Thursday, February 15, 2007

ప్రాణసఖి

నాకై నా ప్రాణసఖి ఉనికి నిర్వ్యాజ్యమా?
నా సర్వం నీవేయని నేనాధారపడే తను ఉందా?
తను అరుణోదయాంశువులలా
నా జీవితంలో ఉదయించునా?
ప్రేమనుగన్నదానిలా నా స్నేహమే మిన్నగా
నాకై తపించే తను ఉందా?
కలలో జనించే తన నవ్వుల సవ్వడులే
నాలో పదిలంగా నిలువగ
విరిసిన నా హాసంలో ఉన్న వెలుగు
తన అస్థిత్వంలోనే సంపూర్ణమవునని
నేనెరిగి రగిలే జ్వాలావేశములా నాలో ప్రేమ
తనకై విశ్వాంతరాలలో గోచరించగ,
ఉనికేలేని ఊహలకే నాలో ఇంత ప్రేమాయని
ననుచూసి వెక్కిరించిన చుక్కలు-
ఎన్నో ఒడిదొడుకుల జీవనయానంలో
నను వలచిన తోడకరుంటే
ముసిరిన నిస్తేజాంధకారములను
రేపటి ఆశల వెలుగులను గుప్పెటపట్టి తరిమెదననని,
నడిసంద్రమున నావకు చుకానిలా తనుంటే
ఎగిసిపడే అలలలో సహితం అదుపుతప్పనని,
కనిన కలలు నాలో నింపింపిన నమ్మకపు జాడలు
నా నిరీక్షణలో చూసి నివ్వేరపోయాయి!
తనను కాంచువరకు వెలుగులీను సిద్దెలా
ప్రేమ కలశము నిండుకొనగా వేచియుందును!
తను వస్తుంది...ప్రాణ సఖి! నా ప్రాణసఖి!
విశ్వమంతా కలగలిసినా వెలకట్టలేని ప్రేమతో....

1 comment:

రాధిక said...

చాలా బాగుందండి
వస్తుంది.ఈ కవిత చదివాకా అన్నా తను వస్తుంది.
మీ కలలకి రూపాన్నిస్తూ
మీ ఆశలకు ఊపిరిపోస్తూ
తను నిజమై వస్తుంది
వస్తూ వస్తూ...వెన్నెలలు తెస్తుంది