అలల లాస్యం ఆలరించగ
కలల తీరం కానరాగ
కరువైన విరామం
కొంతైనా దొరుకునని
క్షుద్బాధను శాంతిపగ
సంద్రమును నమ్ముకొని
కడలి సుడులకు హడలిపోక
పడవ కడకు అడుగులేయగ
పథమెరుగని పాదములకు
తీరమే స్థిర నివాసమై
భారమైన బతుకులకు
సారము సముద్రుడై
సుఖముగ సాగిపోతున్న
తీరవాసుల సంసారముపై
పంచభూతములు పగబట్టెనో?
పుడమి పగలగ అగ్ని జిమ్మగ
జోరున హోరుగాలి చెలరేగగ
ఎగసిపడిన సంద్రుడు సునామై
ఎందరినో కడదేర్చెను!
తమ బతుకునావలకు
లంగరు నీవని నమ్మిన సంద్రం
నిండా ముంచగ కార్చిన కన్నీటితో
పగిలిన ఓడలవలె
చెదరిన బతుకులకు
మరమత్తు కావాలని
జనసంద్రాన్ని అర్థించగ
ఒరిగిన సాయం శూన్యం!
కలి లోగిలో కసాయి పెద్దలు
విచ్చలవిడిగా పాగావేయగ
కడవెడు కలికైనా నోచుకోని
చిన్నారుల ఆకలి కేకలో
ఇంటిని ఆదుకొనగ ఆక్రందనలో
దిక్కు తోచని అభాగ్యులెందర్నో
బలిసిన కసాయి మృగాలకు
మక్కువైన ప్రాణమునిలుపుటకు
తమ కిడ్నీలకు వెలకట్టి
పీక్కుతినే రాబందులకీయగ
సజీవ శవాలుగ మార్చాయి
యజ్ఞ హవిస్సుని జేసాయి!
Tuesday, March 13, 2007
కసాయి లోకం
(తమను మింగిన సాగరానికంటే కూడా ప్రమాదకమమైన మనుషుల మృగ వాంఛలకి,ప్రభుత్వ నిర్లక్ష్యానికి,అవినీతి అధికారుల ధన దాహానికి క్షణ క్షణం మరణిస్తున్న సునామీ బాధితుల దీనావస్థను గూర్చిన ఈ వార్త చదివి మండిన గుండెలో ఉప్పొంగుతున్న ఆవేదన ఇది)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment