Saturday, September 16, 2006

శిశిరపు చెట్టు



కృష్ణ, కాంతిని తరుమగ
వేగిరపడి వస్తున్నానని
పక్షుల కిలకిల రవములలో
లిఖించి సందేశించిన అరుణ సంధ్యలో...

ఎవరులేని ఒంటరితనం హాయనిపించి
సరస్సును చేరే విసిరిన సరములా
వొంపులు తిరిగిన సన్నని సిమెంటు బాటలో
నింపాదిగా నడుస్తున్న నాతో,
శిశిర సరసానికి రాలి ఎండిన
పండుటాకులు నా కాళ్ళకింద నలుగుతూ
ఎగిరెగిరి పడుతూ గుసగుసలాడి

ముగ్గుల చుక్కలద్దినట్లు
అక్కడక్కడ పసిడిరంగు పండుటాకులతో
అస్తిపంజరంలా విస్తరించిన బోడి కొమ్మలతో
కురులు విరబూసుకొన్నట్లుగావున్న నిన్ను
ఆతృతగా పరిచయం చేసాయి

నీ మోడులావున్న నేను నిన్ను చూస్తూ
ఆగుతూ అడుగులేస్తూ నడుస్తూంటే
ఒక్కో కొమ్మా ఒక్కో జ్ఞాపకాన్ని నిమిరింది

మలయమారుతం మోమును తాకి
తలపుల తాపాన్ని తడిమి తరిమి
సడిచేయక పిల్ల వలయాలతో
నా ప్రతిబింబాన్ని పాడుచేసి
వెక్కిరిస్తున్న సరస్సుని చేరానని చెప్పింది

అయినా నిశ్శబ్దంగా నగ్నంగా ఉన్న నువ్వు
నా జ్ఞాపకాల ఊసుల్ని తడుతూనే ఉన్నావు
వసంతమొచ్చే వరకు వేచివుండమని
పండుటాకులు రాలుస్తూ పలకరిస్తూనేవున్నావు

1 comment:

రాధిక said...

emi baagundani ceppaloa teleetledu.okko line chaduvutumte okko bhaavana.civarivaraku mamci tanmayatwam kaligimdi.