చావైనా బ్రతుకైనా నీ జత వీడనని, శ్వాసల బాసలు మూగవోయేదాకా స్వార్థపు మలినం అంటించుకోనని, నా వారని నీవారని వ్యత్యాసమెరుగక సాదరముగనుండెదనని, మరణం మనలను ఎడబాపినా మరో మగువకు నాతో నాలో స్థానం లేదని, మరు జన్మకు సహితం నీ మొగుడుగనుంటానని…యవల చేల్లో ఆనాడు చేసిన బాసలు యద మందిరం దద్ధరిల్లేలా ప్రతిధ్వనిస్తున్నాయి- దిగ్గున లేచాడు శ్రీధర్! యముకలు కొరికే చలిలో సైతం చెమటలో తడిసి ముద్దైనాడు…”వేడి వేడి కాఫీ తీసుకోండి, మళ్ళీ ఏమైనా కలగన్నారా? ఈ రోజు మన ప్రోగ్రాం గుర్తుందికదా? వేన్నీళ్ళు పెట్టాను కాఫీ తాగి స్నానంచేసిరండి, టిఫిన్ చేద్దురుగాని.. .ఊ త్వరగా! నేనీలోపు వ్యాక్యూం చేసి బట్టలు వాషింగ్ మెషిన్ లో పడేసివొస్తాను సరేనా?” గల గలా మాట్లాడుతున్న మహాలక్ష్మిని చూస్తూ కలల ప్రభావంనుంచి ఇంకా పూర్తిగా కోలుకోని శ్రీధర్ సరే అన్నట్లు కాఫీ తాగుతూ మెల్లగా తలాడించాడు.ఈ మధ్య శ్రీధర్‌కి టెన్షనెక్కువైపోయింది.
ఏడెనిమిదేళ్ళక్రితం టీనేజి శ్రీధర్ వేరు ఇప్పటి శ్రీధర్ వేరు. డిగ్రీ చదివేరోజుల్లో శ్రీధర్ అంటే ఎందరికో క్రేజ్ ఉండేది. చదువులో, ఆటపాటల్లోనే కాదు గొడవల్లోను ముందుండేవాడు.
కెమిస్ట్రీ లెక్చరర్ సస్పెండ్ అవడానికి, తన సీనియర్ ఒకడు కాలేజ్ విడిచి వెళ్ళడానికి కారణం శ్రీధరే. ఇంకా ఎందరికో కొరకరాని కొయ్యలా ఉండేవాడు. డబ్బులు తీసుకొని ల్యాబ్ ఎగ్జాంస్ పాస్ చేస్తున్నాడని కెమిస్ట్రీ లెక్చరర్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాడు, తన సీనియర్ ఒకడు ర్యాగింగ్ చేస్తున్నాడని రిపోర్ట్ చేసి వాడ్ని సస్పెండ్ చేయించాడు…దానికి ఇగో దెబ్బతిని వాడు కాలేజే మానేసి శ్రీధర్ అంతుచూస్తానని ముక్కుపగలగొట్టించుకొని బ్రతుకుజీవుడా అనుకొంటూ పారిపోయాడు. కాలేజిలోనే కాదు ఊర్లోను అంతే. ఒకసారి దిగాలుగా కూర్చున్న అమ్మని అడిగాడు ‘ఏంటి సంగతి?’ అని. “నీకెందుకురా? గమ్మున చదువుకో, లేపోతే నీ పని చూసుకో. అన్నీ వివరాలు కావాలి.” అని కసురుకున్న అమ్మకి విసుగుపుట్టి విషయంచెప్పేవరకు అడుగుతూనేవున్నాడు. చివరికి చెప్పింది ఆఫీస్‌లో నాన్నని కొందరు విసిగిస్తున్నారని. ఎవరో కాంట్రాక్టర్ ఫైల్ మీద సంతకం పెట్టమని లంచమిచ్చి బెదిరిస్తూ వొత్తిడి తెస్తున్నారట. తోటి ఉద్యోగస్తులు కూడా సంతకం పెట్టొచ్చుకదా, నువ్వేం లంచమడగట్లేదు వాడే ఇష్టపూర్వకంగా ఇస్తానంటుంటే సత్యహరిశ్చంద్రుడిలా ఈ చాదస్తమేంటి రాజారావ్ అని ఆకాంట్రాక్టర్కే వత్తాసు పలుకుతున్నారట.ఏంచెయ్యాలో పాలుపోవట్లేదు, వేరే సెక్షన్‌కి మారడానికి నాన్న ప్రయత్నిస్తున్నారు అని చెప్పింది.శ్రీధర్ అంతావిని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ఆ మరుసటి రోజు ఆఫీస్‌నుండొస్తున్న రాజారావ్ గడపలో కాలు పెట్టకముందే మొఖం చాటంత చేసుకొని భార్య సరోజతో,”ఆ కాంట్రాక్టరు ఈ రోజు నా దగ్గరకొచ్చి క్షమాపణ కోరాడు.నువ్వు కూడ అప్పుడప్పుడు ఏంటండీ మరి చాదస్తం అని దెప్పిపొడిచేదానివి, నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా సమస్యలను అధిగమిస్తాము. అంతే కాదు ఆ కాంట్రాక్టరి కొడుకు హైదరాబాదులోనే చదువుతున్నాడట.ఏమైనా సమస్యుంటే మన శ్రీధర్ సహాయం తీసుకోవొచ్చా అని అడిగాడు.మంచితనంతో ఎవరినైనా మార్చవొచ్చు.మొన్నటివరకు బెదిరించిన కాంట్రాక్టర్ని చూడు నేడు తప్పు తెలుసుకోవడమే కాదు తన కొడుక్కోసం మన సహాయం కూడా కోరుతున్నాడు…” అని ఏకబిగిన లెక్చరిస్తున్న రాజారావ్ మాటల్లో కాంట్రాక్టర్ కొడుక్కి శ్రీధర్ సహయం కావాలన్న మాట సరోజనాకర్షించింది.
ఈలవేసుకొంటూ రాజారావ్ స్నానానికెళ్ళాక సరోజ కొడుకు శ్రీధర్తో,”ఆ కాంట్రాక్టర్ కొడుకునేంచేసావ్? వాడుకాని నాన్నతో నీ పేరు చెప్పుంటే ఈ రోజు మనింట్లో ఇంకో సత్యాగ్రహం జరిగుండేది” అని అంది.”అమ్మా! నేనిక్కడే వున్నాకదా! ఆ కాంట్రాక్టర్ కొడుకు వాడి సీనియర్లతో గొడవపడ్డాడట. అందులో ఒకడు డిప్యూటీ కమీషనర్ కొడుకు, ఇంకొకడు ఎంపి మనవడు.యాదృచ్చికంగా వాళ్ళిద్దరూ నా స్నేహితులు. ఇక కాలేజిలో కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళతో రాజీపడాల్సిందే. ఇది తెలిసి కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేసాడు, నేను వాళ్ళకి సర్దిచెప్పాను. మాటల్లో మాటగా నాన్నని విసిగించొద్దని చెప్పాను.ఇందులో తప్పేముంది?” అని సమాధానమిచ్చాడు శ్రీధర్. “ప్రతిదానికి భలే తెలివిగా, నీ తప్పేమీలేదన్నట్లు సమాధానం చెప్పి నోరు మూయిస్తావురా నువ్వు. ఈ తెలివితేటలు మంచి దారిలో పెట్టు” అని సరోజ చెప్పగానే, ” the cruel kindness of a doctor’s knife saved the poor man’ life!” అనే oxymoranic expression గుర్తుతెచ్చుకొని, “పొట్టలు చీల్చే కౄరమైన కత్తి కూడా ఒక డాక్టర్ చేతిలోపడితే ప్రాణాలు కాపాడుతుందమ్మా! నా నైజం అంతే! నువ్వేం దిగులుపడకు” అని సంజాయిషీ నుండి ఉపదేశపు లెవెల్లో వివరిస్తున్న శ్రీధర్ని, “ఇక చాల్లేరా సకల కళా పోషకా, నీతో వాదించడం కష్టం” అని వ్యంగ్యంగా అంటున్నా సరోజ మనసులో కొడుకుని చూసి మురిసిపోయింది.అయినా మళ్ళింకెప్పుడూ ఇలా బెదిరింపులు, రాజకీయాలు చెయ్యొద్దని కొడుకుని హెచ్చరించింది.
ఇలా శ్రీధర్ గురించి చెప్పుకొంటూపోతే ఎన్నో విషయాలున్నాయి- సకల కళా పోషకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి,చిరు, డాన్,తోపు,అన్న, బాసు ఇలా నానా రకాల టైటిల్సు అందుకొన్నాడు.
ఎన్ని కళలున్నా అమ్మాయిల విషయంలో మాత్రం శ్రీధర్ జీరో. తను 8వ తరగతిలో ఉన్నపుడు ఒకమ్మాయిని ఇష్టపడ్డాడు.యూనివర్సిటీలో స్నేహితులతో ఏ బర్త్‌డే పార్టీకో, కాలేజ్‌డేకో మందుకొట్టినప్పుడు వాళ్ళకు తన లవ్ స్టోరీ చెప్పేవాడు.ఆ అమ్మాయితో హైస్కూల్లో ఉన్నపుడు శ్రీధర్ మూడు సార్లు మాట్లాడాడట.చివరిసారిగా 10th క్లాస్‌లో తను స్లాం బుక్ ఇచ్చేటప్పుడు చేతులొణికి పెన్ను కింద పడేస్తే ఆ అమ్మాయి గలగల నవ్వుతూ “ఏంటి అమ్మాయిల్తో ఎప్పుడూ మాట్లాడలేదా? నేనేమీ భూతాన్ని కాదు.స్లాం బుక్ ఇప్పుడు వ్రాయలేకపోతే సాయంత్రం స్కూల్ అయిపోయాక వ్రాసివ్వండి” అంటూ అదే చెరగని నవ్వుతో వెళ్ళిపోయింది.ఆమెను చివరిసారిగా చూసింది 10th క్లాస్ ఫేర్‌వెల్ పార్టీలో!ఆ రోజు తను గులాబీ రంగు చీరెలో దేవ కన్యలా మెరిసిపోతూ అదే చెరగని నవ్వుతో చేసిన మాయ ఇంకా తనపై పనిచేస్తూనేవున్నాయి, తన జ్ఞాపకాలు గుండెలో గూడుకట్టుకొని అలానే నిలిచిపోయాయి, తన ప్రేమను చెప్పే ధైర్యంలేక, తెలిసీ తెలియని ఆ వయసులో తన మనసుదోచిన వన్నెలాడి ఊసులని వెలలేని వజ్రాలుగా మనసుపొరల్లో దాచుకొన్నాడు. ఒకరోజు కాలేజ్ canteenలో కూర్చొని స్నేహితులతో మాట్లాడుతున్న శ్రీధర్ ఎదురుగా నిలిచిన ఒక అమ్మాయిని చూసి అవాక్కయ్యాడు. అది గమనించిన స్నేహితుడొకడు, ‘అన్న మనసు దోచిన కన్నె పిట్టరో’ అని అనగానే, శ్రీధర్ నవ్వుతున్న ఆ పిల్లను చూసి ఎప్పుడో చూసిన అదే నవ్వు, నను మాయచేసిన మంత్ర ముగ్ధ మందహాసం….తన మనసు దోచిన మగువ తనో కాదో తెలుసుకోమని వాళ్ళతో చెప్పాడు.అందమైన అమ్మాయిల చిట్టా మెయిన్‌టైన్‌చేసే సీనుగాడు చిట్టా విప్పాడు- పేరు సునయన, 2nd year electronics, ఊరు ఒంగోలు,1st year ఎక్కడో చదివాక కాలేజ్ transferలో ఇక్కడ చేరింది. క్లాస్‌లో చాలా calm. ఇప్పటికే ఒక నలుగురైదుగురు ఆషిక్‌లు వెంటపడుతున్నారు.అమ్మాయి చాలా స్ట్రిక్ట్. ఒకడి చెంప పగలడం చూసి ఇంకొకడు already డ్రాప్ అయ్యాడు. కానీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సురేష్ అనేవాడు మాత్రం ఎలాగైనా నిన్నే పెళ్ళి చేసుకొంటా అని బెదిరిస్తూ వెంటపడుతున్నాడు. Unfortunately ఊరవతల స్మశానంలా ఉండే electronics డిపార్ట్మెంట్ అవడంవల్ల ఆర్నెల్లైనా అన్న మనసు దోచిన ఈ అందం బయటపడలేదు.అన్న గ్రీన్ సిగ్నలిస్తే సురేష్ కాదు వాడి బాబు కూడ ఒప్పుకొంటాడు. సీనుగాడు excitementపై తను స్కూల్లో చూసిన అమ్మాయికాదు ఈ సునయన అని నీళ్ళు చల్లాడు శ్రీధర్. అయినా వాడు,”బాసు ఎప్పుడో చిన్నపుడు చూసిన అమ్మాయి మళ్ళీ దక్కటం దేవుడెరుగు కనపడటమే గగనం. అట్లాంటిది ఆ పైవాడే నీ బాధనర్థం చేసుకొని అచ్చు వొదినమ్మలాంటి ఇంకొ అమ్మాయిని నీ కోసం పంపాడు. ఈసారి మిస్ అవ్వకు బాసు!”
అని గీతోపదేశం చేసాడు.శ్రీధర్ ఏమీ మాట్లాడలేదు- మౌనం అర్థాంగీకారమన్నట్లుగా!సునయన శ్రీధర్ల మధ్య స్నేహమేర్పడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎప్పుడూ ముభావంగా ఉండే శ్రీధర్ తను ఇష్టపడే ఆ నవ్వుకోసం కష్టపడి జోకులు, చలోక్తులతో సునయనను నవ్వించేవాడు.శ్రీధర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటే సురేష్ లాంటి వాళ్ళ పీడ కూడా సునయనను వొదిలిపోయింది.రోజులు గడిచే కొద్దీ శ్రీధర్ తను సునయనను కాదు గాని ఆమె నవ్వును ప్రేమిస్తున్నాడని అర్థంచేసుకొన్నాడు. సునయన కూడ శ్రీధర్తో ఎప్పుడూ హద్దుమీరి ప్రవర్తించలేదు.కాలేజ్ చివరిరోజు అందరూ ఆసక్తిగా ఎదురుచూసారు- శ్రీధర్ సునయనలు పెళ్ళి ప్రకటన చేస్తారేమొనని! కాని అటువంటిదేమీ జరుగలేదు.సునయన శ్రీధర్తో, “సారీ! నేనసలు మిమ్మల్ని ప్రేమించడానికి మీతో స్నేహం చేయలేదు. మీగురించి విని నా వెంట పడుతున్న ఆకతాయిల అల్లరి భరించలేక వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీలాంటి బాయ్‌ఫ్రెండ్ ఉంటే మంచిదనుకొని మిమ్మల్ని ప్రేమించినట్లు నటిద్దామనుకొన్నాను, అయినా మీరు మంచి స్నేహితులయ్యారు.మీరు నన్ను ప్రేమించట్లేదని గ్రహించి హమ్మయ్యా అనుకొన్నాను.మీ ఫ్రెండ్ మీ లవ్ స్టోరీ చెప్పాడు. నేనచ్చు ఆ అమ్మాయిలానే వుంటానని….” అని మాట్లాడుతుంటే శ్రీధర్ అన్నాడు,” నువ్వు కాదు తల్లీ! నీ నవ్వు! నేను నీ నవ్వుని ప్రేమించాను నిన్ను కాదు! ఇంకొకరిని ప్రేమించడం నా వల్ల కాదేమో!” “అయినా ఎప్పుడో చిన్నప్పుడు చూసిన అమ్మాయి కోసం మీరిలా నిరీక్షించడం అవివేకం మంచమ్మాయిని చూసి పెళ్ళి చేసుకొండి” అని ఒక ఉచిత సలహా ఇచ్చిన సునయినను, “అయితే నిన్నే చేసుకొంటా రా” అని అసహనంగా అన్న శ్రీధర్ మాటలకి సునయన నోరుమూసుకొని వెళ్ళిపోయింది.
కాలేజ్ అయిపోవడం శ్రీధర్ సునయనల స్టోరీకి తెరపడటం ఒకేసారి జరిగిపోయాయి!
MS చేయడానికి డల్లాస్ వొచ్చిన శ్రీధర్‌కి మొదటి రోజే అనుకోని షాక్! “హేయ్! శ్రీధర్! absolutely unbelievable! ఇది కలా నిజమా…” అంటూ చేతులు చాచి full excitement తో శ్రీధర్ని కౌగలించుకొంది ఆ స్కూల్ పిల్ల! శ్రీధరింకా షాక్‌నుండి కోలుకోలేదు…”మ..మ…మహాలక్ష్మీ! నువ్విక్కడ?” అని మాటలురాక తడబడుతున్న శ్రీధర్ని చూసి అదే గమ్మత్తైన నవ్వుతో,”ఏంటి? నువ్వే MS చెయ్యాలా? మేము చేయకూడదా? నీ చేతులింకా వొణుకుతున్నాయా అమ్మాయిల్తో మాట్లాడేటప్పుడు? చేతులేమో కాని మాటలైతే తడబడుతున్నాయి! ఆ సీన్ ఇంకా మరిచిపోలేదు శ్రీధర్…పెద్ద angry young man లా ఫోజు, అమ్మాయిని చూడగానే తడబాటు….” అంటున్న మహాలక్ష్మిని చూస్తూ, “నేనూ నిన్ను మరిచిపోలేదు మహాలక్ష్మీ! तुम ने एक मुस्कुराहट से ज्यादु कर्के मुझे पागल बना के गायब होगयि (తూనేతో ఏక్ ముస్కురాహట్‌సె జ్యాదు కర్కె ముఝె పాగల్ బనాకె గాయబ్ హోగయి)…” అని మనసులో అనుకొన్నాడు.”నేనిక్కడికి వొచ్చేముందు మీ ఇంటికి వెళ్ళాను.నా 10th క్లాస్ సర్టిఫికేట్ పోతే తిరిగి అప్లై చేయడానికి మన స్కూల్ కి వెళ్ళాల్సొచ్చింది.ఎందుకో నువ్వు గుర్తొచ్చి నవ్వొచ్చింది.నువ్వేంచేస్తున్నావో, ఎలావున్నావో చూడాలని ఒక thrilling idea వొచ్చింది. స్కూల్ నుండి అడ్రస్ తీసుకొని మీ ఇంటికి వెళ్తే చెప్పారు నువ్వు America వెళ్ళే ప్రయత్నాల్లో వున్నావని. నీ ఫోన్ నంబర్ తీసుకొన్నాను. మా ఊరెళ్ళాక రింగ్ చేస్తే ఎప్పుడూ switched off అనే వొస్తుంది. మీ ఇంటి నంబర్ తీసుకోవడం మరిచిపోయా! నిన్ను contact చేయలేకపోయినందుకు చాలా disappoint అయ్యాను” అని గలగలా చెబుతున్న మహాలక్ష్మి మాటలు నోరెళ్ళబెట్టి చూస్తున్న శ్రీధర్‌కేమీ వినపడలేదు….అయినా అనేసాడు యాధృచ్చికంగా..నన్నెందుకు కాంటాక్ట్ చెయ్యాలనుకొన్నావ్ అని.”బహుశా నిన్ను ప్రేమిస్తున్నానేమో శ్రీధర్! అవును! మనం చివరిసారి కలిసిన ఆ సీన్- స్లాం బుక్ వ్రాయమంటే చేతులొణుకుతూ పెన్ను కింద పడేసినప్పుడు నీ మొహంలో tension, తొందర, ఆ అమాయకపు భావాలు తలచుకొన్నప్పుడెల్లా నవ్వొస్తుంది, నువ్విప్పుడెలావున్నావో చూడాలనిపించేది. కాంటాక్ట్ చెయ్యాలనుకొన్నా కుదరని పరిస్థితి. అంతే కాక చూపులతోనే చంపేసేలా వుండే నీ సీరియస్ ఫేస్ గుర్తొచ్చి ధైర్యం చాలేది కాదు. ఏదేమైనా మనం కలిశాము..” అని అంటున్న మహాలక్ష్మితో ఇక ఎన్నడూ విడిపోవద్దు అన్నాడు శ్రీధర్! “అబ్బో మాటలు బాగానే నేర్చావే, ఈ 2 years మనం ఒకరినొకరం అర్థం చేసుకోవొచ్చు శ్రీధర్! నువ్వంటే నాకిష్టం. అందులో ఎటువంటి అనుమానంలేదు. మన చదువయిపోయేవరకు మనమిలానే ప్రేమ పక్షుల్లా వుందాం. ఒకరినొకరు అర్థంచేసుకొని పెళ్ళిచేసుకొంటే ఏ సమస్యా ఉండదు, ఏమంటావ్?” అంటూ నవ్వింది మహాలక్ష్మి.
సరే అన్నట్లు తలూపాడు శ్రీధర్! రెండేళ్ళు ఇట్టే గడిచిపోయాయి.ఒక రోజు శ్రీధర్తో,”కాలేజ్‌లో ఎవరైనా అమ్మాయి నిన్నాకట్టుకోలేదా? I mean నువ్వెవరినైనా ప్రేమించడం గాని జరిగిందా?” అన్న మహాలక్ష్మి ప్రశ్నకు,” అబ్బే కాలేజ్‌లో కూడా నేను సీరియస్‌గానే వుండేవాడిని. అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో మందుకొట్టడం, సినిమాలు,షికారులు ఇదే లోకం” అంటూ సునయన గురించి చెప్పడం అంత అవసరంలేదు అనుకొన్నాడు శ్రీధర్.”నేనూ మా బావతో సినిమాలు షికార్లకి వెళ్ళేదాన్ని. మాఇంట్లో వాళ్ళు బావే నా మొగుడు అని ఎప్పుడో నిర్ణయించేసారు. మొదట్లో నాకతన్ని చూస్తే చిరాకేసేది.కాని పాపం చాలా మంచివాడు.బావంటే నాకిష్టమే కాని నేనెప్పుడూ అలాంటి దృష్టితో ఆయన్ని చూడలేదు. ఒక మంచి స్నేహితుడిలా ఫీలయ్యాను. అదే బావతో చెప్పాను.వెంటనే బావ కూడా నా కిష్టమైన వాడ్ని పెళ్ళి చేసుకోమని చెప్పాడు. He is a very good friend of mine indeed!” అంది మహాలక్ష్మి. ఇలా యవల చేల్లో కూర్చొని గతాలు అవగతం చేసుకొన్నారొకరికొకరు. శ్రీధర్-మహాలక్ష్మిల పెళ్ళి నిరాడంబరంగా జరిగింది.సంతోషంగా సాగుతున్న కాపురంలో సుడిగాలి తుఫానులా ఒకనాడు సునయన తలుపు తట్టింది.
ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన శ్రీధర్ డ్రాయింగ్‌రూంలో నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకొంటున్న సునయనా మహాలక్ష్మిలను చూసి అవాక్కయ్యాడు. “శ్రీధర్! ఇది సునయన! మా బాబాయ్ కూతురు. పరీక్షలుండటం వల్ల మన పెళ్ళికి రాలేదు. మన పెళ్ళైన ఏడాదికిగాని దీనికి తీరిక కుదరలేదు” అంటూ పరిచయం చేస్తుంటే సునయన ఏమీ తెలియనట్లే,”బావగారూ! బాగున్నారా?” అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది.ఆనాటి నుండి మొదలయ్యాయి శ్రీధర్‌కి పీడకలలు!-”ప్రియా! నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు? ఒంటరితనపు చీకటి మంటల్లో మగ్గి మగ్గి మరణానికై నిరీక్షిస్తున్నా. గతం గుర్తుచేసుకొని గుండెపగిలేలా రోదిస్తున్నాను! అవని అంచులు దాటి అంబరమే హద్దుగా కన్నీరు కాలువలై పారగ, తప్పుచేసిన ఆ ఒక్క క్షణం కాలగమనంలో కలిసిపోకుండా నా దరిచేరితే సవరించుకోవాలని అసాధ్యమని తెలిసి కూడా అనునిత్యం ఎదురుచూస్తున్నాను, ఎదురుచూస్తున్నాను, ఎదురుచూస్తున్నాను…”అని గొణుగుతున్న శ్రీధర్ మహాలక్ష్మి కుదుపుకి ఉలిక్కిపడి దిగ్గున నిదురలేచాడు! “ఏంటి శ్రీధర్? ఈ మధ్య చాలా టెన్షన్‌లో వున్నట్లున్నావు? ఆఫీస్‌లో ఏమైనా వత్తిడా? ఎందుకు నా దగ్గర దాస్తావు?” అని అడిగిన మహాలక్ష్మితో,” ప్లీజ్ మహీ! నీకో విషయం చెప్పలేదు. చెబితే నువ్వెక్కడ నన్ను పెళ్ళిచేసుకోవేమో అని. నాకు సునయన ముందే తెలుసు. కాలేజ్‌లో ఇద్దరం కలిసి తిరిగాము. అందరూ మేము ప్రేమించుకొంటున్నామని అనుకొనేవారు కాని అది నిజం కాదు. సునయన నీ కజిన్ అని తెలిసి, తనని మనింట్లో చూసినప్పటినుండి నాకు ఒకటే టెన్షన్, నువ్వెక్కడ నన్ను విడిచి వెళతావేమోనని! సునయనతో తిరిగినందుకు కాదు, నీకు అసలు విషయం చెప్పనందుకు నేను నలిగిపోతున్నాను. క్షమించు” అన్నాడు.అంతా విన్న మహాలక్ష్మి, సునయనలు ఒక్కసారిగా గొల్లున నవ్వారు.”బావా! కాలేజ్‌లో మకుటంలేని మహరాజంటే ఏమో అనుకొన్నాను. ఇంత సెన్సిటివా? అక్కకు అంతా తెలుసు ” అని అంటున్న సునయనను వారించి బయటకి పంపింది మహాలక్ష్మి…”ప్రేమ సర్వ దోషములను కప్పును. ప్రేమ ఇచ్చుటయేగాని ఆశించుట ఎరుగదు” అని బైబిల్లోనుంచి,ఇంకా నాకు తెలియని ఎన్నో పుస్తకాల్లోనుంచి, అన్నిటికీ మించి నీ మంచితనం,నా పట్ల నీకున్న అంతులేని ప్రేమనుంచి ఎంతో తెలిపావు శ్రీధర్! అలాంటిది ఈ చిన్న విషయం చెపితే నిన్నెలా వొదిలేస్తాననుకొన్నావ్? నీకు తెలివితేటలతోపాటు వెలక్కాయంత వెఱ్ఱి కూడా వుందనుకొంటా!” అంటూ శ్రీధర్‌ని అక్కున చేర్చుకొని కౌగలించుకొంది మహాలక్ష్మి…నవ్వుతున్నా ఆ కలువ కళ్ళలో పలుచని నీటిపొర…తన మొగుడు తననెంతో ప్రేమిస్తున్నాడని గర్వంతో అనుకొంటా!
తొలి ప్రచురణ "పొద్దు" లో http://poddu.net/?cat=12&paged=2
Monday, January 29, 2007
Sunday, January 21, 2007
పుష్ప విలాపం
వర్ణాలు వేరైనా చెలిమితో కలిసున్నాము
మన మూలమొకటేయనెరిగి మురిసాము
పలు రంగుల్లో పుష్పించి కనువిందు చేశాము
మనలను నాటిన మనిషిని మెప్పించాము!
కానీ... మాలాగే విభిన్నవర్ణాల వాడు
ఏనాడు అంతాఒకటేనని ఐకమత్యం పాటించడు!
మనుష్యజాతి ఒకటే అయినా వివక్షలు శతకోటి
భూసురుడొకడట బురదవంటి వాడొకడట!
తెల్లవాడు దొరట నల్లోడు బానిసట!
నా భాష మిన్నంటే మా సంస్కృతికి లేదు సాటని
తన మతం శ్రేష్టమని మరొకరి అభిమతం నికృష్టమని
నిందలెన్నో చేసుకొంటూ కయ్యానికి చిందులేస్తూ
విజ్ఞానము సాధించామంటూ వినాశనమునకు చేరువైరి!
my cell phone snap
విరహాగ్ని
ఝర్ఝరీనాధములా ఝరియొకటి సాగి
గుప్పెడు గుండెలో కలవరం రేపగా
జల జల సవ్వడుల సారధి ఎవరని
నలుదిక్కులు నయనాలు విప్పారి వెధకగ
నగవుల సరముతో మగువను గాంచితిని!
అరుణ విరుల అందం సహితం చిన్నబోయే
ఆమె ముగ్ద ముఖారవింద ప్రకాశమందు
ఇరు పుష్పముల సౌరభములు సహితం
ఆ ఇంతి వాసనల సాటి రాలేకపోయెను
తన అమృతాదరములన్‌జూచి విరాళి...
సురాసురుల సాగరమధనమున జనించి
జగడమూలమైన ఆ సురను మైమరపించే
భాసుర నారీమోహము నాలో జ్వలించగ
ఆ కాంతాకాంతుల దరిచేరి నా హృద్ఘోషను
విన్నవించాలని విరహాగ్నిని ఆర్పగ వెళ్ళితిని!
Image courtesy: www.1art.com
Tuesday, January 16, 2007
నరుడు
నరుని నాళ్ళు ఎన్నని?
తలచిన చాలు వాడొకనాడు!
మరణమన్నింటికీ ముగింపని
ఎన్నడెరుగునో వాడు!
ప్రతి పొద్దులో ఒక హద్దుని చేరగ
శక్తి యుక్తులను సమీకరించి
ఏదో సొంతం చోసుకోవాలని
కాలంతో కలియబడుతూ
కోరికలకంతం కనుగొనాలని
అనుక్షణం పరితపిస్తూ
జీవితం స్వర్గధామమవ్వాలని
నిద్దురలోనూ నెమ్మదిలేని మది కోరిక
నరుని నాళ్ళు ఎన్నని?
తలచిన చాలు వాడొకనాడు!
మరణమన్నింటికీ ముగింపని
ఎన్నడెరుగునో వాడు!
తొలి ప్రచురణ "పొద్దు"లో... http://poddu.net/
Subscribe to:
Posts (Atom)