"యుద్దం ముగిసిందట.చిన్నోడు ఇంకో నాలుగైదు రోజుల్లో ఇంటికి రావొచ్చు.నీ ఏడుపాపి టివి కవరు కిందున్న ఆ పేపరు ముక్కిలా ఇవ్వు, కోమటి కొట్టుకెళ్ళి ఆ నంబరుకి ఫోన్ చేసొత్తాను.ఈ రోజు చిన్నోడితో తప్పకుండా మాట్లాడ్తా.నిన్న సందె కాడ పద్దు పరుగు పరుగునొచ్చి ఊరటిచ్చే కబురు చెప్పింది, ముగ్గురు చనిపోయారట పాపం, తెలుగోడెవ్వడు లేడులే, ఇంకొ నలుగురికి గాయాలయ్యాయట..." అని రాజయ్య చెప్పడం ముగించేలోపే పద్దు గుమ్మంలో నుంచొని, "నేనూ మీతో వస్తా మావయ్యా! బావతో నేనొక ముక్క మాటాడతా", అని దీనంగా అడిగింది.వొద్దు అని వారిద్దామనుకొంటూనే సరే అన్నాడు రాజయ్య, కొడుకు తిరిగొస్తున్న సంతోషం ఇక ఉండబట్టలేకేమో.
రాజయ్యకి పెళ్ళైనప్పుడు సరిగ్గా పదిహేడేళ్ళు, జయమ్మకి పదిహేనెళ్ళని గురుతు. వాళ్ళమ్మమ్మ అన్న మాటలు ఇంకా మరిచిపోలేదు రాజయ్య, "పిల్లకి పదిహేనేళ్ళొచ్చినై! పెళ్ళి సేయాలన్న గ్యానంలేదేట్రా తాగుబోతు సచ్చినోడా. నా కూతురిని దిగమింగినవ్, ఇప్పుడు దీని బతుకూ ఆగం చేత్తవేంటి. జయమ్మీడు పిల్లలు సంకన చంటోళ్ళతో తిరుగుతన్రు", అని ముసల్ది ఆగకుండ అంటుంటే, తాగుబోతోడు కసిరిండు, పిల్లను చూడ్డానికి పెళ్ళొల్లొత్తన్రు ఈ రోజని. పెళ్ళొలం వొచ్చేసినం కూడా అంటూ గుమ్మంలో కాళ్ళు కడుక్కొంటూ అన్నాడు రాజయ్య తండ్రి.తాగుబోతోడికి తెలియకుండానే పెళ్ళి జరిగిపోయింది.తాగుబోతైనా బరువు బాధ్యత మరువలేదన్న గర్వంతో,ముసల్దాని అంతులేని తిట్లకి ముకుతాడేసాడన్న ఎకసెక్కపు పొగరుతో, కూతురు పెళ్ళి చేస్తున్న సంబరంలో తప్ప తాగి పందిట్లోనే సోయిలేక కూలబడ్డాడు తాగుబోతోడు. అయినా వాడ్ని ఎవరేమనలేదు. జయమ్మ అణకువ చూసి మొగపెళ్ళోళ్ళూ గమ్మునుండి పెళ్ళి ముగించి పిల్లను తీసుకుపోయారు. యేడాది తిరిగేలోపు చిన్నోడు పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరు పుట్టినా, ఒకతి పొత్తిళ్ళలోనే పయనం ముగించింది. ఇంకొకడు పద్నాలుగేళ్ళప్పుడు ఈతకనిపోయి అనంతలోకాలు చేరుకొన్నాడు.రాజయ్య దంపతులకి చిన్నోడే సర్వస్వం అయ్యాడు. మొదటోడు చివరోడు, ముసళ్ళోల్లైతే ముందు ముందు మెతుకులు పెట్టేటోడూ, మొత్తం ముగిసాక మన్నులో కలిపేటోడు అన్నీ చిన్నోడే అయినాడు..
"తల్లికి తన పిల్లలందరూ సమానమే" అన్నారుకాని తండ్రికనలేదుగా అన్నట్లు ఇంకొకడున్నప్పుడు కూడా ఎందుకో రాజయ్యకి చిన్నోడి మీదే గురుండేది.అందరితో కలిసి అల్లరి చేసినా, ఆటపాటల్లో చురుగ్గా వున్నా, అప్పుడప్పుడు ఇంటి మీదకి గొడవలు తెచ్చినా చిన్నోడి మీద రాజయ్యకి ఏదో ఒక అర్థంకాని మర్మ నమ్మకం, వాడి తీరే వేరు అనుకొనేవాడు.
"మావయ్యా! యేంటి ఆలోచిస్తున్నారు? చిన్నోడి గురించా?" అని పద్దు అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి తేరుకొన్నాడు రాజయ్య."అవును తల్లీ,వాడు పట్టిందే పట్టు...వొద్దని ఎంత మొత్తుకొన్నా మిలటరీకే పోతా అన్నాడు. పట్టుదలతో సాధించిండు. ఇలాంటి గొడవలైనప్పుడు భయమేస్తది కాని చిన్నోడి నిర్నయేనికి నలుగురిలో కాకపొయినా మీ అత్త ముందు మీసం మెలేత్తాను".అవును మీ అయ్య సర్కారు నౌక్రి ఉన్నోడితో పెళ్ళి చేస్తా అన్నా కూడా నువ్వు చేసుకొంటే మా సిపాయి చిన్నోడ్నే చేసుకొంటా అని ఎందుకు తెగేసి చెప్పినవ్?" "మావయ్యా! బావ అలాంటిలాంటి సిపాయి కాదు, వాళ్ళ బెటాలియన్ కి కమాండర్! అంటే ఒక గుంపుకి నాయకుడన్నమాట.ఊరోళ్ళనుకొన్నట్లు బావ చదువు వూరికే వ్యర్థం కాలేదు, ఆ చదువుని బట్టి బావ తెగువని బట్టి కమాండర్ అయ్యాడు.యుద్ధానికి ముందు ఎన్ని వ్యూహాలు పన్నినా, ఒకసారి కదన రంగంలోకి కాలు దువ్వాక బావ ఇచ్చే అదేశాలతోనే వాళ్ళ గుంపు పోరాడుతుంది. ఇంక....." అని పద్దు ఎదో చెప్పబోతుంటే, "మాకే తెలియదు, ఇవ్వన్నీ నీకెట్ల తెలుసమ్మా?" అని నవ్వి నవ్వనట్లనిపించే చిన్న గర్వపు నవ్వుతో అడిగాడు రాజయ్య."పొయినసారొచ్చినప్పుడు బావ చెప్పాడు. ఇంకా ఇంటర్మీడియెట్ తో ఆగిన నా చదువు మళ్ళీ మొదలెట్టి డిగ్రీ చేయాలన్నాడు. అప్పుడే పెళ్ళి చేసుకొందాం అన్నాడు" అంది పద్దు. "ఒహో! అందుకేనా మీ అయ్యతో పట్నం పోతా అని ఒకటే గొడవ. చిన్నోడు నా సంటిదానికి ఎదో మందు పెట్టిండు. అది పట్నంపోయి సదువుతా అని మొండిగూకుంది అని తాడిచెట్టు కింద పొద్దుగుంకే దాకా మీ అయ్య సాంబడు వొచ్చిపోయే ప్రతి పనిలేన్నాకొడుకుతో పలికిండట మొన్న" అని చెబుతున్న రాజయ్యకి "ఊ"కొడుతూనే ఆలోచనల్లో మునిగిపొయింది పద్దు.
"సదివెలగబెట్టింది సాలుగాని మంచి పిలగాడ్ని చూసిన! గవర్నమెంట్లో వుజ్జోగం, నిన్ను సూడ్డానికి ఎడ్లొచ్చేఏళొత్తన్రు.చిన్నోడి సంగతి మరిసి గమ్మునొప్పేసుకో!అయినా నీకిదేంపిచ్చే! వాడెప్పుడు సత్తడో తెలవదు. వాడ్వి మనువాడ్తనంటవ్" అన్న సాంబడి మాటలకి సివంగిలా ఎగసిపడి,"చావనైనా చస్తగాని బావనే చేసుకొంట. అయినా అయ్యా! నువ్వు చెప్పిన పిలగాడికి 30 ఏళ్ళు, నాకింకా 18 ఏళ్ళే కదా. అన్యాయమనిపించడంలె నీకు?" అన్న పద్దుకి, "నాకు తెలవని నాయన్నాయాలు ఉన్నాయె? నీతులు సెబుతన్నవ్? మంచోడ్ని ఎతికి తెస్తే ఎదురు సెప్తవ్..." అని ఖయ్యిమటూ బదులిచ్చిండు సాంబడు. ఎన్నరిచినా పద్దు పట్టువీడలేదు.చూపులకి పిలగాడొచ్చేవరకు మౌనంగా ఉంది.ఇంటికొచ్చిన పెళ్ళోళ్ళు ఇంకా సర్దుకొని కూర్చోక ముందే మంచినీళ్ళందిస్తూ పెళ్ళికొడుకు కళ్ళలోకి సూటిగ చూసి చెప్పేసింది నువ్వు నాకు ససేమిరా ఇష్టంలేదని, ఎడ్లమెడల్లో కట్టిన గంటల చప్పుడు సద్దుమణగక ముందే వొచ్చినోళ్ళొచ్చినట్లే తిరుగుదారి పట్టిన్రు సణుగుకొంటూ.సాంబడు చేసేదిలేక బట్టతలమీద చేతులు పెట్టుకొని గోడకానుకొని అట్లే కూలబడ్డడు.పద్దు బిర బిర మంటూ గుమ్మంలోకి చేరి పొక్కిళ్ళ వాకిలిని సుతారంగా ఊడుస్తూ చిన్నోడి గురించి ఆలోచిస్తుంది కాబోలు, ఇంత జరిగినా మొఖంలో నవ్వు!
చెరువు గట్టు మీద సడీచప్పుడులేకుండా అరటి తోటల్లో జరిగొడ్డులా సర్రున పాకుతూ, నడినెత్తి మీద మండుతున్న సూర్యుడ్ని లెక్క చేయకుండా, ఆకులెండిన కుంకుండు చెట్టు చాటుకి చేరే చిన్నొడ్ని పొలంచివరనున్న పాకలోనుండి తదేకంగా చూసేది పద్దు. వాడు గుట్టనానుకొని ఉన్న చెరువు గుంటల్లో నీళ్ళు తాగడానికొచ్చే దుప్పులని చూడ్డానికి ఎన్ని గంటలైనా ఉండేవాడు కాని, పద్దుకి చిరాకు పుట్టి రొండు మూడు సార్లు ఇంటికిపోయొచ్చేది.అయినా పద్దు చిన్నొడికోసం తిరిగొచ్చి ఎదురుచూసేది, దుప్పులని చూసిన చిన్నోడు పరుగు పరుగునొచ్చి పద్దుకి చెప్పెది వినడానికి కాదు గాని వాటిని చూసిన ఆనందంలో వెలుగుతున్న చిన్నోడి కళ్ళని,అన్ని గంటలు ఎండలో నక్కినా తాజాగావున్న వాడి మొఖాన్ని చూడ్డానికి!
నాట్లప్పుడు వరిచేల గట్లెమ్మటి ఇద్దరు తిరిగుతూ చిన్నోడు తాటాకుల ఉచ్చులతో చాకచక్యంగా గట్ల రంద్రాల్లోనుంచి పట్టే ఎండ్రకాయలూ,పొలం పాడుచేసే పిట్టల్ని గురితప్పకుండా కొట్టే చిన్నోడి ఏకాగ్రత, పొలాన్ని రక్షించడానికి పిట్టల్ని చంపే వాడి నిర్దయా...ఇవ్వన్నీ అందరుచేసినా పద్దుకి చిన్నోడు చేస్తుంటే వింతగా వుండేవి, బహుశా వాడికి పట్టుదల, తప్పని గురి, ఏకాగ్రత, సహనంవంటి గుణాలు ఇతరులని మించి వున్నందుకేమో! చిన్నోడితో తిరిగి తిరిగి తనకు తెలియకుండానే వాడిదయిపొయింది పద్దు. చిన్నోడి మాటలకి, వాడు ఎలాగైనా మిలటరీకి పోతానంటే ఎప్పుడూ అడ్డుచెప్పలేదు పద్దు, భయంలేక కాదు, వాడిమీదున్న కొండంత విశ్వామిచ్చిన ధైర్యంతో!
"ముందు నువ్వు మాట్లాడ్తవా నేను మాట్లాడ్నా?" అన్న రాజయ్య మాటలకు ఉలిక్కిపడి గతంలోనుంచి గవిని కొచ్చామని గ్రహించింది పద్దు.జవాబు చెప్పేలొపే రాజయ్య నంబరుకలిపి "హలో, మాచిన్నోడు, అదేనయ్య శ్రీనివాసున్నాడా?" అని వాకబు చేయడం మొదలెట్టాడు.అటునుంచి రాజేష్ అనే వ్యక్తి,"ఓ! మీరు తెలుగువారా! నా పేరు రాజేష్. నేను శీనన్న, అదే మీ చిన్నోడి బెటాలియనే!బోర్డర్లో యుద్ధం భీకరంగా జరిగింది.చిన్నోడి తెలివితేటలవల్ల గెలిచాం.నేను, ఇంకో పంజాబోడు గాయపడితే గుండ్ల వర్షం కురుస్తున్నా చిన్నోడు మెరుపులా ముందుకొచ్చి, ఒకరిని బుజానెసుకొని, ఇంకొకడ్ని ఈడ్చుకొని గబాల్న బంకర్లోకి దూకి మమ్మల్ని కాపాడారు. అందరం క్షేమం...చిన్నోడు కూడా!", "సరే సరే, చిన్నోడికియ్యరా ఫోను" అని ఉండబట్టలేక వెలుగుతున్న అసహనపు మొఖంతో అరుస్తున్న రాజయ్యని చూసి చిన్నోడు క్షేమమే అని గ్రహించి గట్టిగా ఏడుస్తూ నవ్వాలనిపించింది పద్దుకి!"ఒక నిముషం లైన్ లో ఉండండి, అదిగో శ్రీనివాస్(చిన్నోడు) సారొస్తున్నారు" అని బదులిచ్చాడు రాజేష్.రాజయ్య ఫోన్ అలాగే చేతిలో పట్టుకొని కోమటి కొట్టు పైకప్పు లేచేలా, గవిని కూడలిలో జనం చెవులు దద్ధరిల్లేలా,"ఏరా! ఎవడైనా మీ కొడుకుల్ని ఎక్కడో కాశ్మీరుకి యుద్ధానికి పంపార్రా? యెప్పుడు నా ఇల్లు, నా పిల్లలు, నా పొలం, నా పెళ్ళం....ఇదే గోలగాని దెసానికి ఏమన్న సేవ చేద్దాం అన్న ఎధవొక్కడులేడు. నా చిన్నోడ్ని చూడండి! శత్రువుల గుండెలు చీల్చి, తోటోల్లని బుజానేసుకొని పాణాలని లెక్కజేయక రక్షించిండు.." అని విజయ గర్వంతో ఆరుస్తున్న రాజయ్యకి సంతోషంతో కంట తడి పుట్టించాయి అవతల మాటలు,"నాయనా! బాగున్నావా? అమ్మ దిగులు తీరిందని చెప్పు.నేను నా స్నేహితుడొకడు ఇంకో రెండ్రోజుల్లో ఇంటికొస్తం. పాపం యుద్ధంలో వాడి కాలుకి తూటా తగిలి విషమెక్కింది, అందువల్ల కాలు తీసేసారు. వాడికెవరు లేరు, నాతోపాటు రమ్మన్నాను, నేను వాడిని మనతోపాటే జీవితాంతం ఉండమని చెప్పాను, సరిగే చేసాను కదా నాయనా నేను?"అన్న చిన్నోడితో,"జీవితాంతం చక్రాల కుర్సిలో వుండేటోడ్ని ఎలా చూసుకొంటామ్రా? మేము ముసలోళ్ళం అవుతున్నాం, మీ అమ్మ నాకే సాకిరి చేయలేక చస్తంది ఇంక ఆ అవిటోడి బరువెట్ట మోసేది? పద్దు కూడా నీ కోసం కల్లలో వెయ్యొత్తులేసుకొని ఎదురుచూస్తంది. మీ పెళ్ళైతే వాడు మీకూ భారమే. అయినా పభుత్వం చూసుకొంటది కదా అలాంటోల్లని. వాడికి దైర్యంజెప్పి, చేయాల్సిన లెక్కలన్నీ చేసి నువ్వు రా" అంటూ రాజయ్య పద్దుకి ఫోన్ ఇచ్చాడు. అంతా విన్న పద్దు,"బావా! ఇన్నాళ్ళు నీకోసం అందరినీ ఎదిరించి పిచ్చిదానిలా ఎదురుచూసాను, ఇప్పుడు నీతో పాటు ఇంకొక అవిటి వ్యక్తి జీవితాంతం మనతో ఉంటాడంటే ఎందుకో మనసుకి కష్టంగా వుంది. అతను మనతో ఉండకపొయినా ఎవరులేరనే లోటులేకుండా క్రమంతప్పకుండా కలుస్తూవుందాం, అత్తయ్యనడిగినా ఇదే మాటంటుంది. అయినా నేను మాటవరుసకనట్లేదు. నిజంగానే మనం నీ స్నేహితుడ్ని మనింటివాడిగే చూసుకొందాం, కాని మనతో ఎప్పటికీ ఉంచుకోవడం కష్టం కదా బావా! నువ్వే ఆలోచించు!" అంది. "సరే! మీ ఇష్టం" అంటూ అవతల ఫోన్ పెట్టేసాడు చిన్నోడు.
రొండ్రోజుల్లో ఇంటికి రాబోతున్న చిన్నోడ్ని తలచుకొని నిస్తేజంగావున్న జయమ్మకి ప్రాణాలు లేచొచ్చాయి, ఇల్లలికి, తోరణాలు కట్టి, పందిరి గడ్డి మార్చి సంబరంగావున్న రాజయ్య కుటుంబాన్ని చూస్తే పండగ వాతావరణంలావుంది ఊరి జనానికి.చిన్నోడి తెగువ గురించి కోడి కూయక ముందే లేచి పనులకిపోయేవాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెబుతున్న రాజయ్యకి త్వరగా మిలటరీ హాస్పటల్ కి బయలుదేరమని కబురొచ్చింది. ఉన్నపలాన రాజయ్య, జయమ్మ, పద్దు ముగ్గురు బయలుదేరారు. హాస్పటల్ చేరిన వారిని నేరుగా శవాలగదికి తోడుకొనిపోయాడు ఒకాయన. ఆ మూడో నంబరు మంచం మీదున్నది మీ కొడుకేనా చూడండి అని అతడనగానే రాజయ్య మొఖంలో నెత్తుటిచుక్కలేక పాలిపోయింది. కప్పున్న తెల్లటి దుప్పటి లేపి చూసిన రాజయ్య గుండె పగిలింది, నిర్జీవంగా నవ్వుతూ ఒంటికాలుతో నిద్రిస్తున్న చిన్నోడు...జయమ్మ కూలబడిపోయింది, పద్దు దిక్కులు పిక్కుటిల్లేలా ఏడుస్తుంటే చెప్పాడు మిలటరీ ఆఫీసర్," మీవాడు యుద్ధభూమిలో శత్రువులని చీల్చి చండాడాడు, తోటివారిని ప్రాణాలకి తెగించి రక్షిస్తుండగా తొడకి తూటా తగిలింది, కాలు తీసేయ్యాల్సొచ్చింది. దురదుష్టవశాత్తు నిన్న రాత్రి హాస్పటల్ మూడో అంతస్తునుండి అదుపుతప్పి కిందపడి మరణించాడు"..అదుపుతప్పింది సిపాయి చిన్నోడు కాదు, మనుషుల రూపంలో వున్న మృగాల్లాంటి తమ స్వార్థపూరిత మనసులని అనుకొన్నాడు రాజయ్య! పద్దు ఏడుపాగిపొయింది, జయమ్మ స్పృహలోకొచ్చింది!
("A Soldier Comes Home" అనే ఇంగ్లీష్ కథ ఆధారంగా)
2 comments:
eemadyane cadivinatu gurtu.ippudu malla cadivinaa gumde baruvekkimdi.
మీరు ఇంగ్లీషు కథ చదివారా లేక ఇంకేదైనా తెలుగు అనువాదమో, ఆధారిత కథో చదివారా?
నేను చదివిన ఇంగ్లీషు లింకు http://members.tripod.com/~robertwells/soldier.html
Post a Comment