Monday, March 26, 2007

మిలియనీర్

Mrs.Lavish:నన్ను పెళ్ళి చేసుకొన్నాకే మా ఆయన మిలియనీరయ్యాడు

చెలికత్తె:ఒహో! ఇంతకుముందు మీ ఆయనేంటి?

Mrs.Lavish:బిలియనీర్!

Wednesday, March 21, 2007

సెంచరీ-వంద తెలుగు టపాలు పూర్తి

క్రికెట్టైనా,టపాలైనా సెంచరీ అయితై ఎవరికానందముండదు చెప్పండి!సరదాగా మొదలెట్టిన బ్లాగు తెలుగులో వంద టపాలు పూర్తి చేసుకొంటుందని అనుకోలేదు.మీ విమర్శలు,అభినందనలే నన్ను రాయడానికి ప్రొత్సహించాయనటంలో సందేహం లేదు.ఇంతకాలం ఓపిగ్గా నా బ్లాగు వాగుడ్ని భరించినందుకు కృతజ్ఞతలు.చిన్నప్పటినుండీ ఆంగ్లమాధ్యమంలోనే విద్యాభ్యాసం చేసినా(అలా అని ఇంగ్లీషులో పెద్ద తోపును కాదులేండి!) తెలుగు భాషపై నాకున్న ఆశ నన్ను తెలుగులో వ్రాసేలా చేసింది.మున్ముందు ఇంత విరివిగా వ్రాస్తానో లేదో తెలియదు కాని వ్రాయడమైతే మానను గాక మానను.బ్రతుకు తెరువు బాకు గుచ్చుకొని భావుకత గాయపడుతూనే ఉంటుంది, అయినా ఆశ చావదు అని ఒక అనామక కవి ఎందుకన్నాడో ఇప్పుడిప్పుడే అర్థమవుతొంది.అవును తెలుగు భాష తీయదనం అలాంటిదే మరి.తెలుగు మత్తు పట్టుకొంటే ఒక పట్టాన వదలదు...ఇదొక తియ్యని వ్యసనం,తీరని దాహం!మరోసారి మీ అందరికీ "వంద"నములు!

మగవాడి అబద్ధం

కట్టెలు కొట్టువాడు కట్టెలు కొట్టుచుండగా వాని గొడ్డలి జారి ప్రక్కనే వున్న నదిలో పడిపోయెను. తన జీవనాధారమైన గొడ్డలి పోయినదని అతడు వల వల ఏడ్చుచూ నది ఒడ్డున కూర్చుండెను.
అతని దు:ఖమును చూచి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏమి జరిగినదని అడిగి తెలుసుకొని నది దేవత వెంటనే నదిలోకి మునిగి, ఒక బంగారు గొడ్డలి తెచ్చిచూపెను. ఇది నాదికాదనెను. దేవత తిరిగి వెళ్ళి ఈసారి వెండి గొడ్డలి తెచ్చెను. వాడు అది చూచి అదియు నాదికాదనెను. దేవత మరల వెళ్ళి ఇనుప గొడ్డలి తెచ్చెను. ఆ అదియే నాది అని కట్టెలవాడు దానిని సంతోషంతో తీసుకొనెను. నది దేవత వాని నిజాయితీకి మెచ్చుకొని ఇనుప గొడ్దలితో పాటు బంగారు, వెండి గొడ్డళ్ళు కూడా బహుమతిగా ఇచ్చెను.

ఒకరోజు వాడు అదే నది ఒడ్డున తన భార్యతో నడుస్తూంటే,ఆమె అనుకోకుండా కాలుజారి ఆ నదిలో పడిపోయింది.తన భార్య కోసం విలపిస్తున్న అతని చూసి మళ్ళీ నది దేవత ప్రత్యక్షమై నీటిలోనుండి సినితార స్నేహను తెచ్చి ఈమె నీ భార్యా? అని అడగగానే అతడు వెంటనే అవునననగా,నది దేవతకు ఒళ్ళుమండి,దూర్తుడా...మంచివాడివనుకొంటే ఇంత సంకుచిత బుద్ధా నీకు? ఎందుకు అబద్ధమాడావో చెప్పు అంది.దానికి వాడు,నేను నిజం చెబితే తరువాత మీరు,ఏ శ్రియనో,హన్సికనో తీసుకొస్తారు.నేను మళ్ళీ నిజం చెబితే చివరకు నా భార్యతో పాటు వీరిని బహుమానంగా ఇస్తావు.నీవిచ్చిన ధనరాశులతో ఒక్క భార్యను పోషించడమే కష్టమవుతుంటే ఇక ఇద్దరితో వేగేదెట్లా అని ఆలోచించి, మీరు ముందు స్నేహను చూపించగానే కమిటైపోయాను అని సమాధానమిచ్చాడు!

నీతి:మగవాడు ఎన్నబద్ధాలాడినా దానికి ఎదో ఒక మంచి కారణం ఉంటుంది :)

Wednesday, March 14, 2007

సర్వే

గొప్ప పరిశ్రమ స్థాపించాలని ఉవ్విళ్ళూరుతున్న ఒక సంపన్న యువకుడు ముందుగా ఇతర పరిశ్రమలు,సంస్థల గురించి తెలుసుకోవడం మంచిది అని అలోచించి ఒక సర్వే చేయాలనుకొంటాడు.ముందుగా హైటెక్ సిటీకి వెళ్లి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో, మీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు అని అడిగాడు, దానికి సదరు ఉద్యోగి, సుమారు ఒక 300 మంది అని చెప్పాడు.అతని దెగ్గర ఇతర వివరాలు తీసుకొని అమీర్‌పేట్‌లో ఉన్న ఒక కాల్ సెంటర్ ఉద్యోగిని పిలిచి మీ సంస్థలో ఎంతమంది పని చేస్తారు అని అడగ్గా,200మంది మూడు షిఫ్ట్లలో పనిచేస్తారు అని చెప్పాడు.పనిలోపని ఒక ప్రభుత్వ సంస్థ గురించి కూడా వివరాలు తెలుసుకొంటే మంచిదనుకొని దెగ్గరలో ఉన్న హూడా కాంప్లెక్స్‌కి వెళ్లి అక్కడ బయట కాంటీన్‌లో తీరిగ్గా కూర్చొన్న హూడా ఉద్యొగిని, మీ సంస్థలో ఎంతమంది పని చేస్తారు అని అడిగాడు...దానికతడు తాపీగా సుమారు మూడోవంతు మంది అన్నాడు!

అమెరికన్ల అతితెలివి

నాసా అంతరిక్ష యాత్రలు చేస్తున్న తొలినాళ్ళలో గురుత్వాకర్షణ లేని చోట బాల్ పాయింట్ పెన్ పనిచేయదని కనుగొని సుమారు 12 బిలియన్ డాలర్లు ఖర్చుచేసి దశాబ్దం పాటు పరిశోధనలు చేసి మొత్తానికి గురుత్వాకర్షణలేని చోట,నీటిలోనూ,తలక్రిందులుగా,గాజుతో సహా ఎటువంటి ఉపరితలంపైనైనా,అతిశీతల ఉష్ణోగ్రతలనుండి సుమారు 300 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితుల్లో వ్రాయగలిగే మహత్తరమైన పెన్నును కనిపెట్టారు!

ఇంతాచేసి రష్యన్లు ఏం వాడతారో అని అరా తీయగ పెన్సిల్ వాడతారని తెలిసింది :)

Tuesday, March 13, 2007

కోతల రాయుళ్ళు

చాన్నాళ్ళకు కలుసుకొన్న ఇద్దరు కోతలరాయుళ్ళు తమ తండ్రుల గొప్పతనం గురించి కోతలు కోయసాగారు...ఒకడు,"నాగార్జునసాగర్ డాం మా నాన్నే కట్టాడు" అన్నాడు.అందుకు రెండోవాడు,"ఓస్ అంతేనా! మృతసముద్రం తెలుసా నీకు? దాన్ని చంపింది మా నాన్నే" అన్నాడు!
కరిగిన కలలే బీజంగా
చిగురించిన కోరికలు...
పొద్దు పొడుపు!
---------------------------------
 
తల ఎప్పుడు నెరిసిందో తెలియలేదు
తన్మయత్వంగా తననే చూస్తూ...
ప్రేమా?
---------------------------------
ఆకులు రాలిన చెట్టు కొమ్మకు
చిక్కుకొన్న గాలిపటం
చల్లని గాలిగి రెపరెపలాడిది...
బద్దకపు నిశ్శబ్ద నిశిపై విసుగ్గా!
హేమంతం!
----------------------------------
ఒంటరితనపు వెన్నెలమంటల్లో
నడిరేయిలో నిదురరాక
చంద్రుణ్ని, చెలి ఛాయాచిత్రాన్ని
మార్చి మార్చి చూస్తూ...
కార్తీక మాసం!  
--------------------------------- 
 

సంకెళ్ళు


నిన్నే చూస్తూ కదలక నిలిచిన నన్ను చూసి

విసుగెత్తి కసురుకొంటూ కరిగిపోయింది కాలం... నను మరచి!

అయినా నీ కళ్ళు నా కళ్ళకేసిన చూపుల సంకెళ్ళు

నాకూరటనిచ్చాయి,నీ రూపం నాలో నిత్యం పదిలమని!

కసాయి లోకం

అలల లాస్యం ఆలరించగ
కలల తీరం కానరాగ
కరువైన విరామం
కొంతైనా దొరుకునని
క్షుద్బాధను శాంతిపగ
సంద్రమును నమ్ముకొని 
కడలి సుడులకు హడలిపోక
పడవ కడకు అడుగులేయగ
పథమెరుగని పాదములకు
తీరమే స్థిర నివాసమై
భారమైన బతుకులకు
సారము సముద్రుడై
సుఖముగ సాగిపోతున్న
తీరవాసుల సంసారముపై
పంచభూతములు పగబట్టెనో?
పుడమి పగలగ అగ్ని జిమ్మగ
జోరున హోరుగాలి చెలరేగగ
ఎగసిపడిన సంద్రుడు సునామై
ఎందరినో కడదేర్చెను!
తమ బతుకునావలకు
లంగరు నీవని నమ్మిన సంద్రం
నిండా ముంచగ కార్చిన కన్నీటితో
పగిలిన ఓడలవలె
చెదరిన బతుకులకు
మరమత్తు కావాలని
జనసంద్రాన్ని అర్థించగ
ఒరిగిన సాయం శూన్యం!
కలి లోగిలో కసాయి పెద్దలు
విచ్చలవిడిగా పాగావేయగ
కడవెడు కలికైనా నోచుకోని
చిన్నారుల ఆకలి కేకలో
ఇంటిని ఆదుకొనగ ఆక్రందనలో
దిక్కు తోచని అభాగ్యులెందర్నో
బలిసిన కసాయి మృగాలకు
మక్కువైన ప్రాణమునిలుపుటకు
తమ కిడ్నీలకు వెలకట్టి
పీక్కుతినే రాబందులకీయగ
సజీవ శవాలుగ మార్చాయి
యజ్ఞ హవిస్సుని జేసాయి!

 
(తమను మింగిన సాగరానికంటే కూడా ప్రమాదకమమైన మనుషుల మృగ వాంఛలకి,ప్రభుత్వ నిర్లక్ష్యానికి,అవినీతి అధికారుల ధన దాహానికి క్షణ క్షణం మరణిస్తున్న సునామీ బాధితుల దీనావస్థను గూర్చిన ఈ వార్త చదివి మండిన గుండెలో ఉప్పొంగుతున్న ఆవేదన ఇది)  

Thursday, March 08, 2007

జ్యోతిష్కుడు

ఒకతను ఏం పనిలేక అటుగా వస్తున్న జ్యోతిష్కుడ్ని చూసి ఆట పట్టిద్దామని అతన్ని పిలిచి, నా గురించి ఎదైనా ఒక్క విషయం సరిగ్గా చెబితే నీకొక వెయ్యి రూపాయలిస్తా...లేకపోతే నువ్వు నాకు వందివ్వు చాలు..ఎమంటావు? అన్నాడు.జ్యోతిష్కుడికి పౌరుషం తన్నుకొచ్చి సరే అన్నాడు.తరువాత ఎదో ఒక పటం తీసి దాని మీద గవ్వలు విసిరి,ఆ గవ్వలను చూస్తూ,మీరు ఇద్దరు పిల్లలకి తండ్రి అన్నాడు.వెంటనే సదరు వ్యక్తి ఎగతాళిగా నవ్వి,వంద నోటిచ్చుకో,నాకు ముగ్గురు సంతానం అన్నాడు.వెంటనే జ్యోతిష్కుడు పకపకా నవ్వి ముందు నువ్వు నాకు వెయ్యి రూపాయలివ్వు,నీక్కాదు, నీ భార్యకు ముగ్గురు సంతానం,కాని నువ్విద్దరికి తండ్రివి అన్నాడు!

Tuesday, March 06, 2007

హెయిర్-కట్

ఒకతను పిల్లాడితో హెయిర్-కట్ సెలూన్‌లోకి ప్రవేశించాడు.తను హెయిర్ కట్,ఫేస్ వాష్,మసాజ్,షేవింగ్ అన్నీ చేయించుకొన్న తరువాత పిల్లాడ్ని కూడా కటింగ్ చేయించుకోమని చెప్పి,నీ స్కూల్ డ్రెస్ టై చిరిగిపోయిందన్నావ్ కదా, నీ హెయిర్ కట్ పూర్తయ్యేలోగా నేనెళ్లి కొత్తది కొనుకొస్తాను అని చెప్పి బయటకెళ్లాడు.పిల్లాడి కటింగ్ పూర్తైనా కూడా ఎంతసేపటికి అతను రాకపోయేసరికి,షాపువాడు, మీ నాన్న నీ సంగతి మర్చిపోయినట్లున్నాడు అని పిల్లాడితో అనగానే,పిల్లాడు,వాడు మా నాన్నేంటి...ఎదో ఫ్రీ హెయిర్ కట్ చేయిస్తాను,నా స్కూల్ టై కొనిపెడతాను అంటే సరే అని వాడితో వొచ్చా, అన్నాడు! 

"జై కిసాన్" అంటే ఆల్బెట్రాస్‌ని చంపకూడదు అన్నంత సత్యం!


"ఆల్‌బెట్రాస్"నేమి చేయరు,దాన్ని చంపితే అపశకునం అని కళాసులనుకొంటుంటే నిజమే అనుకొన్నా!నేనే కళాసినై సంద్రంపై పోగా తెలిసింది వాటి వేట ఒక సరదా ఆటని...అయినా ఎందుకో ఆ నమ్మకాలు!చంపినోల్లే చెబుతరు వాటికి హాని జేస్తే కీడని...విన్నప్పుడల్లా నవ్వొస్తది ఏడుపు కళ్ళకి తోడుగా!ఇంకేదో గుర్తుకొస్తది...

చిన్నప్పుడు పల్లెకు పోయి ఎండలో గట్లెమ్మటి పల్లె సోదరుల్తో తిరుగుతూ కంచెపై ఎండిన బీరకాయల్ని తెంపి గొడ్లని గెదమడానికి వాటిని విసిరికొడుతూ దుమ్ము లేసేలా కాళ్ళీడుస్తూ తాటిచేట్లను చేరంగనే పల్లెలుండే అత్త కొడుకరిసిండు మా పట్నం బాబుకి ముంజలు కొట్టండ్రా అని...నెత్తినెక్కిన సూరిడిని అందుకోడానికన్నట్టు తాడుకట్టి రైయ్యన పోటీ పడి పాకిన్రు చెట్లపైకి ఇద్దరు పోరండ్లు!కొడవలి దెబ్బకు కాడి కుండ పగిలినట్లు దడేల్న కిందపడ్డై గెళ్లు.అత్తకొడుకు కొడవలితో లాఘవంగ ఒలిసిచ్చిన ముంజలు ఆత్రంగా అందుకొని నొటికి కర్సుకొంటే యమ చేదనిపించినై....అత్తకొడుకు మార్చి మార్చి ఎన్ని ముంజలిచ్చినా అదే ఎగటు...అన్నీ చేదైనై!పక్కనున్న పొట్టి పోరడు గొల్లున నవ్వి కంచెపైన చేదెక్కిన బీరకాయల్ని పట్టుకొంటే చేతులెట్ల సక్కగుంటై అన్నడు.పొట్టోడి బుర్రని మొత్తుతు అందరు నవ్విన్రు...అత్తకొడుకు తన చేత్తో ముంజలు నోటికందించిండు.
పీకలదాకా ముంజలు మెక్కి రొప్పుతూ ఏటిని చేరి హాయిగ బండలపై కూచొంటే నసపిట్టసైతం నోరెల్లబెట్టేట్టు వాగే పొట్టోడు ఏటి పుట్టుక చెప్పిండు.ఊరవతల చిట్టడివిల కుహరంలో పుట్టింది ఈ తేట నీళ్ళ ఏరని...వాడి కత కంప్లీటు కాకముందే అందరం ఏట్లొకి దుమికినం!మన్ను పట్టిన ఒడలతో ఏటి సింగారానికి మట్టి రంగులద్దినం! ఎండలో చల్లగ ఎంత హాయిగుందో అనిపించింది...ఒకరిపై ఒకరం నీళ్ళిసురుతొంటే అత్తకొడుకు గమ్మునున్నడు...తడిసిన మొఖంలో తళుకు లేదు..మనిషిక్కడేగాని మనసెక్కడోలాగుంది.గుంతలు పడ్డ కళ్ళలో బాధేదో గూడుకట్టుకొంది,గుప్పెడు గుండెలో అగ్నిగుండమేదో రగులుతొంది...మండే సూరిడు దడుసుకొనేలా పిడికిలి నీటిపై గుద్దిండు...నసపెట్టే పొట్టోడు ఉలిక్కిపడి మాటలు నములుతొంటే అత్తకొడుకు చెప్పిండు-ఏటికవతలున్న మాబోటి పేదల భూములి ఎప్పటికీ మాయే అని ఒట్టేసి నొక్కిజెప్పిన గవర్నమెంటోళ్ళు రేపో మాపో నాలుగు రొక్కాలు చేతిలో పెట్టి ఆ భూమిలో ఎదో పెద్ద బిల్డింగు కడతరట...సిటీకి దెగ్గర మా ఊరు కాబట్టి చాలా లాభముంటదట...ఏం ఢోకా లేదు, మాకందరికి సక్కటి జీతాల్తో పనులు దొరుకుతయ్యట...భూమి గుంజుకొని బువ్వ దొరుకుతదంటరు..ఏమోమరి! ఎందుకో గుండెలో దడ..

భూములు పోయె,బతుకులూ తెల్లారే!నగరాభివృద్ధిలో నామరూపాల్లేకుండా కొట్టుకుపోయిన బతుకులెన్నో!కాలంతో పరుగులిడటం అంటే కంఠాలని కోయడమని,మెగా సిటీ,మెట్రో సిటీ,మాళ్ళు,మహళ్ళు,బహుళజాతి సంస్థలు,అంతర్జాతీయ విమానాశ్రయాలు...ప్రజల అవసరాలు తీర్చే వీటన్నిటికి చోటియ్యోద్దా?అని తెగ అమాయకపు ప్రశ్నలడిగే ప్రజల ప్రభుత్వానికి ఈ ప్రశ్నలెందుకు తట్టవో ఎంటో...భలే విడ్డూరం!గుంజుకొన్న ఆస్తులకి విలువ కట్టిచ్చే నష్ట పరిహారాలు బతికినంతకాలం ఒంటిపొద్దు గంజికి సరిపోతాయా?పేదరికానికన్నా పేదల్ని నిర్మూలించడమే ఈజీ అనేదే పెద్దోళ్ళ ఎజెండానా?రైతే ఈ దేశానికి వెన్నెముక అని,"జై జవాన్!జై కిసాన్" అని నినదించిన దేశంలో కిసాను సైతానయ్యాడా?అంతులేని ప్రశ్నల అలజడిలో అల్లరి మానలేదు పొట్టోడు,చెట్టుకింద నోరెల్లబెట్టి ఊగుతున్నాడు,వాడు మాట్లాడకపోయినా ఉరేసుకొని చచ్చిన వాడి చుట్టూ చేరిన రాబందులు గోల పెడుతున్నాయి-అన్నీ పోయినోడు బతికుండి ఏం చేస్తాడని వాటి గోలేమో!

"గోల్డ్ కోస్ట్" బీచ్‌లో నడుస్తొన్న నాకు,"ఆల్బెట్రాస్"ని చంపితే కీడు అని చిన్న పిల్లలకి కథలు చెబుతొన్న కళాసిని చూసి నవ్వోచ్చింది!

Saturday, March 03, 2007

ఆశావాదం


అద్దంలా అంబరం రోజంతా తేట తెల్లని వెలుగులీనగ
అక్షయ లోకపు అందమంతా వెల్లివిరిసిన పచ్చికలో
ఆశగా నడిచిన అడుగడుగు మదిలో ఆహ్లాదం నింపగ
తరుల గిరిపై నిత్యం వసించిన ఎంత మేలని తలచితి
మసగబారు వెలుగు అసుర సంధ్య ఆగమనమని,
నను అవరోహణమవమని ఆగాదముకు తోసివేయగ
నేలను దిగిన ఆ ఆనందం నశించునెందుకో నాలో
మలినం నాలోనో లేక ఇలలోనో అవగతమవక
ఒంటరిగా గడిపిన ఆ గడియలు నను పెనవేసుకొంటే
నాలోని ఆ గొఱ్ఱెపిల్లల స్వచ్చత నా ప్రాణమైతై...
అత్యాశేమో,స్వార్థమేమో,కపటమేమో ఈ తలంపు
అని నాలో మరో పార్శ్వం నను ప్రశ్నించింది
ఆశావాదానికి ఎల్లలు గ్రహించే పరిపక్వత నాలో లేదేమో!
కానీ ఎల్లలులేని "నిద్ర"లోకి జారుకొన్న నన్ను చూపిస్తూ
కాలం సమాధానం చెప్పింది నెమ్మదిలేని గాలితో...