ఆలోచనలు నిరంతర ప్రవాహంలా
అనంతంగా కొనసాగుతూ
నన్నునేను మరిచి
చేతిలోని పూరెమ్మలు తెంచుతూ
ఏటిగట్టుపై అడుగులో ఆడుగువేసి
నింపాదిగా నడుస్తూంటే
నన్ను చూసి నీటిలో దూకిన
కప్పల అలజడికి ఉలిక్కిపడి
అటు చూడగా....
విప్పారిన తామరలో
గోచరించింది నీ రూపం
మండూక సందడికి రేగిన వలయాలు
విరహాన్ని తలపించాయి
అందుకే వలయం తామర ఉన్న
స్థానానికి చేరుతుంటే
నాలో ఏదో తెలియని
విపరీతమైన ఉత్కంఠత
వలయం తామరను దాటి
జరిగిపోతూ చివరికి కనుమరుగైతే
అచేతనంగా అసహనంగా
నీరు నిలిచిపోవాలని దృఢవాంఛ
అవునుమరి! అలానే అనిపిస్తుంది!!
వలయంలాంటి నా ప్రయాణం
తామరలో దాగిన నీ రూపంలా
దూరంగా ఉన్న నిన్ను చేరాలని....
No comments:
Post a Comment