Tuesday, December 12, 2006

పనికత్తెలు-ప్రభుత్వాలు

సద్దికూడు మూటగట్టుకొని మసక చీకట్లో
రోజు కూలీ అడ్డకు బోయె అరుణక్క...
ఇంటింటికి పోయి అంట్లుతోమ బట్టలుతక
ఆరాటంగ బయల్దేరె బక్కచిక్కిన బాయమ్మత్త...
దొరగారి ఎడ్లు మేప దొరసానిలా చేత
ముల్లుగర్ర బట్టుకొని బయటకుపోయె చిన్నమ్మ...
నా సిన్నప్పట్నుండి సూత్తన్న ఈ తతంగం,
జుట్టు నెరస్తన్నా అలసటెరగ్గ పనికి పోతన్రు
ఈ పనికత్తెలు, ఇంటిని నడపగ ఈ తల్లులు!

మోసపోవడం మా మొదటి హక్కని వీరి
నుదిటి మీద రాసుందేమో! ప్రతి ఎదవ
ఎన్నికలప్పుడు అది సేత్తం ఇది సేత్తమని
కల్లబొల్లి కబుర్లు సెప్తరు,చౌరస్తాలో మైకుల్లో
మాయదారి మాటలు సెప్పి మభ్యపెడ్తరు...
చాటుగొచ్చి పచ్చ నోటు చేతిలొబెట్టి
తమకే ఓటెయ్యమని నచ్చజెప్తరు!
ప్రతి ఎన్నికలకి ఇనే రామాయనమేయని
మిన్నకుంటరు పైకం చేతిలో పడ్డాక పనికత్తెలు,
ఇదే ఇంగితమంటరు ఇల్లు గడపగ ఈ తల్లులు!

రెక్కలు ముక్కలయ్యేదాకా పనిచేసి గూడు చేరాక
సందెకాడ చెట్టుకింద గట్టున కూకొని ఉన్నట్టుండి
కిసుక్కున నవుతరు- ప్రభుత్వాలు మారినా
ప్రజల గతి మారెనా?- అని మనసులో అనుకొంటరెమో!

పెందలకడ లేసి ఆలోసిత్తన్న నాకు అరుపినబడ్డది,
"ఒరయ్యో! సక్కదనం సాలుగాని కాంట్రాక్టరు
కనకయ్య బండొచ్చి మొత్తలో నిలబడ్డది,
బండలు కొట్టగ పోవాల నడువ్" అని!


("అంతులేని కథ" కి ప్రసాద్‌గారి వ్యాఖ్యిచ్చిన స్పూర్తితో, ఈనాడు వార్త ప్రేరణతో)

2 comments:

రాధిక said...

emta aaveasam miiku.....maro sri sri ayipotaaru miiru.

spandana said...

సుధీర్ గారూ,
సగటు ఓటరు జీవితం ఎన్ని ఓట్లతోనూ ఎలెక్షన్లతోనూ మారదని, పెందలకడనే లేసి ఏదో ఓ దొర దగ్గరికి పనికెళ్ళకపోతే తమ కడుపాకలి తీరదని చక్కగా చెప్పారు.
--ప్రసాద్
http://blog.charasala.com