Wednesday, September 27, 2006

అంతులేని వింతాశలు

నింగినంటే శిఖరం అంచున నిలకడగా నిలవాలని
కనుచూపుమేరా నా అస్తిత్వం అణువణువునా తెలపాలని
ఆశయం
ఆల్బెట్రాస్ లా అలలపై ఎడతెరిపిలేకుండా ఎగరాలని
నవ్వుతున్న విప్పారిన పువ్వులా నిత్యం వికసించాలని
సంకల్పం
ఎప్పుడో నడచిన దారుల్లో పదే పదే తిరగాలని
చిరు జ్ఞాపకాల్ని అదేపనిగా గురుతుచేసుకోవాలని
కోరిక
నాలో నేను నవ్వుతూ తుళ్ళుతూ అగమ్యంగా నడవాలని
క్యూలో నడుస్తూ నన్ను చూసి నవ్వే బడిపిల్లల గుంపులో చేరాలని
ఆశ
చిటపట చినుకుల్లో రివ్వున ఉరికి చూరుకిందకు చేరాలని
జల్లె జడివానైతే కేరింతలుకొడుతూ తనివితీరా తడవాలని
ఆరాటం
అతివ అందెల సవ్వడి విని ఎరుగనట్లే నింపాదిగుండాలని
దేవదారు మ్రానుల్లా నిటారుగా నిలువగ తను పలకరించాలని
అసహనం

కష్టాలన్ని కాలంచేసిన ఘోరాలని నేరాలని నిందించాలని
శిథిలమైన కలలు శిలలలా ఎప్పటికీ నిలవాలని
నిరీక్షణ
ఆశల ఊసుల ఉనికిని మనసు అరుల అరల్లో వెదకాలని
శ్వాసల భాషకు సరైన అర్థం సవివరంగా గ్రహించాలని
అన్వేక్షణ

No comments: