకు మునుపు ఎవరైనా చూస్తే నేను ఎదో హాకర్ సైటో లేదా పోర్న్ సైటొ చూస్తున్నానే విధంగా మొహం పెట్టారు మా కొలీగ్స్ :-)

చదువరి said...

ఈ దొంగ పోతే మరో దొంగ వస్తాడు.. నిజమే! కానీ అందుకని ఈ దొంగను ఎదుర్కోకుండా ఉండలేము కదా!!

తెలు'గోడు' unique speck said...

చదువరి గారు,"మనిషి బుద్ధే అంత!అయినా మనుగడ తప్పదు...మనుగడ సాగుతొంది!ఎందుకంటే మనుషుల్లో భావజాలలు మార్చుకొనే ఇగో లేనోళ్ళు అక్కడక్కడా ఉన్నారు...ఒకవేళ అటువంటి వారు లేకపోయినా కాళ్ళు గుంజడానికి తోటి గజదొంగలు ఉండనే ఉన్నారు!"అని అందుకే చెప్పాను.