Tuesday, March 06, 2007

"జై కిసాన్" అంటే ఆల్బెట్రాస్‌ని చంపకూడదు అన్నంత సత్యం!


"ఆల్‌బెట్రాస్"నేమి చేయరు,దాన్ని చంపితే అపశకునం అని కళాసులనుకొంటుంటే నిజమే అనుకొన్నా!నేనే కళాసినై సంద్రంపై పోగా తెలిసింది వాటి వేట ఒక సరదా ఆటని...అయినా ఎందుకో ఆ నమ్మకాలు!చంపినోల్లే చెబుతరు వాటికి హాని జేస్తే కీడని...విన్నప్పుడల్లా నవ్వొస్తది ఏడుపు కళ్ళకి తోడుగా!ఇంకేదో గుర్తుకొస్తది...

చిన్నప్పుడు పల్లెకు పోయి ఎండలో గట్లెమ్మటి పల్లె సోదరుల్తో తిరుగుతూ కంచెపై ఎండిన బీరకాయల్ని తెంపి గొడ్లని గెదమడానికి వాటిని విసిరికొడుతూ దుమ్ము లేసేలా కాళ్ళీడుస్తూ తాటిచేట్లను చేరంగనే పల్లెలుండే అత్త కొడుకరిసిండు మా పట్నం బాబుకి ముంజలు కొట్టండ్రా అని...నెత్తినెక్కిన సూరిడిని అందుకోడానికన్నట్టు తాడుకట్టి రైయ్యన పోటీ పడి పాకిన్రు చెట్లపైకి ఇద్దరు పోరండ్లు!కొడవలి దెబ్బకు కాడి కుండ పగిలినట్లు దడేల్న కిందపడ్డై గెళ్లు.అత్తకొడుకు కొడవలితో లాఘవంగ ఒలిసిచ్చిన ముంజలు ఆత్రంగా అందుకొని నొటికి కర్సుకొంటే యమ చేదనిపించినై....అత్తకొడుకు మార్చి మార్చి ఎన్ని ముంజలిచ్చినా అదే ఎగటు...అన్నీ చేదైనై!పక్కనున్న పొట్టి పోరడు గొల్లున నవ్వి కంచెపైన చేదెక్కిన బీరకాయల్ని పట్టుకొంటే చేతులెట్ల సక్కగుంటై అన్నడు.పొట్టోడి బుర్రని మొత్తుతు అందరు నవ్విన్రు...అత్తకొడుకు తన చేత్తో ముంజలు నోటికందించిండు.
పీకలదాకా ముంజలు మెక్కి రొప్పుతూ ఏటిని చేరి హాయిగ బండలపై కూచొంటే నసపిట్టసైతం నోరెల్లబెట్టేట్టు వాగే పొట్టోడు ఏటి పుట్టుక చెప్పిండు.ఊరవతల చిట్టడివిల కుహరంలో పుట్టింది ఈ తేట నీళ్ళ ఏరని...వాడి కత కంప్లీటు కాకముందే అందరం ఏట్లొకి దుమికినం!మన్ను పట్టిన ఒడలతో ఏటి సింగారానికి మట్టి రంగులద్దినం! ఎండలో చల్లగ ఎంత హాయిగుందో అనిపించింది...ఒకరిపై ఒకరం నీళ్ళిసురుతొంటే అత్తకొడుకు గమ్మునున్నడు...తడిసిన మొఖంలో తళుకు లేదు..మనిషిక్కడేగాని మనసెక్కడోలాగుంది.గుంతలు పడ్డ కళ్ళలో బాధేదో గూడుకట్టుకొంది,గుప్పెడు గుండెలో అగ్నిగుండమేదో రగులుతొంది...మండే సూరిడు దడుసుకొనేలా పిడికిలి నీటిపై గుద్దిండు...నసపెట్టే పొట్టోడు ఉలిక్కిపడి మాటలు నములుతొంటే అత్తకొడుకు చెప్పిండు-ఏటికవతలున్న మాబోటి పేదల భూములి ఎప్పటికీ మాయే అని ఒట్టేసి నొక్కిజెప్పిన గవర్నమెంటోళ్ళు రేపో మాపో నాలుగు రొక్కాలు చేతిలో పెట్టి ఆ భూమిలో ఎదో పెద్ద బిల్డింగు కడతరట...సిటీకి దెగ్గర మా ఊరు కాబట్టి చాలా లాభముంటదట...ఏం ఢోకా లేదు, మాకందరికి సక్కటి జీతాల్తో పనులు దొరుకుతయ్యట...భూమి గుంజుకొని బువ్వ దొరుకుతదంటరు..ఏమోమరి! ఎందుకో గుండెలో దడ..

భూములు పోయె,బతుకులూ తెల్లారే!నగరాభివృద్ధిలో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన బతుకులెన్నో!కాలంతో పరుగులిడటం అంటే కంఠాలని కోయడమని,మెగా సిటీ,మెట్రో సిటీ,మాళ్ళు,మహళ్ళు,బహుళజాతి సంస్థలు,అంతర్జాతీయ విమానాశ్రయాలు...ప్రజల అవసరాలు తీర్చే వీటన్నిటికి చోటియ్యోద్దా?అని తెగ అమాయకపు ప్రశ్నలడిగే ప్రజల ప్రభుత్వానికి ఈ ప్రశ్నలెందుకు తట్టవో ఎంటో...భలే విడ్డూరం!గుంజుకొన్న ఆస్తులకి విలువ కట్టిచ్చే నష్ట పరిహారాలు బతికినంతకాలం ఒంటిపొద్దు గంజికి సరిపోతాయా?పేదరికానికన్నా పేదల్ని నిర్మూలించడమే ఈజీ అనేదే పెద్దోళ్ళ ఎజెండానా?రైతే ఈ దేశానికి వెన్నెముక అని,"జై జవాన్!జై కిసాన్" అని నినదించిన దేశంలో కిసాను సైతానయ్యాడా?అంతులేని ప్రశ్నల అలజడిలో అల్లరి మానలేదు పొట్టోడు,చెట్టుకింద నోరెల్లబెట్టి ఊగుతున్నాడు,వాడు మాట్లాడకపోయినా ఉరేసుకొని చచ్చిన వాడి చుట్టూ చేరిన రాబందులు గోల పెడుతున్నాయి-అన్నీ పోయినోడు బతికుండి ఏం చేస్తాడని వాటి గోలేమో!

"గోల్డ్ కోస్ట్" బీచ్‌లో నడుస్తొన్న నాకు,"ఆల్బెట్రాస్"ని చంపితే కీడు అని చిన్న పిల్లలకి కథలు చెబుతొన్న కళాసిని చూసి నవ్వోచ్చింది!

2 comments:

Anonymous said...

Very good narration - yes I agree with you and laugh with you

Anonymous said...

padunaina bhaasha, bhaavaM laagE.
meeru kathalu raayaDaaniki eMduku prayatnuMcakooDadu?